'వైల్ వీ వాచ్డ్' జర్నలిస్ట్ డాక్యుమెంటరీ!

While We Watched documentary is a biography of NDTV journalist Ravish Kumar

Update: 2023-08-19 00:30 GMT

'వైల్ వీ వాచ్డ్ ' అనే డాక్యుమెంటరీ చిత్రం ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ డాక్యుమెంటరీ లండన్‌లో గల నెల 14న విడుదలైన ఈ డాక్యుమెంటరీ భారతదేశంలోని ప్రముఖ జర్నలిస్ట్ లలో ఒకరైన రవీష్ కుమార్‌ది. ఆయన ఎన్డీటీవీ ప్రైమ్ టైం యాంకర్‌గా, ఎక్స్‌క్యూటివ్ ఎడిటర్‌గా ఇటీవలి వరకు పనిచేశారు. అలా ఎంతో అద్భుతంగా సాగుతున్న ఎన్టీ టీవీని వ్యాపారస్తుడు అదానీ సొంతం చేసుకోవడంతో ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి సొంతంగా 'ఆఫీషియల్' పేరిట య్యూటుబ్ ఛానల్ పెట్టుకొని అతి తక్కువ కాలంలో అరున్నర మిలియన్లకు పైగా సబ్‌స్క్రయిబర్‌లను సంపాదించుకున్న రవీష్ కుమార్ గురించి తీసిన చిత్రం ఇది.

ఎన్నో అవార్డులు సంపాదించుకొని

నిజానికి భారతదేశంలో జర్నలిజంకు స్వర్ణయుగం ఎన్నడూ లేదు. ఉంటుందని భావించడం లేదు. కార్పొరేట్ జర్నలిజం అత్యంత వేగంగా గోదీ మీడియా రూపంలో పాలకుల పక్షంలో చేరి దేశాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నది. ప్రస్తుతం జర్నలిజంలో చీకటి యుగం నడుస్తుంది. దేశంలోని అనేక ఛానల్స్, పత్రికలు మనదేశంలో తమ నైతికతను పక్కన బెట్టి రాజీ పడిపోయిన పరిస్థితి ఉంది, అతిశయోక్తి కాదు. శక్తిమంతులైన వారితో, అధికారంలో ఉన్న పార్టీలతో సన్నిహితంగా ఉండే జర్నలిస్టుల కారణంగానే జర్నలిజం అసలు ముఖం నలిగిపోతున్నది. ఈ రోజు మీడియా పర్యావరణాన్ని గోది మీడియా నాశనం చేసింది. దేశంలో 12 లక్షల కోట్ల స్కాంకు పాల్పడిన గౌతమ్ అదానీ ఎన్డీటీవీని కొనుగోలు చేయడం వల్ల రవిష్ కుమార్ బయటకు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే పరిస్థితి నెలకొంది.

బీహార్‌లోని చంపారన్ సమీపంలోని జీత్వార్ పూర్‌కు చెందిన రవిష్ కుమార్, 1974 డిసెంబర్ 5న జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదివిన ఆయనకు భార్య నయనా దాస్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1994 నుంచి 2022 వరకు ఎన్డీటీవీలో ఉన్న ఆయనకు 2019లో రామన్ మెగసెసే అవార్డుతో పాటు, రెడ్ ఇంక్ అవార్డు, రాంనాథ్ గోయాంక అవార్డులు, ఇంకా ఎన్నో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులు లభించాయి. ప్రతీ విషయాన్ని, నేలమీది నిజంను చెప్పే, ఎంతటి వారినైనా న్యాయం వైపు నిలబడి ప్రశ్నించే రవిష్ కుమార్‌కు ప్రపంచం మొత్తంలో కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు.

నిష్పక్షపాత రిపోర్టింగ్ చేస్తూ..

రవిష్ కుమార్‌పై 'వైల్ వీ వాచ్డ్' డాక్యుమెంటరీ చిత్రాన్ని డైరెక్టర్ వినయ్ శుక్ల తీశారు. ఈ ఏడాది జులై 14న విడుదల అయిన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. పెద్ద పెద్ద విదేశీ పత్రికలు, ఛానల్స్ 4 స్టార్స్, 5 స్టార్స్ ఇవ్వడం, సమీక్షలు జరిపిన సందర్భంగా ఈ చిత్రాన్ని దేశానికి గర్వకారణంగా పేర్కొనవచ్చు. ఈ చిత్రంలో పాక్షిక, ఫాక్స్ టీవీ లకు సోకిన పీఎం మోడీ అనుకూల జాతీయవాద హిస్టీరియా గురించి, దానికి వ్యతిరేకంగా, మర్యాద పూర్వకంగా, ధైర్యంగా నిలబడిన లిబరల్ జర్నలిస్ట్ రవిష్ కుమార్. కాశ్మీర్‌లోని పుల్వామాలో భారతీయ సైనికుల కాన్వాయిపై దాడి, బాలాకోట్‌పై వైమానిక దాడి, 2019 ఎన్నికలకు ముందు ఉద్రిక్త కాలం వీటన్నింటిపై రవిష్ నిష్పక్షపాత రిపోర్టింగ్ చూస్తాం. పీఎం మోడీ విస్మరిస్తున్న విస్తృత పేదరికంపై రిపోర్ట్‌ చేయడంలో రవీష్ ప్రదర్శించిన నిశ్శబ్ద ధైర్యాన్ని మనం ఈ డాక్యుమెంటరీలో చూస్తాము.

