పోరాటాలు మరిచిన కమ్యూనిస్టుల దారి ఎటువైపు?

అది 1952 వ సంవత్సరం. భారతదేశానికి మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగి మొట్టమొదటి లోక్‌సభ సమావేశమవుతున్న వేళ, భారత ప్రజాస్వామ్యానికి

Update: 2024-11-08 01:15 GMT

అది 1952 వ సంవత్సరం. భారతదేశానికి మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగి మొట్టమొదటి లోక్‌సభ సమావేశమవుతున్న వేళ, భారత ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటి ఆ సభలోకి మొట్టమొదటగా ఎవరు కాలుపెట్టారో తెలుసా? సాధారణంగా అయితే నాటి ప్రధానమంత్రి నెహ్రూ ముందుగా ఆ సభలో కి వెళ్లాలి ... కానీ వెళ్లలేదు. తెలుగువాడు, తెలంగాణ వాడు అయిన అప్పటి నల్గొండ ఎంపీ రావి నారాయణ రెడ్డికి ఆ అరుదైన గౌరవం లభించింది. కారణం ...దేశంలోని ఎంపీలందరి కంటే ఎక్కువ మెజార్టీ (3 లక్షల 9 వేల ఓట్లు) సాధించిన కమ్యూనిస్టు నాయకుడిగా, నల్లగొండ ఎంపీగా లాంఛనంగా మొదటి లోక్‌ సభను ప్రారంభించారు. విచిత్రం ఏంటంటే, ఆ ఎన్నికల్లో రావి నారాయణ రెడ్డి ప్రచారం కూడా చేయకుండనే జైల్లోనే ఉండి, దేశంలోనే భారీ రికార్డు మెజార్టీ సాధించారు. 

తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ ఘనమైన గత చరి త్రకు సాక్ష్యం ఈ గెలుపు ఒక ఉదాహరణ మా త్రమే... కానీ అదంతా ఒకనాటి కమ్యూనిస్టు పార్టీల పూర్వ చరిత్ర... కానీ ఇప్పుడు సీపీఐ గానీ, సీపీఎం గానీ ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటునైనా గెలుచుకునే పరిస్థితిలో ఉన్నదా? అంటే అందరి నోటా వినిపించే మాట.. కారణం తెలిసిందే..! కాలచక్రం గిర్రున తిరిగింది. దశాబ్దాలు గడిచాయి.. రాజకీయాల స్వభావం మారింది.. పో‌రాటాల స్వరూపం మారింది. ధనస్వామ్యం, కులాల సమీకరణ లెక్కల్లో కామ్రేడ్లు బహు దూరంలో వెనకబడిపోయారు.

చీలికలు.. తిరోగమనాలు..

1952, 57 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా సంపాదించిన కమ్యూనిస్టు పార్టీ ఇవాళ పార్లమెంట్‌లో ప్రాంతీయ పార్టీలకంటే వెనుకబడి ఉండటం బాధాకరం. భూస్వామ్య శక్తులను ఎదుర్కోవడానికి సన్నద్ధమైన కమ్యూనిస్టులు పెట్టుబడిదారీ వ్యవస్థను ఎదుర్కోవడానికి మాత్రం సన్నద్ధం కాలేకపోయారు. కాలానుగుణ మార్పులను వేగంగా అందిపుచ్చుకోలేక పోవడం, అందులోనూ ఈ వం దేళ్లలో సమాజం పల్లెల నుంచి పట్టణాలకు మారు తున్న దశలో కమ్యూనిస్టుల ప్రయాణం నగరాల నుంచి గ్రామాలకు.. గ్రామాల నుంచి అడవులకు భిన్నమైన మార్గంలో సాగింది. ఫోకస్ కుగ్రామాల నుంచి అడవులకు మళ్లింది. అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీల మధ్య లుకలుకలు మొదలయ్యాయి. వ్యక్తిగత స్వార్థం కొరకు గ్రూపులుగా, చీలిపోయాయి, ఆ తర్వాత పదుల సంఖ్యలో కమ్యూనిస్టులు చీలిపోయి వర్గ గ్రూపులుగా మారిపోయా యి. అదే సమయంలో అంతర్జాతీయంగా పెట్టుబడిదారీ వ్యవస్థ రూపం మార్చుకుని వర్తమానానికి అనువుగా తీర్చిదిద్దుకుంది.

ఇదీ ఓ కారణమే..!

