పీఆర్సీ సిఫార్సులపై జీవోలేవీ!?

Telangana employees and pensioners demand to implement PRC recommendations

Update: 2023-06-29 00:45 GMT

ద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కొన్ని నెలల పాటు ఉమ్మడిగా, వేర్వేరుగా మేధోమథనం చేసి వేతన సవరణ సంఘం (పీఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పిస్తాయి. ద్రవ్యోల్బణం కారణంగా ఆకాశాన్ని అంటుతున్న ధరలు, క్షీణిస్తున్న రూపాయి కొనుగోలు శక్తిని దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయ పద్ధతిలో వేతన సవరణ జరగాలని పే రివిజన్ కమిషన్‌తో పకడ్బందీగా చర్చిస్తాయి ఈ సంఘాలు. తమ హేతుబద్ధ వాదనలతో పీఆర్సీ సభ్యులను సైతం ఒప్పించడానికి యత్నిస్తాయి. ఆ కమిషన్ ఇన్ని సిఫార్సులు తీసుకున్నాక, పాలకుల ఆలోచనలకనుగుణంగా వారి కనుసన్నల్లో పీఆర్సీ రిపోర్ట్ రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడం కొన్నేళ్ళుగా జరుగుతుంది.

అయితే ఆ సంఘాల సహేతుకమైన డిమాండ్లలో కొన్నింటిని అనివార్యమైన పరిస్థితుల్లో పూర్తిగానో, పాక్షికంగానో ఆమోదించి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది పీఆర్సీ కమిషన్. కానీ ప్రభుత్వం ఆ కమిషన్ అరకొర సిఫారసులను సైతం అమలు చేయకపోతే ఎలా? తాను నియమించిన కమిషన్ సిఫారసులను ప్రభుత్వమే పట్టించుకోకపోవడం ఏంటి? ప్రభుత్వం వాటిని పూచికపుల్లగా తీసుకోవడం న్యాయమా? ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ సర్కారు, ఆ సిఫారసులను అమలు చేయకుండా పక్కన పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

పీఆర్సీ ఇంత లేటా!

‘ముగ్గురు అధికారులతో తెలంగాణ మొదటి వేతన సవరణ సంఘం ఏర్పాటు చేస్తం. మూడు నెలల్లో కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది. 2018 జూన్ రెండు నుంచి ఐఆర్, 15 ఆగస్టు నుంచి పీఆర్సీ ఫిట్మెంట్ అమలు చేస్తం’ అని 2018 మే 16 నాడు ప్రెస్ మీట్లో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు, ఆయన చెప్పినట్టే ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులైన సీఆర్ బిస్వాల్ చైర్మన్, సి.ఉమామహేశ్వర్ రావు, డా.మహమ్మద్ అలీ రఫత్ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం 18 మే, 2018న తెలంగాణ మొదటి వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. అయితే, మూడు నెలల్లో ఇవ్వాల్సిన పీఆర్సీ రిపోర్ట్ ముప్పై నెలలు ఆలస్యంగా 31 డిసెంబర్, 2020న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. అయితే, పీఆర్సీ ఆలస్యమైన సందర్భాల్లో ఇంటీరియం రిలీఫ్ (ఐఆర్) ప్రకటించడం రివాజు కానీ ఇవ్వలేదు. గతంలో అన్ని పీఆర్సీల్లోనూ ఐఆర్ ఇచ్చారు. ఉద్యోగవర్గాలు ఎంత మొత్తుకున్నా దీనిపై కేసీఆర్ సర్కారు స్పందించలేదు. ఎట్టకేలకు, 2021 23 మార్చి, నాడు 30 శాతం ఫిట్మెంట్‌తో, నేరుగా పీఆర్సీ అమలు చేస్తున్నట్టు సీఎం శాసనసభలో ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన మూడు నెలలకు పద్నాలుగు జీవోలు జారీ చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు చేశారు. రెండేళ్ల తర్వాత జూన్ 2023 లో మరికొన్ని జీవోలు జారీ చేశారు. జూలై 2018 నుంచి అమల్లోకి వచ్చిన పీఆర్సీ ఐదేళ్ల గడువు జూన్ 2023 వరకే. అయినా, పలు కీలక సిఫార్సులు అమలుకు నేటికీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనేలేదు. ఎప్పుడు జారీ చేస్తారో కూడా తేల్చి చెప్పడం లేదు. గత నాలుగు దశాబ్దాల్లో ఇంత లేట్ ఎప్పుడూ జరగలేదు.