ఇలాంటి సందర్భంలో ఎన్డీటీవీపై పెరిగిన ఒత్తిడులు, రవిష్‌ను, అయన భార్య పిల్లలను చంపేస్తామని బెదిరింపులు పెరగడం, ఆయన మీద విపరీతంగా సాగిన ట్రోల్స్‌కు తక్కువేం లేదు. ఒక నిజాయితీపరుడు అయిన, నిజం కోసం, ప్రజాస్వామ్యం కోసం తపన పడే జర్నలిస్ట్ జీవితం ఎంత ప్రమాదకరంగా, ఇబ్బందికరంగా ఉంటుంది, వారి కుటుంబం ఎలా ఇబ్బంది పడుతుంది అనేది ఈ డాక్యుమెంటరీలో చూయించాడు డైరెక్టర్ శుక్ల. ఆయనకు అభినందనలు. ప్రధాన స్రవంతి మీడియాలో రవిష్ కుమార్ సొంత స్థానం, విలువలు ఏదో ఒక విధంగా మనుగడ సాధిస్తాయని సూచించే ధైర్యంతో, ఆశతో ఈ చిత్రం ముగుస్తుంది. ముగింపు మాదిరే రవిష్ సొంత యూట్యూబ్ ఛానల్ అద్భుతమైన సబ్‌స్క్రయిబర్లతో విజయవంతంగా ముందుకు సాగుతున్నది. అదే ధైర్యం, ఆత్మ స్థయిర్యంతో రవీష్ ఉన్నారు. అభినందనలు రవిష్ కుమార్‌. హమ్ ఆప్ కే సాత్ హై రవిష్ జీ ప్రొసీడ్!

నిజాన్ని జీర్ణించుకోలేని వారు…

రవిష్ కుమార్ మీద తీసిన డాక్యుమెంటరీ చిత్రం ఇండియాలో రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. తప్పకుండా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. షోలోంపే చల్నా, కాంటోంపే సోనా హంనే తో 50 సాల్కే నీఛేహి సీక్లీయా! ఉసిలియేతో బేబాక్ కలం హమారే హాత్ మే హై! (నిప్పుల మీద నడవడం, ముళ్ల మీద పడుకోవడం ఎప్పుడో 50 ఏండ్ల క్రితమే నేర్చుకున్నాను, అందుకే ఈ వయసులోనూ ధైర్యంగా కలం పట్టుకున్నాను). ఇంకా నేల మీద నిజాలు రాసే జర్నలిస్ట్‌లు బతికే ఉన్నారు, కాబట్టి కాస్తో, కూస్తో గొంతు ఎత్తే వారికి స్పేస్ దొరుకుతున్నది. కానీ రానున్న రోజుల్లో నిజం రాసే, మాట్లాడే వారికి ఇబ్బందులు తప్పేట్లు లేవు. నిజం కన్నా అబద్దానికే పాలకుల మద్దతు లభించే పరిస్థితి ఇప్పటికీ ఉంది.

జీనా హై, ఔర్ సచ్ లిక్నా హోతో! లడ్నా మర్నా భి సీక్నా, జరూరి హై! జిందగీ కో కిత్నా ప్యార్ కర్తెహో, మౌత్ సే భి వహి రిష్తా నిభానేకా దం హోనా చాహియే భాయ్! పాత్రికేయ వృత్తిలో కమిట్మెంట్ లోపిస్తున్నది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కేవలం ప్రభుత్వ కార్యక్రమాల కవరేజ్ కోసమే అనే పరిస్థితి ఉంది. బతకడానికి ఒకప్పుడు బడిపంతులు నౌకరి అనేవారు, ఇప్పుడు జర్నలిజం గతి కూడా అంతేనా అనిపిస్తున్నది. నిజం చెప్పడం, రాయడం, కత్తి మీద సాము అయిపోయింది. నిజాన్ని జీర్ణించుకోలేని వారు ఎక్కువ అయిపోయారు. 'వైల్ వీ వాచ్డ్' చూడాల్సిన చిత్రం. ఒక రవీష్ కుమార్ చరిత్ర కాదిది, ఆయన లాంటి ఎందరో నడుస్తున్న నిజం!

ఎండి. మునీర్,

సీనియర్ జర్నలిస్ట్

99518 65223

Tags:    

Similar News