వాస్తవానికి కమ్యూనిస్టులు లెనిన్, స్టాలిన్ లేదా మావో సిద్ధాంతాలతో ఎక్కువ అనుబంధం కలిగి ఉంటారు. అవేవీ మన సంస్కృతికి, నాగరికతకు సరిపోవు. అంతేకాకుండా వామపక్షాలు మన దేశానికి సరిపోయే తత్వాన్ని అభివృద్ధి చేయడానికి బదులుగా రష్యా, చైనాలను కాపీ చేయడం ప్రారంభించాయి. అయితే కమ్యూనిస్టు సిద్ధాంతంలో ఆ మేరకు ఆధునిక పరివర్తన కానీ, రాజకీయ విధానాల పరంగా గానీ పరిపక్వత లోపించింది. ప్రభుత్వాలను శాసించే స్థితి నుంచి రాజీ ధోరణుల నుంచి యాచించే వైపు అడుగులేయడం, పోరాట పంథాపై పట్టుసడలడం కూడా వామపక్షాలకు గొడ్డలి పెట్టయింది.

గత చరిత్ర ఘనం..

ప్రజల పక్షాన నిలబడే శక్తిగా కమ్యూనిస్టులంటే సమాజంలో ఎనలేని గౌరవం. వెనుదీయని వారి పోరాటలపై సమాజంలో అపార నమ్మకం. స్వార్థం, సంకుచితత్వం, సంపదలపై వ్యామోహం, పదవుల కలహాలు, కుల, మత రాజకీయాలకు దూరంగా దేశం కోసం, ప్రజల శ్రేయస్సుకోసం ఉన్నత ఆశయా లే ఆయుధాలుగా కమ్యూనిస్టుల ప్రస్థానం ప్రత్యేకమైనది. ఆ పార్టీల నేతృత్వంలోని సాయుధ పోరాటంతో తెలంగాణలో ఊరూరా ఎర్ర జెండా రెపరెపలాడింది. కమ్యూనిస్టుల ఉద్యమాలంటే ప్రభుత్వాలు వణికిపోయేవి. మార్క్సిస్ట్ సాహిత్యం లక్షలాది మంది యువతను వామపక్ష భావజాలం వైపు తీసుకెళ్లింది. వాళ్ల పాటలు ప్రజలను ఉర్రూత లూగించేవి. ఇక చట్టసభల్లోనూ కమ్యూనిస్టుల గళం బలంగా వినిపించేది. గ్రామ స్థాయిలో వారు రగిల్చిన అరుణారుణ చైతన్య స్ఫూర్తి కిరణాలు అభ్యుదయ సమాజానికి బాటలు వేశాయి. వందేళ్ల చరిత్రలో కమ్యూనిస్టులు సామ్యవాద భావజాలానికి, లౌకిక ప్రజాస్వా మ్య విలువలకు అంకితమై వాటిని కాపాడేందుకు ఆహర్నిశలు పాటు పడ్డారు. సెక్యులరిజాన్ని కాపాడడంలో, వివిధ రంగాల్లో అధిపత్య శక్తులను నియంత్రించడంలో, ప్రజలను చైతన్యం చేయడంలో కమ్యూనిస్టుల పాత్ర గణనీయంగా ఉందన్నది వాస్తవం. ముఖ్యంగా వెట్టిచాకిరీ నిర్మూలన, భూసంస్కరణలు కామ్రేడ్ల విజయాలకు చారిత్రక నిదర్శనాలు. ఇప్పటి పాలకుల గొప్పలన్నీ నాటి కమ్యూనిస్టు పోరాట విజయాలపై ఎగురుతున్న రంగుల జెండాలే. యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఉపాధి హమీ పథకానికి కమ్యూనిస్టులు చేసిన పోరాటాలే అసలు సిసలైన కారణమన్నది తెలిసిన నగ్నసత్యం.

ఎందుకిలా..?

