భారత నిర్మాతగా, దళిత వర్గాల ఆశాజ్యోతిగా, రాజకీయ నాయకుడిగా, రాజనీతి కోవిదుడుగా, రాజనీతి పారంగతుడిగా ప్రజాభిమానాన్ని చూరగొన్న మహా మనీషి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. బుద్ధుడు, కారల్ మార్క్స్ తర్వాత ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురలో డాక్టర్ అంబేద్కర్ ఒకరు. కుల వ్యవస్థలో కూరుకు పోయిన వారికి డాక్టర్ అంబేద్కర్ ఒక ఆశ జ్యోతి, ఒక చైతన్య కేతనం, స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వాల మేలు కలయికగా ఉండే సమాజం డాక్టర్ అంబేద్కర్ లక్ష్యం. ఆయన 1891 సంవత్సరంలో రాంజీ శక్‌పాల్ - భీమాబాయి అనే దంపతులకు జన్మించారు. బాల్యంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని కూడా మొక్కవోని ధైర్యంతో సమస్యలకు బెదరకుండా విద్యాభ్యాసం కొనసాగించారు.
కుల వైరస్‌పై సమరం..
సమాజంలో ఉండే కులం అనే వైరస్ కారణంగా ఎన్నో అవమానాలను ఎదుర్కున్నారు. చిన్నతనంలోనే సంఘ సంస్కరణ, పీడిత ప్రజల జనోద్దరణకు పూనుకున్నారు. బలహీన వర్గాలలో చైతన్యం నింపి వారికి నాయకత్వం వహించి వారికి ఎన్నో హక్కులు సాధించి పెట్టారు. బడుగు, బలహీన వర్గాల కోసం, వారి అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేయడమే కాకుండా రాజ్యంగంలో వారికోసం ప్రత్యేక హక్కులు కల్పించారు. ఈరోజు మనం మాట్లాడుకునే మానవ హక్కులు, కార్మిక చట్టాలు కార్మికుల, మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో రక్షణలు రాజ్యాంగంలో పొందుపరిచారు.
అలాగే మినిమం వెజ్ యాక్ట్, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ లాంటి ఎన్నో కార్మిక చట్టాలను అందించారు. దళితుల అభ్యుతికోసం ఆయన సాగించిన అవిశ్రాంతమైన పోరాటం, కుల నిర్మూలన కోసం ఆయన చూపిన మార్గం ఆదర్శం. అలాగే భారతీయ చరిత్ర, శృతి, స్మృతి, పురాణ ప్రాచీన వాజ్ఞయాన్ని అందుకు సంబంధించిన ఆధార గ్రంథాలను క్ష్యన్నంగా ఆకళింపు చేసుకుని వాటికి పరిష్కారాలను చూపారు.
రాజకీయ, ఆర్థిక, సాంఘిక, ధార్మిక విషయాలపై అసాధారణ ప్రతిభతో ఆయన చేసిన రచనలు, ప్రసంగాలు, ఆయన జ్ఞాన సంపదకు మణిదీపాలు, అందుకే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా డా అంబేడ్కర్ జన్మదినోత్సవాలను వరల్డ్ నాలెడ్జ్ డే గా జరుపు కుంటున్నారు. డా. అంబేద్కర్ భారత న్యాయ శాఖ మంత్రిగా ఎన్నో హక్కులు సాధించి పెట్టారు. వైస్రాయ్ కౌన్సిల్‌లో కార్మిక శాఖ సభ్యునిగా కొనసాగుతూ కార్మికులకు ఎన్నో హక్కులు సాధించి పెట్టారు. కార్మికులకు కరువు భత్యం, గని కార్మికులకు కూడా ఎన్నో హక్కులు సాధించి పెట్టారు, మహిళలకు ప్రసూతి సెలవు, వయోజనులకు, మహిళలకు ఓటు హక్కు, గనుల్లో పనిచేసే వారికి భద్రత వంటి వాటి కోసం ఎంతో కృషి చేశారు. అలాగే కార్మిక చట్టాలను అందించారు, కొత్త ఢిల్లీలో మసీదుల రక్షణ, కార్మిక శాఖలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన కృషి మరువలేనిది...
అధ్యయనం.. ఆచరణ
డా. అంబేద్కర్ జయంతిని జరుపడం అంటే కేవలం ఆయన విగ్రహాలకు దండలు వేయడం కాదు, అంబేడ్కర్ భావాలను ఆచరించాలి. అదే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. అంబేద్కర్ త్యాగాలు, పోరాటాలు, సిద్ధాంతాలు తెలుసుకోకుండా ప్రతి వ్యక్తి తనను తాను మార్చుకోలేడు..అందుకే మహనీయుల జీవితాలను అధ్యయనం చేయాలి. నేడు అంబేడ్కర్ జన్మ దినోత్సవాలను జరుపుకునే ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ చూపిన దారిలో పయనిస్తూ ఆ వెలుగులో తమ తమ జీవితాలను మార్చుకుంటూ.. నేడు 80% శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు రాజ్యాధికారానికి బాటలు వేసుకునే దిశగా నడవాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడం, పార్కును ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని అధ్యయనం చేద్దాం.
-ఎండి. మునీర్
సీనియర్ జర్నలిస్ట్ - 9951865223