కేసీఆర్ మాటలకు అర్థాలే వేరులే!
Telangana Cabinet approves KCR U-turn, RTC-Government merger
“తోటకూర నాడే చెప్పకపోతివే అమ్మా..” అంటూ పశ్చాత్తాపానికి గురైన ఓ అమాయక కొడుకు తన తల్లితో ఆవేదనతో చెప్పే మాటలు ఒక నానుడి రూపంలో తెలుగునాట చిరపరిచితం. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేసుకోవడంపై రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఈ సామెతనే గుర్తుచేస్తున్నది. నాలుగేండ్ల క్రితం ఆర్టీసీ కార్మికులు 47 రోజుల పాటు సమ్మె చేశారు. ప్రభుత్వం ముందు ఉంచిన పలు డిమాండ్లలో ‘విలీనం’ అంశం ప్రధానమైనది. కానీ ఆనాడు ఈ డిమాండ్‌ను బుట్టదాఖలా చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు తనంతట తానుగా ఆమోదం తెలిపింది.
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన ఆ కాలంలో ఎలాంటి ఎన్నికలు లేవు. అప్పటికే అసెంబ్లీ, పార్లమెంటు ఎలక్షన్స్ అయిపోయాయి. వారితో బీఆర్ఎస్‌కు ఎలాంటి రాజకీయ అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వారి అవసరం ఏర్పడింది. అందుకే హఠాత్తుగా ఈ అంశాన్ని భుజానికెత్తుకున్నది. ఓటు బ్యాంకు రూపంలో వారి మెప్పు పొందే ప్రయత్నం చేసింది. ఆర్టీసీ ఉద్యోగుల, కార్మికుల, వారి కుటుంబాల ఓటు బ్యాంకు విలువ ఇప్పుడు కేసీఆర్ గుర్తించినట్లున్నారు. దూరమయ్యారన్న భావనతో వారిని దగ్గర చేసుకునే ప్రయత్నమేనా ఇది?
నాడు అసంభవం అని పలికినా...
ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలోకి తీసుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టడంలేదు. గవర్నమెంటు ఎంప్లాయీస్‌కు దీటుగా గుర్తించడాన్ని స్వాగతిస్తున్నారు. కానీ నాలుగేళ్ల క్రితం కార్మికులు ఈ డిమాండ్ లేవనెత్తినప్పుడే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉంటే 47 రోజుల పాటు సమ్మె చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. 50 మందికి పైగా కార్మికుల ప్రాణాలూ దక్కేవి. ఆనాడు అసంభవం అంటూ బుట్టదాఖలా చేసింది. భూగోళం ఉన్నంతకాలం సాధ్యం కాదని బీరాలు పలికింది. అసంమజసం, అసంబద్ధం, అసంభవం, అర్థరహితం, తెలివితక్కువ నినాదం.. ఇలాంటి మాటలతో తిరస్కరించింది.
ఇప్పుడు ఆకాశంలోంచి ఊడిపడిన తరహాలో ప్రభుత్వమే తనంతట తానుగా నిర్ణయం తీసుకున్నది. రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదువా అని కేసీఆర్ తరచూ గుర్తుచేస్తుంటారు. అందుకే కాబోలు ఆనాడు అసంభవం, అసాధ్యం అయిన ‘విలీనం’ ఇప్పుడు సుసాధ్యంగా మారింది. ‘గవర్నమెంట్ అంటే బాధ్యతుంటది.. పద్ధతుంటది.. మిగతా కార్పొరేషన్లు ప్రభుత్వంలో కలపాలని దరఖాస్తు పెడితే ప్రభుత్వం ఏం చేయాలి.. ఇవే కోర్టులు ఆర్డరిస్తయి.. ఆర్టీసీని కలిపినప్పుడు వీటినెందుకు కలపవని అంటయి.. అప్పుడేం సమాధానం చెప్పాలి..’ అంటూ లాజిక్ తీసుకొచ్చారు.
