దేశాభివృద్ధిపై నేరాల ప్రభావం
ఎదుగుతున్న దేశాలలో సామాజిక సమతుల్యత ఆశించిన మేరకు ఉండదు. స్వార్థ చింతకులైన మనుషులలో అందినకాడికి స్వంతం చేసుకొనే ఆలోచన ప్రబలంగా ఉంటుంది.
ఎదుగుతున్న దేశాలలో సామాజిక సమతుల్యత ఆశించిన మేరకు ఉండదు. స్వార్థ చింతకులైన మనుషులలో అందినకాడికి స్వంతం చేసుకొనే ఆలోచన ప్రబలంగా ఉంటుంది. నిరక్షరాస్యులు, నిరుపేదలు ఎక్కువ శాతం గల భారతదేశంలో చట్టం విలువలను అర్థం చేసుకోవడం కష్టతర విషయమే! అర్థం చేసుకొనగలిగినవారు, ధనికులు కుత్సితాలతో, చట్టాలను దుర్వినియోగం చేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతూ ప్రజాస్వామ్య పాలనకు ప్రశ్నార్థకంగా నిలిచారు. అరాచక శక్తులు అసాంఘిక, దేశద్రోహ కార్యకలాపాలకు ఒడిగట్టి ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నాయి. సుపరిపాలన కోసం పాటుపడుతున్న పోలీసు శాఖకు అటువంటివారు కంటకంగా తయారయ్యారు. తద్వారా ఉద్భవించే ఆందోళనలు, అలజడులు, నేరాల తీవ్రత, దానికి ఆజ్యం పోసే కుత్సిత రాజకీయాలతో పోలీసు శాఖ అతలాకుతలం అయిపోతున్నది.
సమాచార వ్యవస్థను పటిష్టపరిచి నేరాలను అరికట్టుటకు చేయు ప్రయత్నానికి అవినీతి ఒక సవాలుగా మారింది. నిస్తేజంగా నిలిచిన పాలనా వ్యవస్థ మూలంగా బీదలు బీదలుగానే ఉన్నారు. ధనికులు మాత్రం అధిక ధనవంతులుగా ఎదుగుతూ సామాజిక అంతరాలకు ప్రతీకగా నిలిచారు. అవినీతి తత్వం, నేరతత్వాల ప్రభావంతో కలుషితమైన నేటి సామాజిక స్థితిగతులను ఈ రకంగా అర్థం చేసుకొనవచ్చు. 1. మనుషులున్నారు కనుకనే మంచి మనుషులున్నారు. జనులున్నారు కనుకనే జనకంటకులున్నారు. 2. బీదలున్నారు కనుకనే ధనికులు వెలుగుతున్నారు. ధనికులున్నారు కనుకనే బీదలు నలుగుతున్నారు. 3. మంచీ చెడుల చిట్టాయే మనమెంచుకున్న చట్టం. ప్రజాస్వామ్యం ఒక ప్రచారం. దాని వక్రీకరణ మన ఆచారం. 4. చట్టం బీదలను శాసిస్తుంటే, చట్టాన్ని ధనికులేలుతుంటే, చట్టాన్ని చదువలేని పేదలకు పిట్ట కథల పుస్తకం మన చట్టం.
నేరాల శైలి
నేటి కాలంలో జరుగుచున్న నేరాల శైలి రెండు రకాలు. మొదటిది ఆకలి నేరం. రెండవది వ్యాపార నేరం. మొదటి రకంలో మనిషి ఆకలి తట్టుకోలేక నేరానికి ఉపక్రమిస్తాడు. అతని నేరపూరిత ఆలోచన అంతవరకే పరిమితమవుతుంది. పోలీసులకు పట్టుబడితే నేరాన్ని ఒప్పుకుంటాడు. న్యాయస్థానం విధించే శిక్షను అనుభవిస్తాడు. ఆ నేరం కారణంగా సొమ్మును కోల్పోయినతడు నష్టపోతాడు తప్ప సమాజానికి, దేశానికి ప్రభావ పూరిత నష్టం చేకూరే అవకాశాలు చాలా అరుదు. అదే, వ్యాపార నేరాలు మొదటి రకానికి విరుద్ధ రీతిలో జరుగుతుంటాయి. అలాంటివాటిలో ముఖ్యంగా పేర్కొనదగినవి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అంతర్జాతీయ ఉగ్రవాదం, హవాలా, పోస్‌పోర్టుకు సంబంధించినవి.
