ఉపాధి హామీ చట్టంపై నిర్లక్ష్యమెందుకు?

దేశంలో అత్యధిక గ్రామీణ ప్రజానీకానికి చేరువైన సంక్షేమ కార్యక్రమం ఏదైనా ఉన్నదంటే అది 'మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం'

Update: 2024-04-10 00:45 GMT

దేశంలో అత్యధిక గ్రామీణ ప్రజానీకానికి చేరువైన సంక్షేమ కార్యక్రమం ఏదైనా ఉన్నదంటే అది 'మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం'. గ్రామీణ భారతంలో కోట్లాది మందికి ఉపాధి కల్పన ద్వారా నిరుద్యోగ సమస్యను రూపుమాపడం, గ్రామీణ వలసలను అంతమొందించడం, సామాజిక ఆస్తులను సృష్టించడం, గ్రామీణ గిరాకీని పెంచి, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం ఈ పథకం లక్ష్యం.

ఈ పథకం అమల్లోకి వచ్చి సుమారు 18 సంవత్సరాలు దాటింది. ఈ పథకం కింద నిర్ణీత కాలంలో గ్రామీణులకు ఉపాధి లభించి, కొంతమేరకు వారి బతుకుల్లో ఆశా దీపాలు వెలిగిన మాట నిజం. అయితే, ఈ పథకానికి మోడీ ప్రభుత్వం గత నాలుగైదు సంవత్సరాలుగా కేటాయింపులను తగ్గిస్తూ వస్తుంది.

7.6 కోట్ల కార్డులు తొలగించి..

ఉపాధి హామీ చట్టాన్ని మోడీ సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నదని, బీజేపీ పాలనలో ఈ పథకానికి నిధులు సరిపోనివ్వటంలేదని గణంకాలు సూచిస్తున్నాయి. దీంతో కార్మికులకు తక్కువ వేతనాలు అందుతున్నాయని యూనియన్ నాయకులు, సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యావేత్తలు, కార్యకర్తల కన్సార్టియం అయిన లిబిటక్ ఇండియా అందించిన డేటా ప్రకారం.. గత 21 నెలలుగా 7.6 కోట్ల జాబ్ కార్డులు తొలగించబడ్డాయి. 2013-14లో గ్రామీణ ఉపాధి చట్టం మొత్తం బడ్జెట్లో 1.98 శాతం వాటాను కలిగి ఉన్నది. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 2023 - 24 మొత్తం బడ్జెట్లో 1.33 శాతానికి తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) సవరించి అంచనాలతో పోల్చితే కేటాయింపుల్లో పెరుగుదల మాత్రం శూన్యం కావడం గమనార్హం.

ఒక్క సీజన్‌లో 65 కోట్ల నష్టం

గ్రామాల్లో వ్యవసాయ పనులు పూర్తయిన తర్వాత ఫిబ్రవరి నుంచి మే నెల వరకు రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగుతుంటాయి. అయితే, ఈ సమయంలో ఎండల తీవ్రత అధికం ఉంటుంది. దీంతో ఉపాధి పనులకు వచ్చే కూలీలకు సాధారణంగా చెల్లించే వేతనానికి మరికొంత మొత్తాన్ని అదనంగా చేర్చి చెల్లింపులు చేసేవారు. ఫిబ్రవరి నెలలో 20 శాతం, మార్చి నెలలో 25 శాతం, ఏప్రిల్, మే నెలలో 30 శాతం, జూన్ నెలలో 20 శాతం అదనపు భత్యంగా చెల్లించేవారు. దీంతో ఈ కాలంలో కూలీలు అదనపు ఆదాయం పొందే వారు. అదనంగా భత్యం వస్తుండటంతో ఈ సీజన్లో పనికి వచ్చే కూలీల సంఖ్య కూడా అదనంగా ఉండేది. పనులు వేగంగా జరిగేవి. కానీ, కూలీలకు వేసవిలో చెల్లించే అదనపు భత్యం మూడేళ్లుగా అమలు కావడం లేదు. ఇప్పటికైనా అదనపు కూలీ చెల్లించడానికి ఆదేశాలు వస్తాయని ఎదురుచూస్తున్నప్పటికీ, ఇప్పటిదాకా ఎలాంటి మార్గదర్శకాలు లేవు. పైగా ఉపాధి హామీ పథకం ప్రారంభించినప్పటి నుంచి కార్యకలాపాలు కొనసాగించిన సాఫ్ట్‌వేర్‌కు బదులుగా కొత్తగా ఎన్ఐసి సాఫ్ట్‌వేర్‌కు మార్చారు. వేసవి భత్యం చెల్లింపునకు సంబంధించిన ఆప్షన్ ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌లో లేకపోవడంతో ఈసారి కూడా ఉపాధి కూలీలకు వేసవి భత్యం చెల్లింపు లేనట్టేనని తెలుస్తుంది. ఈ భత్యం నిలిపివేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కూలీలు ఒక్కొక్క సీజన్‌లో 65 కోట్లు నష్టపోతున్నారు..

భారీ నిరుద్యోగం నేపథ్యంలో..

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలి రేట్ల కింద రోజు కూలి కనీసం రూ.500లుగా నిర్ణయించి అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా ఉపాధి హామీ పథకం కూలిరేట్లను సవరించారు. దీంతో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు వివిధ రాష్ట్రాలలో 4 శాతం నుంచి 10 శాతం వరకు కూలి రేట్లు పెరగనున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి పొంది.. సవరించిన కూలి రేట్లను మార్చి నెల 27వ తేదీన నోటిఫై చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం నైపుణ్యం లేని కార్మికులకు అత్యధికంగా హర్యానాలో రోజుకు రూ.374, అత్యల్పంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలలో రూ.234 చెల్లించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూలీ రేటు రూ. 28 లు పెరిగి రూ.300 కు చేరింది. నోటిఫికేషన్ వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవాలలో సుమారు 10 శాతం వరకు కూలీ రేట్లను పెంచారు. అలాగే అదనపు భత్యం అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశంలో తక్కువ ఆదాయం, భారీ నిరుద్యోగం ఉన్న పరిస్థితుల్లో, వ్యవసాయ కార్మికుల జీవితాలు వారి సంక్షేమం దృష్ట్యా ఎక్కువ నిధులు కేటాయించి వారికి సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఉజ్జిని రత్నాకర్ రావు

94909 52646

Tags:    

Similar News