మాసిపోని మానసిక గాయాలు
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, అవి కలిగించిన మానసిక గాయాలను వారు మర్చిపోలేదు. “ఏం సమ్మెనండీ ఇది.. ఆలోచన, బుద్ధి, జ్ఞానం ఉండి చేసే సమ్మెనా ఇది.. తిన్నదరగక చేసే సమ్మెనా.. మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడూ ఇట్ల చెయ్యడు... ఆర్టీసీ మునగక తప్పదు.. దాని పని అయిపోయింది.. మా సంస్థను మేమే సంపుకుంటం.. మా విషం మేమే తాగుతం.. సమ్మెకు ముగింపు ఎక్కడిదండీ.. ఆర్టీసీ కథే ముగుస్తున్నది.. యూనియన్లు ముంచుతూ ఉంటే ప్రభుత్వం ఎట్లా కాపాడుతది..”.. ఆనాడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కార్మికుల మెదళ్ళలోంచి తొలగిపోలేదు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ‘సకల జనుల సమ్మె’లో ఆర్టీసీ కార్మికులూ యాక్టివ్‌గా పాల్గొన్నారు. “సమైక్య రాష్ట్రంలో పోలీసులు కొట్టిన లాఠీ దెబ్బల రుచి చూశాం.. బాధను అనుభవించాం.. అయినా అధిగమించాం.. కానీ సొంత రాష్ట్రంలో కేసీఆర్ వ్యాఖ్యలు వాటిని మించి బాధించాయి. ఆ మానసిక గాయాలు ఇంకా ఉన్నాయి. బలుపు, అహంకారం, సంస్కారం, పిచ్చి పంథా, చిల్లర రాజకీయాలు, బతకదల్చినోడు ఉంటడు.. లేనోడు పోతడు.. కేసీఆర్ పలికిన ఈ మాటలను మర్చిపోలేం.. ఎప్పటికీ గుర్తుండిపోయే చేదు జ్ఞాపకాలు..” అంటూ నాలుగేళ్ళ నాటి ఆవేదనను ఇప్పటికీ గుర్తుచేస్తున్నారు.
ఆశించిన మైలేజ్ వస్తుందా?
ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ నుంచి ఊహించనంతగా అవమానాలు ఎదుర్కొన్నారు. కోర్టుకు వెళ్ళినా ఉపశమనం లేదు. చేసేదేమీ లేక నిస్సహాయులుగా మిగిలిపోయారు. పోరాడి ఓడారు. వారంతట వారుగా సమ్మె నుంచి నిష్క్రమించారు. ఆనాడు ప్రధాన డిమాండ్‌ను కాదు పొమ్మన్న కేసీఆర్ ఇప్పుడు తలొగ్గారు. పాత గాయాలన్నింటినీ ఆర్టీసీ కార్మికులు మర్చిపోతారా జీ హుజూర్ అంటారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జై కేసీఆర్ అంటూ ఓటు వేస్తారా యూనియన్లు, సమ్మె చేసే హక్కును హరించినా ఆయనకే జై కొడతారా.. ఇవన్నీ ఇప్పుడు తెరమీదకు వస్తున్న ప్రశ్నలు.
సమ్మెను అణచివేయడంలో సర్కార్ అప్పట్లో సక్సెస్ అయింది. ఆర్టీసీ కార్మికులు అవమానాలన్నింటినీ దిగమింగుకున్నారు. ఆత్మగౌరవం కోల్పోయామని తెలిసినా సైలెంట్‌గానే ఉండిపోయారు. కేసీఆర్ తీరు ఇంతే.. అనే అభిప్రాయానికి వచ్చారు. ఇప్పుడు ‘విలీనం’ నిర్ణయంతో పాత జ్ఞాపకాలను మర్చిపోతారా బీఆర్ఎస్‌ను ఆదరిస్తారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూలంగా ఓటేస్తారా ఈ నిర్ణయంతో ఆశించిన మైలేజ్ వస్తుందా ఇవీ ఇప్పుడు గులాబీ నేతల్లో జరుగుతున్న చర్చలు. మాసిపోని గాయాలతో కార్మికులు ఎలా స్పందిస్తారన్నది కీలకం.