బంగారం అక్రమ రవాణా, కిడ్నాప్, అంతర్జాతీయ వ్యాపారంలో ఆర్థిక నేరాలు. రాష్ట్ర, అంతర్రాష్ట, అంతర్జాతీయ స్థాయిలలో ఇవి జరుగుతుంటాయి. అన్ని నేరాలు ఒక్కరే చేయడం సాధ్యపడదు. ఎవరికి వారు ఎంచుకున్న విషయాలకు యాజమాన్య విధానాలుంటాయి. అతనొక 'బాస్'లాగా వ్యవహరిస్తాడు. ఆ బాస్ కొనసాగించే చట్ట విరుద్ధ సంపాదన, వ్యాపార నేరాల ప్రక్రియలు, అప్రకటిత ప్రాజెక్టుల కార్యకలాపాలుగా గోచరిస్తాయి. దానికి పెట్టుబడులుంటాయి. అర్హులైన ఉద్యోగులుంటారు. వాహన సంపత్తి ఉంటుంది. సమాచార సేకరణ విధానముంటుంది. దాడులు, ప్రతి దాడులు తదితర కార్యకలాపాలెన్నియో జరిగిపోతుంటాయి.
యువత మీదనే గురి
అటువంటి కార్యకలాపాల ప్రాథమిక ఉద్దేశం అతి తక్కువ సమయంలో అమితమైన ధన సంపత్తిని పోగుచేసుకోవడం. మరికొందరికేమో శత్రుదేశాలు రచించిన ప్రణాళికలను అమలు చేసి దేశ భద్రతలకు విఘాతం కలిగించడం. పొరుగు దేశంలో ముద్రించబడిన దొంగనోట్లను భారతదేశంలో అక్రమంగా పెద్దయెత్తున చెలామణి చేయడం. అలాంటి నేరస్థుల ముఖ్య ఉద్దేశం భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అక్రమంగా ప్రజల వాడుకకు పంపిణీ చేయడంలో గల ముఖ్య ఉద్దేశం డబ్బు సంపాదన. యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చి వారిని పూర్తిగా బలహీనపరచడమే. యువత బలహీనపడితే దేశం శక్తి సంపన్నంగా మనగలగడం కష్టసాధ్యమైన పనియే. నేరగాళ్లకు, స్వార్థ చింతన గల రాజకీయ నాయకులకు ఆత్మీయ బంధాలేర్పడతాయి. చరిత్రను అవలోకించినప్పుడు,రాజకీయం, నేరం ఒకే నాణానికున్న రెండు పార్శ్వాలుగా విదితమవుతుంది. ప్రతి పౌరుడు, ప్రతి పోలీసు అధికారి రాజకీయ నాయకులకు సామీప్యంగా మెదలే విషయంలో స్వీయ నియంత్రణ పాటించడం అవసరం.
రకరకాల అక్రమ వ్యాపారాలు
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నేటి కాలంలో ఎంతో విరివిగా సాగుతున్న అంతర్జాతీయ వ్యాపారం. అంతర్జాతీయ ఉగ్రవాద కార్యకలాపాలకు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలది విడదీయలేని బంధం.డబ్బును ఒక వ్యక్తి లేదా సంస్థ ఇతర స్థానాలలో గల వ్యక్తులకు లేదా సంస్థలను చేరవేయుట హవాలా పద్ధతి. స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మారణాయుధాల రవాణా, లంచాల వ్యవహారం తదితర వ్యాపారాలలో హవాలా పద్దతి ద్వారా లావాదేవీలను కొనసాగిస్తుంటారు.
సాధారణంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడువారు, మనీ లాండరింగ్, బంగారం అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర కార్యకలాపాలను కొనసాగించేవారు వేష భాషలను మార్చుకుని అనుమానస్పద ప్రయాణాలను సాగిస్తారు. నిఘా విభాగాలకు పట్టుబడకుండా తప్పించుకునేందుకు నకిలీ పాస్‌పోర్టులను పొందుతారు. బంగారం అక్రమ రవాణాకు కొత్త విధానాలను రచిస్తాడు. కిడ్నాప్ నేరం కూడా జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతూ పోతున్నది. నమ్మించి మోసపూరితంగా బ్యాంకుల నుంచి డబ్బు లాగుతుంటారు. అలాంటి దేశద్రోహ వ్యాపారాలను అరికట్టగలిగితే భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలబడగలదు. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవలసి ఉంది.
పెద్దిరెడ్డి తిరుపతి రెడ్డి
94400 11170