అమలుకు నోచుకోని సిఫార్సులు!

పిల్లల సంరక్షణ కోసం ప్రస్తుతం ఇస్తున్న 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ (సీసీఎల్)ని కేంద్ర ఉద్యోగులతో సమానంగా రెండేళ్లకు పెంచాలని సంఘాలు కోరితే, 120 రోజులకు పెంచాలని ప్రభుత్వానికి పీఆర్సీ రికమండ్ చేసింది. అదే విధంగా, దివ్యాంగ పిల్లలు ఉన్న పక్షంలో సీసీఎల్ రెండేళ్లకు పెంచి, 365 రోజులు వంద శాతం వేతనంతో, మిగతా 365 రోజులు ఎనభై శాతం వేతనంతో మంజూరు చేయాలని, అలాగే తొలిసారి సింగిల్ మేల్ పేరెంట్స్‌కి సైతం సీసీఎల్ మంజూరుకు పీఆర్సీ సిఫారసు చేసింది. కీలకమైన ఈ సిఫార్సులపై జీవోలు జారీ చేస్తే, దివ్యాంగ పిల్లలున్న మహిళా ఉద్యోగ, ఉపాధ్యాయులు, సింగల్ మేల్ పేరెంట్స్‌కి ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు, కారుణ్య నియామక పథకం కింద వచ్చే ఉద్యోగం వద్దనుకునే పక్షంలో నాలుగో తరగతి ఉద్యోగుల కుటుంబాలకు రూ.40 వేలు, నాన్ గెజిటెడ్ వారికి రూ.60 వేలు, గెజిటెడ్ వారికి రూ.80 వేల నష్టపరిహారాన్ని ఎక్స్ గ్రేషియా రూపంలో ప్రస్తుతం చెల్లిస్తున్నారు. వీటిని ఏపీ ప్రభుత్వం అమలు చేసినట్లు ఐదు, ఎనిమిది, పది లక్షల రూపాయలకు పెంచాలని సిఫార్సు చేసింది దీనివల్ల ఉద్యోగం వద్దనుకునే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం వెయిటేజీ కలుపుకొని 33 ఏండ్ల సర్వీస్ పూర్తిచేసిన, రిటైరైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రమే పూర్తి పెన్షన్ వస్తుంది. కానీ కేంద్రం అమలుచేస్తున్నట్టు 20 ఏళ్ళ సర్వీస్‌కే పెన్షన్ అందించాలని సిఫార్సు చేసింది. ఇది అమలైతే పదిహేను, ఇరవై ఏళ్ళ సర్వీస్ పూర్తిచేసి రిటైరైన వారికి పెన్షన్‌లో ప్రతినెలా కనీసం ఐదు నుంచి పదివేల పెరుగుదల ఉంటుంది.