ప్రశ్నార్థకంగా కేసీఆర్ తీరు
వైఎస్సార్ తరచూ ‘విశ్వసనీయత’ గురించి ప్రస్తావించేవారు. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉన్నవారికి ఇది చాలా అవసరం అంటూ గుర్తుచేస్తుండేవారు. కేసీఆర్ వ్యవహార శైలి దీనికి భిన్నం. దళితుడే ముఖ్యమంత్రి.. మూడెకరాల భూమి.. మాట ఇస్తే తల నరుక్కుంటడు గానీ.. ఇలాంటివన్నీ రాష్ట్ర ప్రజలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. రాష్ట్ర సాధన కోసం జేఏసీ పేరుతో అందరూ ఒక్కటయ్యారు. కానీ కేసీఆర్ పాలనలో ఆర్టీసీలో యూనియన్ భావనకే తావు లేకుండాపోయింది. ఆ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. కార్మికులు సంఘటితమయ్యే అవకాశాలు అడుగంటాయి.
ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయ సమ్మతం కాదు.. వారివి గొంతెమ్మ కోర్కెలు.. ఎట్టి పరిస్థితుల్లో విలీనం ప్రసక్తే లేదు.. వారు తీవ్రమైన తప్పిదం చేశారు.. ఆర్టీసీని నష్టపర్చిన వారిని క్షమించే ప్రసక్తే లేదు.. ఇప్పుడు వీటన్నింటినీ కేసీఆర్ ఎలా సమర్థించుకుంటారు? ఆనాడు అసాధ్యమన్న ‘విలీనం’ ఇప్పుడు ఎలా సాధ్యమైంది? భూగోళం ఉన్నంతకాలం.. అనేది ఇప్పుడు ఎందుకు మారిపోయింది? అప్పుడు అసంబద్ధమైనది ఇప్పుడెలా సమంజసంగా మారింది? ఆనాడు కేసీఆర్ చేసిన వ్యాఖలన్నీ ఇప్పుడు ‘తూచ్’ అని అనుకోవాల్సిందేనా? విలీనం నిర్ణయానికి సంతోషించాలా లేక యూ-టర్న్ తీసుకున్నారని నిందించాలా?
ఇచ్చినప్పుడే తీసుకోవాలి..
ఆర్టీసీ కార్మికులు ఆనాడు లేవనెత్తిన డిమాండ్‌ను అర్థరహితమైనదిగా కేసీఆర్ కొట్టిపారేశారు. ఇప్పుడు ఏ రూపంలో అర్థవంతంగా మారిందనేది కేసీఆర్‌కే తెలియాలి. అప్పట్లో తెలివితక్కువ నినాదం అని తోసిపారేశారు. ఇప్పుడు ఆ తెలివితక్కువ డిమాండ్‌కే సై అన్నారు. కార్మికులు అడిగినప్పుడు ఇస్తే ప్రభుత్వం మెట్టు దిగినట్లు అవుతుంది. కానీ తనంతట తానుగా ఇస్తే అది కేసీఆర్ మార్కు. దయాదాక్షిణ్యాలతో ఇచ్చినప్పుడు తీసుకోవాలనేదే కేసీఆర్ ఫిలాసఫీ. అందుకే అందరూ ఆశలొదులుకున్న తర్వాత కేసీఆర్ తనదైన తీరులో నిర్ణయం తీసుకున్నారు.
కేసీఆర్ విధానం ఇలా ఉంటే ఇక ఆర్టీసీ కార్మికులు ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరం. ఆనాటి ప్రధాన డిమాండ్‌ను అప్పుడే సాధించుకోలేకపోయినా ఇప్పుడు సాకారమైనందుకు సంతోషపడతారా లేక అప్పటి అవమానాలను మర్చిపోలేక ఓట్లతో కేసీఆర్‌కు తగిన పాఠం నేర్పుతారా? హిట్లర్ - కోడి ఈకల కథ తరహాలో స్పందన ఉంటుందా లేక అదను చూసి దెబ్బ కొడదాం అని నిర్ణయం తీసుకుంటారా? ఇదీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. కేసీఆర్ పాచిక పారుతుందా లేక రివర్స్ కొట్టి బూమెరాంగ్ అవుతుందా అనే దానికి కాలమే సమాధానం చెప్తుంది. విలీనంపై సర్కారు నిర్ణయం ఎలా ఉన్నా, ఆనాడు సమ్మె సందర్భంగా ఆర్టీసీ కార్మికులను తూలనాడిన మాటల్ని కేసీఆర్ వెన్కకు తీసుకుంటారా?
ఎన్. విశ్వనాథ్
99714 82403