మేనిఫెస్టోల ఆలస్యానికి కారణమేంటి?
What is the reason for the delay in manifestos
రాష్ట్రంలో ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఇందుకోసం పార్టీలు సైతం విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ నెల 15న మేనిఫెస్టోను విడుదల చేస్తామని అధికార బీఆర్ఎస్ ప్రకటించింది. ఇంకా కసరత్తు జరుగుతున్నదని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నామని బీజేపీ పేర్కొంటున్నది. దీంతో ప్రజలకు ఏం కావాలో ప్రధాన పార్టీలు ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నాయా అనే అనుమానం వ్యక్తమవుతున్నది.
ఎప్పటి వరకు ‘కాంగ్రెస్’ కసరత్తు?
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తీవ్ర జాప్యమున్నా.. ఎన్నికల కదన రంగంలో మాత్రం కాంగ్రెస్ ముందుగానే దూకిందని చెప్పాలి. గత మే లో వరంగల్‌లో రాహుల్ గాంధీతో సభ నిర్వహించి ‘రైతు డిక్లరేషన్’ను ‘హస్తం’ పార్టీ ప్రకటించింది. అధికారంలోకి వస్తే రైతులకు ఏమేం చేస్తామో ఆ డిక్లరేషన్‌లో పేర్కొన్నది. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, యూత్ డిక్లరేషన్లను ప్రకటించింది. దీంతోపాటు మహిళా, బీసీ, వివిధ డిక్లరేషన్లను ప్రకటించడానికి సిద్ధమవుతున్నది. మరోవైపు ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాయి. అయితే మేనిఫెస్టోను ఇప్పటికీ ఎందుకు ఫైనల్ చేయడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. శ్రీధర్ బాబు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇంకెంత కాలం అభిప్రాయాలను సేకరిస్తుందోననే అనుమానం కాంగ్రెస్ కార్యకర్తల్లోనే నెలకొన్నది. ఈ కసరత్తును త్వరగా ముగించి.. మేనిఫెస్టోను ప్రకటించకపోతే.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం కష్టమవుతుందని పార్టీ కేడర్ అభిప్రాయపడుతున్నది.
బీఆర్ఎస్ తూతూమంత్రమేనా?
అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న బీఆర్ఎస్.. ఇప్పటికీ తన మేనిఫెస్టోను విడుదల చేయలేదు. అయితే అక్టోబర్ 15న రిలీజ్ చేస్తామని ఇటీవల డేట్‌ను ఫిక్స్ చేసింది. పదేండ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు ఏం కావాలో ఇంకా తెలుసుకోలేకపోయిందా? అనే ప్రశ్న సామాన్యుల నుంచి వ్యక్తమవుతున్నది. గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయింది. దీంతో ఇష్టానుసారంగా హామీలు ఇచ్చేస్తే బడ్జెట్ సెట్ చేయడం కష్టమేనని బీఆర్ఎస్‌కు అనుభవపూర్వకంగా తెలుసు. దీంతో అధికారంలో ఉన్నప్పుడే గృహలక్ష్మి, బీసీ, మైనార్టీలకు చేయూత లాంటి స్కీమ్స్‌ను ముందుగానే ప్రవేశపెట్టి అమలును స్టార్ట్ చేసింది. అయితే తూతూమంత్రంగా అమలు చేయడంతో వీటి వల్ల ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత రాలేదు. మరోవైపు కాంగ్రెస్ హామీల వర్షం కురిపిస్తుండడంతో తప్పనిసరిగా అంతకుమించి మేనిఫెస్టోలో పలు హామీలను చేర్చేందుకు బీఆర్ఎస్ రెడీ అయినట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా మహాలక్ష్మి పేరుతో ‘హస్తం’ ఇచ్చిన గ్యారంటీలకు దీటుగా మహిళల కోసం కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తుంది. మహిళల కోసం బీఆర్ఎస్ తెచ్చే స్కీమ్స్ ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ చేస్తుందని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. అయితే మేనిఫెస్టో రిలీజ్‌లో ఆలస్యం చేస్తుండడంతో అది పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లగలమా అనే అనుమానం క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి వ్యక్తమవుతున్నది.
‘సంకల్పం’ లేని బీజేపీ
కర్ణాటక ఎలక్షన్స్ కంటే ముందు తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే. అయితే కన్నడ ఓటర్లు బీజేపీని తిరస్కరించడంతో తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. మరోవైపు బండి సంజయ్‌ను స్టేట్ చీఫ్ పదవి నుంచి తొలగించడంతో బీజేపీ పతనం మొదలైంది. అయితే మేనిఫెస్టో తయారీని ఆ పార్టీ లైట్ తీసుకుంటున్నట్లు అర్థమవుతున్నది. తాము ఉచితాలకు వ్యతిరేకమని ఇప్పటికే పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు బహిరంగంగానే చెబుతారు. సంక్షేమమే తమ ధ్యేయమని చెబుతారు. దీంతో బీజేపీ మేనిఫెస్టో పట్ల ప్రజల్లోనూ ఆసక్తి కనిపించడం లేదు. అందుకే మేనిఫెస్టో రూపకల్పనపై పార్టీ అంత శ్రద్ధ తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. షెడ్యూల్ రావడానికి ఐదు రోజుల ముందు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీని ఆ పార్టీ ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిటీ కూడా మేనిఫెస్టోపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు కనిపించడంలేదు. ఇప్పటికీ అభిప్రాయాల సేకరణలోనే ఆ కమిటీ ఉన్నది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందజేస్తామని బండి సంజయ్ ప్రకటించారు. ఇది నోటిమాటగానే తప్పా.. దీన్ని ఎలా అమలు చేస్తారో క్లారిటీ ఇవ్వలేదు. అయితే దశాబ్దాలుగా ప్రజలను పాలించిన, పాలిస్తున్న పార్టీలు ప్రజలకు ఏం కావాలో ఇప్పటికీ తెలుసుకోకపోవడం విడ్డూరంగానే ఉందని పరిశీలకుల అభిప్రాయం.
-ఫిరోజ్ ఖాన్,
సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,
96404 66464