నేటి పల్లెల దృశ్యం... ఆనాటి పెద్దమనుషులు
The rural area scene of today.. shown in old peddamanusulu movie
‘పల్లెలు భారత దేశప్రగతికి పట్టు కొమ్మలనే’ గాంధీ గారి వ్యాఖ్యానాన్ని వల్లిస్తూ గ్రామాలను ‘రాజకీయ చదరంగ బల్లలు’గా మారుస్తున్న నేటి నాయకుల ద్వంద్వరీతిని ఏడు దశాబ్దాల క్రితమే దృశ్యమానం చేసిన చిత్రం వాహిని వారి ‘పెద్ద మనుషులు’. ఈ చిత్రం కథకు మూలం హెన్రిక్ ఇబ్బన్ రాసిన ‘ది పిల్లర్స్ ఆఫ్ సొసైటీ’ అనే నాటకం. రీమేక్‌లు విపరీతంగా వస్తున్న వర్తమానంలో మూలంలోని కథ, కథనాలలోని అంతర్లీన సూత్రమైన ‘ప్రధానాంశమును’ తీసుకొని, తెలుగు నాటకీయత, ప్రాంతీయత, సమస్యల స్వరూప స్వభావాలనద్ది, అచ్చతెలుగు సినిమాగా ఎలా తీయాలో, విజయం సాధించటమెలాగో కూడా ‘పెద్ద మనుషులు’ చూసి తెలుసుకోవలసిందే.. అనేక వందల ‘గ్రామీణ’ నేపథ్య చిత్రాలకు ఈ చిత్రం ఒక నమూనాగా నిలిచింది. ఆ తరువాత కాలంలో వందలాది చిత్రాలు ఇదే కథాంశంతో వచ్చి విజయం సాధించాయి. కొన్ని చతికిలబడ్డాయి. తెలుగు, తమిళ, మలయాళీ, కన్నడ, హిందీల్లో వచ్చిన ఆ చిత్రాలకు ‘పెద్ద మనుషులు’ ఒక దిశా నిర్దేశం చేసిందని చెప్పవచ్చు. అదీ దర్శకుడి కె.వి.రెడ్డి మేధస్సు.
గ్రామీణ వాస్తవ దృశ్యాలు చిత్రీకరించి..
గ్రామీణ ప్రాంతాలలో నేటి రాజకీయ, సామాజిక జీవితాలు ఎలా నాయకుల స్వార్థానికి తమ సహజమైన రూపురేఖలు మార్చుకుంటున్నాయో 1954 లోనే ఈ చిత్రం చూపిస్తుంది. నాయకులు ఓటర్లనే కాదు, తమ ఇంట్లో వారిని సైతం ఎలా దోచుకుంటారో, మీడియా ‘తనకోసమే’ పనిచేయాలని ఎలా కోరుకుంటారో, మేకవన్నె పులులు వంటి నాయకుల వైఖరికి (ధర్మారావు పాత్ర) అమాయకులు, నిజాయితీపరులైన వారెలా బలవుతున్నారో (రామదాసు, శంకరం వంటి పాత్రలు) ‘పెద్ద మనుషులు’లో చూడవచ్చు. పబ్లిక్‌లో ‘చెప్పేవి శ్రీరంగనీతులు, రాత్రులు దూరేవి దొమ్మరి గుడిసె’లనే చందంగా ఉండే పాత్రలను ఎంతో ముందు చూపుతో తీర్చిదిద్దిన కె.వి.రెడ్డి, డి.వి. నరసరాజు, తిలక్‌లకు ఈ చిత్రం పైన ఉన్న మమకారం తెలుసుకోవచ్చు. సినిమా ప్రారంభంలో ‘నందామయా గరుడ నందమయా ఆనందదేవికి నందమయా’ అనే పాటను వినిపిస్తూ టైటిల్స్ వేస్తారు. రేలంగి ధరించిన (తిక్క)శంకరం పాత్రను ప్రవేశపెడతారు. ఆ పాటలో ‘స్వాతంత్ర సమరాన జయభేరి మ్రోగించు శాంతమూర్తులు అంతరించారయ్య, స్వాతంత్ర్య గౌరవం సంతలో తెగనమ్ము స్వార్థపరులు అవతరించారయ్యా' అనే చరణంలో వాస్తవ దృశ్యాలు నాడే చిత్రించిన (వినిపించిన) తీరు అద్భుతం. చిత్రంలో తొమ్మిది పాటలు ఉన్నాయి. వీటిని ఊటుకూరి సత్యనారాయణ, కొసరాజు, యస్. రాఘవరావు తదితరులు రచించారు. ఘంటసాల, లీల, జిక్కి, నాగేశ్వరరావు, మాధవపెద్దిలు నేపధ్యగానం అందించారు. సంభాషణలు డి.వి. నరసరాజు, సంగీతం ఓగిరాల రామచంద్రరావు, అద్దేపల్లి రామారావు చేశారు. ‘శివ శివ మూర్తివి గణనాథ’, ‘నందామయ గరుడ నందమయ్య, తదితర పాటలు నేటికీ వినిపిస్తున్నాయి.
