కమ్యూనిస్టులది ఎప్పుడూ వెన్నుపోటే!
The Story of the Communist Collaboration with the Nizam
క్విట్ ఇండియా ఉద్యమం లాగానే, హైదరాబాద్ సంస్థాన ప్రజల విముక్తి ఉద్యమానికి కూడా కమ్యూనిస్టులు వెన్నుపోటే పొడిచారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర గురించి పుంఖాను పుంఖాలుగా చరిత్ర పుస్తకాలు లభిస్తుంటాయి. నిజాం వ్యతిరేక పోరాటమంటేనే కమ్యూనిస్టులు సాగించిన తెలంగాణ రైతాంగ సాయుధపోరాటమే గుర్తుకొచ్చేంతగా ఊదరగొట్టారు. విధిలేక తెలంగాణ ప్రజలు అమాయకంగా నమ్మేస్తుంటారు కూడా. నాటి హైదరాబాద్ సంస్థానంలో 16 జిల్లాలుండగా వీరి పోరాట ప్రభావం కేవలం వరంగల్-నల్గొండ జిల్లాల్లోనే. కొద్దిపాటిగా కరీంనగర్, హైదరాబాద్‌లలోనూ. ఈ రెండు జిల్లాల ఉద్యమాలతోనే, అది కూడా కమ్యూనిస్టులు చేసిన ఉద్యమాలతోనే నిజాం తల వంచి దిగిపోయారని, రజాకార్లు తోక ముడిచారని గొప్పలు చెప్పుకునే కమ్యూనిస్టులు నిజాం తలవంచిన రోజు నిజాం పంచన ఎందుకు చేరారో చెప్పరు?
ప్రజా పంథాని అనుసరించారా?
నిజాం తల వంచడం, రజాకార్లు తోక ముడవడమే సాయుధ పోరాట లక్ష్యమైతే, మరి నిజాం తలవంచి, రజాకార్లు తోకముడిచిన 1948 సెప్టెంబర్ 17, రోజున మీ పోరాటం ఎందుకు ఆగిపోలేదు? మీరు భారత ప్రభుత్వానికి, మిలిటరీకి వ్యతిరేకంగా 1948, సెప్టెంబర్ 17 తర్వాత కూడా సాగించిన సాయుధ పోరుపై మీ పార్టీ అగ్రనాయకుడు రావి నారాయణ్ రెడ్డి రచించిన ‘తెలంగాణ నగ్న సత్యాలు’ పుస్తకంలో ఎండగట్టిన విషయం ఎందుకు ప్రస్తావించరు? కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర నాయకత్వంలో భారత ప్రభుత్వానికి, నిజాంను గద్దెదించడానికి వచ్చిన మిలిటరీకి వ్యతిరేకంగా పోరాడడం అంటే మనం ‘హిమాలయాల అంత పెద్ద తప్పు’ చేస్తున్నామని మీ అగ్రనాయకుడే మీ నాయకత్వాన్ని చీల్చి చెండాడినా మీరు మీ పంథా మీదే ఉన్నారు తప్ప, ప్రజా పంథాని అనుసరించలేదు? ఈ పోరుతో ఆశించిన ఫలితాలు రాకపోగా సాయుధ పోరు ఒక వ్యక్తిగత హింసావాదంగా మారిందన్న రావి మాటలు అక్షర సత్యం కాదా?
కేవలం నాలుగేళ్ల పాటు నిజాం వ్యతిరేక పోరాటం పేరుతో సాగించిన పోరులో సింహభాగం స్థానిక భూస్వాములకు వ్యతిరేకంగానే సాగింది. అన్ని పార్టీలతో కలిసి హిందూ భావజాలంతో ఏర్పడ్డ ఆంధ్రమహాసభలో చొరబడి కేవలం 11వ, 12వ ఆంధ్ర మహాసభ నాయకత్వాన్ని చేజిక్కించుకొని ఆంధ్ర మహాసభ సాగించిన పోరునంతా మీ ఖాతాలో వేసుకోవడానికి విఫలయత్నం చేస్తూనే ఉన్నారు. నిజాం వ్యతిరేక పోరాటం అంటారు, తీరా ‘ఆపరేషన్ పోలో’ ప్రారంభమవుతుందనగా నిజాం వంచన చేరి రజాకార్లతో ఆయుధాలు పంచుకొని, తెలంగాణ ప్రజల్ని విముక్తుల్ని చేసి నిజాం మెడలు వంచడానికి వచ్చిన భారత భద్రతా దళాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగించారు.
అతి పెద్ద భూస్వామి కనపడలేదా?
హైదరాబాద్ సంస్థాన ప్రజల కడగండ్లను మొదటిసారి ఒప్పుకున్న నెహ్రూ, భారత ప్రభుత్వం పోలీస్ యాక్షన్‌కు సిద్ధపడుతున్నదని తెలియగానే... 1948 మే 4న కమ్యూనిస్టు పార్టీ నిజాం- రజాకార్లతో కుమ్మక్కై “స్వతంత్ర భారత ప్రభుత్వం భూస్వామ్య బూర్జువా ప్రభుత్వమని, ఆ ప్రభుత్వ దళాలను హైదరాబాద్ సంస్థానానికి రానివ్వద్దని'', “ఆజాద్ హైదరాబాద్” (నిజాం కోరుకున్న విధంగానే) మన లక్ష్యమని పత్రికా ప్రకటనలు గుప్పించారు కమ్యూనిస్టులు. తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచి నిజాంతో కుదుర్చుకున్న రహస్య ఒప్పందంలో భాగంగా కమ్యూనిస్టు పార్టీ నేతలంతా జైళ్ల నుండి విడిచిపెట్టబడ్దారు. హైదరాబాద్ ప్రజలనే కాదు, కమ్యూనిస్టులను నమ్మి నడిచి అమరులైన సాయుధ రైతాంగ త్యాగాలను కూడా అపహాస్యం చేశారు.