రాజకీయాల్లో డబ్బు పాత్ర పెరిగింది. సమాజానికి కలిగే లాభాన్ని చూడకుండా వ్యక్తిగత ప్రయోజనాల గురించి ప్రజలు ఆలోచించడం పెరిగింది.1991 తర్వాత ఎన్నికల తీరులో మార్పు వచ్చింది. ఎన్నికల రాజకీయాల్లో రూలింగ్ పార్టీలతో కమ్యూనిస్టులు పోటీ పడలేకపోయారు. వాళ్లకు కార్పొరేట్ విరాళా లు తక్కువ. పెద్ద పార్టీలతో పోటీ పడేంత డబ్బు లేదు. ఇక ఆ పార్టీల నాయకులు కూడా రాజీపడిపోవడం నేర్చుకున్నారు. అధికార పార్టీలతో, ప్రభుత్వాలతో మిలాఖత్ కావడం. పార్టీల నిర్వహణ ఆర్థిక అవసరాల రీత్యా అధికార పార్టీల ఉచ్చులో ఇరుక్కుపోవడం, చివరకు ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయడానికి కూడా సాహసించలేని దుస్థితికి చేరుకోవడం, ఒకటీ అరా సీట్ల కోసం అధికార లేదా ఇతర పార్టీలతో పొత్తుకు వెంపర్లాడాడే దుర్గతికి చేరుకోవడం, కుటుంబ పోషణలు మొదటి ప్రాధాన్యత కావడంతో, పార్టీల పోరాటాలు, ఉద్యమాలు, జనా న్ని సమీకరించడం వంటివి చాలా తగ్గిపోయాయి. అలాగే పార్టీల నాయకత్వం కూడా పోరాటాల నుంచి కాకుండా అస్మదీయ కుల సమీకరణల నుంచి ఎదగడంతో మిగతా పార్టీలకు వీళ్లకీ తేడా లేదు అన్న చర్చతో చాలా మంది నేతలు వలస బాట పట్టారు. పదవుల కోసం మెతక వైఖరులు లాంటివి ఘన చరిత్ర కలిగిన కామ్రేడ్ల ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. చివరికి కమ్యూనిస్టు రాజకీయాల్లోకి యువ తరం అడుగు పెట్టక పోవడం కమ్యూనిస్టుల జీవిత కాలంలో అత్యంత దుర్భరమైన కాలంగా పేర్కొంటున్నారు.

ఇప్పటికైనా..

పార్టీల సిద్ధాంతాలు.. విధానాల కంటే వ్యక్తిగత అవసరాలు, స్వప్రయోజనాలు, అధికార కాంక్ష, అధికార దుర్వినియోగం ఆయా పార్టీలకు అసలు సిసలైన ఎజెండాలుగా మారిపోతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో, ఎవరితో కలిసివుంటారో.. ఎప్పుడు విడిపోతారో తెలియని అయోమయ అగమ్యగోచర పరిస్థితి. గతంలో ఏ చిన్న సమస్య తలెత్తి నా, ఇళ్లు కూల్చివేస్తున్నా.. నిరుద్యోగులు లాఠీ దెబ్బ లు తింటున్నా వారి తరఫున నిజాయితీగా ఎర్రజెండాలతో ఉద్యమించే కామ్రేడ్లు.. ఇప్పుడు కరువయ్యారు. ముందు నిలిచేవారే కనుచూపు మేరలో కనపడుత లేరు. నేటి ప్రతిపక్షాలు రాజకీయాల కోసం హంగామా చేసినా, బాధితులకు పూర్తి భరోసా లభించడం లేదు. అణగారిన వర్గాలకు నిజమైన కమ్యూనిస్టులతోనే సరైన న్యాయం లభిస్తుందని, వారు మాత్రమే తమ కోసం నిజాయితీగా పోరాడేవారనే అభిప్రాయం ఇంకా అణగారిన వర్గాల్లో వినిపిస్తోంది. ధన బలం రాజకీయాల కోసం కాకుండా, సమస్య పరిష్కారం కోసం, బాధితులకు న్యాయం చేకూర్చేందుకు ప్రశ్నించేవారు లేకుంటే ప్రజాస్వా మ్య మనుగడ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే నేటి నాయకత్వాలు మారుతున్న భారత ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకోకుండా, విదేశీ నాయకత్వాల పునాదులపై ముందుకెళ్లకుం డా, స్థానిక సమస్యల ఎజెండాగా ముందుకెళితే క‌మ్యూనిజానికి జేజేలు పలకటానికి ప్రజలు సిద్ధం గానే ఉన్నారు. అందుకు అలనాటి నిస్వార్థ త్యాగ శీలురైన కామ్రేడ్స్ పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, బి.ఎన్.రెడ్డి, ధర్మ భిక్షం, గుమ్మడి నర్సయ్య లాంటి వాళ్ల త్యాగాల స్ఫూర్తిగా నేటి నాయకత్వాలు ముందుకెళ్లాలని ఆశిద్దాం.

డాక్టర్. బి. కేశవులు. ఎండి. సైకియాట్రీ

ఛైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం

85010 61659

Tags:    

Similar News