నటీనటులలో గౌరీనాథ శాస్త్రి పోషించిన ధర్మారావు, లింగమూర్తి ధరించిన రామదాసు, పూజారి పాత్ర పోషించిన వంగరలు జీవం పోశారు. ముఖ్యంగా గౌరీనాథ శాస్త్రి చేసిన సాఫ్ట్ విలనీ తర్వాత కాలంలో ఎంతోమంది నటులకు మార్గదర్శనం చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా నాగభూషణం, ధూళిపాల, ముక్కామల, మిక్కిలినేని, గుమ్మడి, ఎస్వీ రంగారావు వంటి మహానటులకు గౌరీనాథ శాస్త్రి వాచకం, ఆంగీకం ఒక ఒరవడిగా చెప్పుకోవాలి. తన చెల్లెలను ఇష్టపడుతున్న డ్రైవర్ను చంపిన దృశ్యంలోనూ, ప్రారంభంలో సభా కార్యక్రమంలోనూ, రామదాసును జైలుకు పంపే సన్నివేశంలోనూ ఆయన నటన ‘నభూతో…’ . తదుపరి కాలంలో రావు గోపాల్ రావు వంటి నటులు ఆయనను ఒక విధంగా అనుకరించారు, అనుసరించారు. నాగయ్య నటించిన ‘పోతన’ సినిమాలో గౌరీనాథ శాస్త్రి పోషించిన ‘శ్రీనాథుని’ పాత్ర చూసిన వారు ఎవరికైనా ‘శ్రీనాథుడే’ తమ కళ్ళ ముందు ఉన్నాడని భ్రమిస్తారు. కే. వి. రెడ్డి ‘గౌరీనాథ శాస్త్రి’ని వాడుకున్న విధంగా బహుశా మరే దర్శకుడు ఉపయోగించుకోలేదంటే అతిశయోక్తి కాదు. రేలంగి నటించిన తిక్క శంకరయ్య పాత్ర, ఆ పాత్ర పోషణలో రేలంగి గారి నటన అద్భుతం. ‘నేను నటించిన చిత్రాలలో నాకు నచ్చిన పాత్ర ‘తిక్క శంకరయ్య’ అని ఆయనే అనేక వేదికల పైన చెప్పుకొన్నారు. కే.వి.రెడ్డి దర్శకత్వం గురించి చెప్పడం అంటే ఆకాశం విస్తీర్ణం గురించి వివరించడమంత అజ్ఞానం.
ఇంగ్లీష్ డ్రామాకు.. తెలుగుదనం
1954లోనే పల్లెల దృశ్యం ఎలా ఉందో, పెద్దమనుషులుగా చలామణి అయ్యే వారి అసలు రూపం ఏమిటో ఈ చిత్రం ప్రజారంజకంగా వివరిస్తుంది. ఆ సంవత్సరం జాతీయ పురస్కారాలలో ఈ సినిమా ‘ఉత్తమ తెలుగు సినిమాగా అవార్డు’ అందుకుంది. విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. ఆనాటి సినీ పత్రికలో 1954లో విడుదలైన చిత్రాలలో ఉత్తమమైనది ఏదంటే పాఠకులు అత్యధిక సంఖ్యలో ‘పెద్దమనుషుల’కే ఓటు వేశారు. మూడు గంటలకు పైగా (191 నిమిషాలు) నడిచే చిత్రంలో అనవసరమైన సంభాషణ గాని, సన్నివేశం, పాట, హాస్యం వంటివి ఉండవు. కే.వి. రెడ్డి స్క్రీన్ ప్లే విధానం అదే. అందుకనే ‘మాయాబజార్’ వంటి చిత్రాలు నేటికీ ఓ ‘చరిత్ర’గా నిలిచిపోయాయి. రీమేక్ చిత్రాలు నిర్మిస్తున్న దర్శకులు, నిర్మాతలు ఇటువంటి చిత్రాలు చూసి ఎందుకు నేర్చుకోరో అర్థం కాదు. ఈ చిత్రంలో కథ చిన్నదే. ఆదికేశవపురం అనే గ్రామంలో చైర్మన్, పూజారి, వ్యాపారి, కాంట్రాక్టర్ వంటి వారు ప్రజలను ఎలా తన నయవంచన మాటలతో మోసం చేసే ఎదుగుతున్నారో, ‘ప్రజాసేవ’ అనే నాటి పత్రికలు ఎలా నిజాలను బయటకు తెచ్చాయో వాటి ఫలితాలేమిటో ప్రధాన అంశాలుగా కథ సాగుతుంది. ఇంగ్లీష్ డ్రామాకు అచ్చమైన తెలుగుదనాన్ని అద్ది ఎలా విజయం సాధించారు అని చెప్పేందుకు వాహిని వారి ‘పెద్ద మనుషులు’ ఓ చక్కని ఉదాహరణ. ఈనాడు ఆ సినిమా చూస్తున్నా ఆలోచింపజేస్తుంది. నటులు, దర్శకులు ప్రతిభ అబ్బురమనిపిస్తుంది. ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నేటి తరం నేర్చుకోవాల్సింది ఎంత ఉందో గుర్తు చేస్తుంది. కానీ ఆచరించే వారేరి…!?
- భమిడిపాటి గౌరీశంకర్
94928 58395