సంస్థాన ప్రజలను మోసం చేస్తున్నమంటూ, కమ్యూనిస్టు పార్టీ క్యాడర్, రావి నారాయణ్ రెడ్డి లాంటి అగ్రనేతలు మొత్తుకున్నా కమ్యూనిస్టు పార్టీ పిడివాదంతో నిజాం లొంగిపోయిన తర్వాత కూడా సాయుధపోరును భారత ప్రభుత్వ దళాలపై కొనసాగించింది. భూస్వాములకు వ్యతిరేకంగా సాగుతున్న సాయుధ రైతాంగ పోరాటమని చెప్పినప్పటికీ, సంస్థానమంతా 2,680 మంది భూస్వాములుండగా వీరిలో 1960 ముస్లిం భూస్వాములు, 720 మంది హిందూ భూస్వాములుండేవారు. కాగా మొత్తం భూమిలో నిజాం, అతని పాలెగాళ్ళ అధీనంలోనే 19వ వంతు భూమి ఉంది. మరి కమ్యూనిస్టులు అతిపెద్ద భూస్వామిగా నిజాంను ఎందుకు గుర్తించలేదు? వీరి సాయుధ పోరాటమంతా 7-8 మంది జాగీర్దార్ల పైనేనన్చది జగమెరిగిన సత్యం కాదా? ఆంధ్రా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం సాగించకుండా తెలంగాణలోనే పోరాటం సాగించడంపై మా క్యాడర్ ఒత్తిడి తెస్తున్నదని, ప్రశ్నిస్తున్నదని పుచ్చలపల్లి సుందరయ్య తన ఆత్మకథలో రాసుకున్నారు కదా?
తుస్సుమన్న ఆంధ్రా థీసిస్!
తెలంగాణ ప్రజలు, కమ్యూనిస్టు పార్టీ క్యాడర్, లీడర్లు, భారత ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా వినిపించుకోని సీపీఐ నాయకత్వానికి, సాయుధ పోరాటాన్ని విరమించి శాంతి నెలకొల్పాల్సిందిగా బ్రిటన్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి షామీదత్ లేఖ రాశారు. చైనా కొమిన్ ఫాల్స్ జర్బల్ కూడా పామీదత్ సూచనకు మద్దతిచ్చింది. చైనా కమ్యూనిస్టు పార్టీ మద్దతు కూడా శాంతి వైపే నిలిచింది. మాస్కో కూడా భారత ప్రజాస్వామ్యానికే మద్దతుగా నిలువడంతో ఎటూ పాలుపోని కమ్యూనిస్టులు 1951లో సాయుధ పోరాటం విరమించాలా, కొనసాగించాలా అనే విషయంలో మాకు మార్గదర్శనం చేయాలని రష్యా అధ్యక్షుడు స్టాలిన్‌ను వేడుకున్నారు.దీంతో ‘ఆంధ్రాథీసిస్’ పేలిపోయింది.
నలుగురు సీపీఐ అగ్రనాయకుల ప్రతినిధి బృందం మాస్కోలో పడిగాపులు కాసి స్టాలిన్‌ను కలవడంతో అసలు మీ కమ్యూనిస్టు సాయుధ ఉద్యమానికి సోషలిస్టు స్వభావమే లేదని, నలుగురు భూస్వాముల భూములను పది మంది రైతులకు (వ్యక్తిగత ఆస్తులుగా) పంచితే అది కమ్యూనిస్టు సిద్దాంతమెలా అవుతుందని ప్రశ్నించడంతో కమ్మీ అగ్రనాయకుల గొంతుల్లో వెలక్కాయ పడ్డట్టయింది. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమం సోషలిస్టు దశలోనే లేదని స్టాలిన్ తేల్చి చెప్పారు.సైద్ధాంతిక, రాద్ధాంతాలను కూలంకషంగా స్టాలిన్‌తో చర్చించి 1951 అక్టోబర్ 21న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని విరమించారు. ‘ఏమీ సాధించకుండా మన ప్రభుత్వంతో ఏ హామీలు లేకుండా అర్థాంతరంగా అటు ప్రజల త్యాగాలను, ఇటు క్యాడర్ త్యాగాలను అపహాస్యం చేయడమేనని’ అన్న సీపీఐ అగ్రనాయకుడి మాటలు సరిగా సరిపోతాయి. కమ్యూనిష్ణులని ‘రాత్ కా రాజా’'లని, రజాకార్లను ‘దిన్ కా రాజా’లుగా సంస్థాన ప్రజలు భావించడంలో తప్పులేదని రుజువైంది. నరమేధమంతా సృష్టించి ‘మేము ఇక్కడి ప్రజల, ప్రజా ఉద్యమాల స్వభావాన్ని అర్థం చేసుకోలేక పోయామ’ని 1972లో పుచ్చలపల్లి సుందరయ్య తన ఆత్మకథలో పేర్కొనడం కొసమెరుపు.
డా. మాసాడి బాపురావు
ఏబీవీపీ జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు
99854 90297