అలాగే సర్వీస్‌లో ఉండగా, లేదా రిటైరైన, మరణించిన ఉద్యోగికి మరణించిన తేదీ నుంచి ఏడేళ్ల వరకు, జీవించి ఉంటే 65 ఏళ్ల వరకు ఏది తక్కువైతే ఆ తేదీ నుంచి చివరి జీతంలో 50 శాతాన్ని ప్రస్తుతం ఫ్యామిలీ పెన్షన్‌గా చెల్లిస్తున్నారు. దీనిని గరిష్ఠంగా పదేళ్ళు లేదా 65 ఏళ్ళ వయస్సుకు పెంచాలని సిఫార్సు చేసింది. ఇది అమలైతే మూడేళ్ళ పాటు పెన్షన్ అదనంగా లభిస్తుంది. అలాగే కేంద్రం తన ఉద్యోగుల పెన్షన్ కోసం 14 శాతం తన వాటాగా ప్రతినెలా చెల్లిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాని 10 నుంచి 14 శాతానికి పెంచాలని, సపరేట్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నగదు రహిత వైద్యం అందించాలని దీని కోసం సభ్యులు ప్రతినెలా తమ వేతనం/పెన్షన్‌లో ఒక శాతం మొత్తం చందా ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని, ఆ డబ్బులతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. కానీ దీని అమలు విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. తమ ఉద్యోగులు మరణించిన సందర్భాల్లో అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు ప్రస్తుతం రూ.20 వేలు చెల్లిస్తున్నారు. దీనిని రూ.30 వేలకు పెంచాలని సిఫారసు చేసింది.

ఆ అలవెన్సు చెల్లింపులో ఏపీనే ఉత్తమం

అలాగే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లకు హెచ్ఎం అలవెన్స్ రూ.150 నుంచి రూ.200లకు, ఉన్నత పాఠశాలల్లో పై తరగతులకు బోధించే భాష పండిట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు హయ్యర్ క్లాస్ హ్యాండ్లింగ్ అలవెన్స్‌ను కూడా నెలకు రూ.150 నుంచి రూ.200లకు పెంచాలని కమిషన్ సిఫారసు చేసింది. దీనికి ఏపీలో రూ. 2500 చెల్లిస్తున్నారు. అక్కడితో పోల్చితే ఇక్కడి అలవెన్స్ పదో వంతు కూడా కాదు. ఆ స్వల్ప మొత్తం కూడా పెంచలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రోత్సాహకం గా ఉండేందుకు రూరల్ అలవెన్స్ మంజూరుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తామని పలుమార్లు నిర్దిష్టమైన హామీ ఇచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోవడం, ఫైల్ ప్రాసెస్ చేయకపోవడం శోచనీయం. ‘సి’ కేటగిరీ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి 6 శాతం, మారుమూల ప్రాంతాలైన ‘డి’ కేటగిరి గ్రామాల్లో పనిచేస్తున్న వారికి 10 శాతం రూరల్ అలవెన్స్ ప్రకటించాలి.

మంత్రివర్గ ఉప సంఘం కావాలి!

ప్రభుత్వం ఆ కమిషన్ ఇచ్చిన సిఫార్సులను త్వరగా అమలు చేయాలి. 317 జీవోతో స్థానికత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులను సాధ్యమైన మేరకు సొంత జిల్లాలకు బదిలీ చేసి, ఊరట కలిగించాలి. సీపీఎస్ సిస్టంని రద్దుపరచి మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవాలి. తెలంగాణ తొలి పీఆర్సీలో ఐఆర్ ఇవ్వకపోవడం వలన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు భారీ ఆర్థిక నష్టం చేకూరింది. ఈ పరిస్థితి మళ్లీ పునరావృతం కారాదు. జూలై 2023 నుంచి వర్తించేలా ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలి. ఈ సమస్యలపై ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపడానికి, సలహాలు-సూచనలు తీసుకోవడానికి మంత్రివర్గ ఉప సంఘం వంటి అత్యున్నత వేదిక ఉండడం ఎంతో అవసరం. ప్రతి సమస్యని సీఎం దృష్టికి తీసుకుని వెళ్లడం సంఘాలకు సాధ్యం కావడం లేదు. గతంలో కూడా ఎన్నోసార్లు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించారు. వీటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించాలి.

-మానేటి ప్రతాపరెడ్డి,

గౌరవాధ్యక్షుడు, టీ.ఆర్.టీ.ఎఫ్.

98484 81028

Tags:    

Similar News