ఉద్యోగుల జీవిత బీమా పథకం

Employees' Life Insurance Scheme details

Update: 2024-11-06 00:45 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయులకు వారి సర్వీస్‌కు సంబంధించి పలు ప్రయోజనకర ఉత్తర్వులను వెలువరించడం జరిగిం ది. అందులో భాగంగానే ప్రభుత్వ జీవిత బీమా పథకంను ఏర్పాటు చేశారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశము ప్రభుత్వ సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రక్షణ, పదవీ విరమణ పొందిన వారికి పెద్ద మొత్తంలో ఆర్థిక వనరుల కల్పించే ఉద్దేశంతో ప్రారంభించబడింది.

బీమా పథకం ముఖ్యాంశాలు..

1.11. 1956 తర్వాత నియామకం కాబడిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఈ పథకంలో సభ్యునిగా చేరాలి. 20 సంవత్సరములు నిండిన 56 సంవత్సరాల లోపు వయసు గలవారికి సభ్యులుగా చేరుటకు అర్హత కలదు. ఉద్యోగులు ఈ పథకంలో చేరడానికి కనీసం సంవత్సరం సర్వీస్ చేసి రెగ్యులర్ స్కేలు పొందుతూ ఉండాలి. నెలసరి మూల వేతనం అనుసరించి ప్రీమియం చెల్లించాలి. నెలసరి ప్రీమియం ను డ్రాయింగ్ అధికారి ఉద్యోగి వేతన బిల్లు నుంచి మినహాయించి నిర్ణీత షెడ్యూల్ బిల్లుతో పాటు ట్రెజరీ అధికారులకు సమర్పించాలి. స్లాబ్ రేటు కంటే మూలవేతనంలో 20% లేదా 20 వేల రూపాయలు మించకుండా ఏది తక్కువ అయితే అది ఇన్సూరెన్స్ డైరెక్టర్ అనుమతితో ప్రీమియం పెంచుకునే అవకాశం ఉంది. ఆదాయం పన్ను లెక్కింపులో సెక్షన్ 80సి కింద సంవత్సర కాలంలో చెల్లించిన మొత్తానికి మినహాయింపు ఉంటుంది. ఆయా స్లాబ్స్ ప్రకారం ప్రీమియం చెల్లించాలి. మొదటి ప్రీమియంను మినహాయించిన తర్వాత, సదరు ప్రీమియం మొత్తం, టోకెన్ నెంబర్, తేదీ, మినహాయించిన నెల మొదలగు వివరాలతో నిర్ణీత దరఖాస్తును సంబంధిత అధికారి ద్వారా జిల్లా ఇన్సూరెన్స్ అధికారికి పాలసీ జారీకై పంపుకోవాలి. అదేవిధంగా మూలవేతంలో పెరుగుదల సంభవించి స్లాబులు మారినప్పుడు కూడా మరల నిర్ణీత దరఖాస్తును రెండవ పాలసీ కేటాయింపునకై పంపాలి.

పాలసీ నిలుపుదల కాదు..

జీత నష్టపు సెలవులో ఉండి, ఏ ఇతర కారణాల వల్లనైనా ప్రీమియం చెల్లించబడనప్పుడు పాలసీ నిలుపుదల కాదు. విధి నిర్వహణలో చేరిన పిదప, చెల్లించాల్సిన బకాయిలను వడ్డీతో సహా రికవరీ చేయాలి. ఏ ఇతర కారణాలవల్ల పాలసీదారుని జీతం తగ్గింపబడినను తప్పనిసరిగా అమల్లో ఉన్న ప్రీమియంనే చెల్లించాలి. పాలసీదారులు భార్య, భర్త, పిల్లలను, అదే విధంగా చట్టబద్ధమైన వారసులను నామినీలుగా సూచించవచ్చు. జిల్లా ఇన్సూరెన్స్ అధికారి పాలసీలను పదవీ విరమణ తేదీ నాటికి మెచ్యూర్ అగునట్లు జారీ చేస్తారు. పాలసీదారు అనగా ప్రభుత్వ ఉద్యోగి వాలంటరీ రిటైర్మెంట్, మెడికల్ ఇన్వాలిడేషన్, ఇతర కారణాలవల్ల పదవీ విరమణ గావిస్తే ఆ తేదీ వరకు నిబంధనలకు లోబడి పాలసీ సరెండర్ విలువను పొందవచ్చు. పాలసీ మెచ్యూర్ తేదీ వరకు మిగిలిన ప్రీమియం చెల్లిస్తూ మెచ్యూర్ తేదీ నాడు పాలసీ విలువను బోనస్‌తో సహా పొందవచ్చును.

సాధారణ బీమా కంటే బోనస్ ఎక్కువ

సాధారణ ఎల్ఐసీ కానీ ఇతర ప్రైవేటు ఇన్సూ రెన్స్‌ల కంటే ఈ పథకంలో చెల్లించే బోనస్ ఎక్కువ. ప్రతీ 1000 రూపాయలకు 85% బోనస్ చెల్లించబడుతుంది. ప్రతి ఉద్యోగి సర్వీస్ పుస్తకం లో పాలసీ నెంబరు, నామినీ పేరు, చెల్లిస్తున్న నెలసరి ప్రీమియం, మెచ్యూరిటీ తేదీ, మెచ్యూరిటీ విలువ మొదలగు వివరాలను తప్పనిసరిగా నమో దు చేయాలి. ప్రీమియం పెరిగి రెండో పాలసీ మంజూరు కాబడినప్పుడు కూడా సదరు వివరాలు నమోదు చేయాలి. ప్రతి ఆర్థిక సంవత్సరం పూర్తి అయిన పిదప అకౌంట్స్ స్లిప్పులను పొంద వచ్చును. పాలసీలో నిలువ ఉన్న మొత్తం‌పై 90% వరకు ఆయా కారణాలపై రుణాలను పొందవచ్చును. ఈ రుణాన్ని తిరిగి 12 నుంచి 48 వరకు వాయిదాలు మించకుండా తిరిగి చెల్లించాలి.

పాలసీదారు శాశ్వతంగా అశక్తుడైతే..

దురదృష్టవశాత్తు పాలసీదారుడు శాశ్వతంగా అశక్తుడైతే, భవిష్యత్తులో కట్టబడే ప్రీమియంను నుండి గరిష్టంగా నెలకు 500 రూపాయల వరకు రద్దు పరచవచ్చును. డెత్ క్లెయిములకై రిఫండ్ ఫారం నెంబర్ -2 అడ్వాన్స్ రసీదు స్టాంపుతో, పాలసీ బాండ్, డెత్ సర్టిఫికెట్ సమర్పించి సంబంధిత మొత్తాన్ని పొందాలి. ఇతర క్లెయిములకు రిఫండ్ ఫారం, అడ్వాన్స్ రసీదు స్టాంపుతో, పాలసీ బాండ్‌ను అదేవిధంగా పాలసీ జతచేస్తూ పనిచేసిన కార్యాలయం డ్రాయింగ్ అధికారి ద్వారా పంపి క్లెయిమ్ పొందవచ్చును. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 212 ఆర్థిక, ప్రణాళిక శాఖ తేదీ 17.12.97 ద్వారా ఈ పథకాన్ని పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు కూడా 1998 నుండి వర్తింపచేశారు.

సి మనోహర్ రావు

రిటైర్డ్ ప్రభుత్వ అధికారి

96406 75288

Tags:    

Similar News