కొంతమంది తమ కోసం ఆలోచిస్తారు. మరికొంత మంది ప్రజలు కోసం ఆలోచిస్తారు. ఇంకొంతమంది సామాజిక మార్పుకోసం తమ ఆలోచనలను ఆచరణలో పెడతారు. అటువంటి వారిలో బిందేశ్వర్ పాఠక్ ఒకరు . బిందేశ్వర్ పాఠక్ అంటే కొంత మందికి మాత్రమే తెలుస్తుంది. కానీ సులభ్ కాంప్లెక్స్ (ప్రజా మరుగుదొడ్లు) పేరును చూడని వారు, వాటి గురించి వినని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. బస్ స్టేషన్లలోనూ, రైల్వే స్టేషన్లలోను,నగరాలు, పట్టణాలలో రద్దీగా ఉండే ప్రదేశాలలో సులభ్ కాంప్లెక్సులు ఉన్నాయి. ప్రజలు బహిరంగ ప్రదేశాలలో మల, మూత్ర విసర్జనలు చేయకుండా ఇవి ఆపగలుతున్నాయి. నగరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నాయి. వీటి నిర్వహణకు 50,000 మంది స్వచ్ఛంద సేవకులు ఉన్నారు. భారతదేశంలో వీటిని ప్రతిరోజూ సుమారుగా కోటి మంది ప్రజలు వినియోగిస్తున్నారు. ఈ వ్యవస్థను నెలకొల్పిన మహానుభావుడు పాఠక్. ఈయన 1943 ఏప్రిల్ 2న బీహార్ రాష్ట్రంలోని హాజీపూర్‌లో జన్మించారు. 1964లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి సామాజిక శాస్త్రంలో డిగ్రీని,1980లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాను పొందారు. 1985లో పాట్నా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీని పొందారు.
మాన్యువల్ స్కావెంజర్లకు విముక్తి..
బీహార్లో 1968లో గాంధీ శతాబ్ది ఉత్సవాల కమిటీలోని భాంగీ-ముక్తి (స్కావెంజర్ల విముక్తి) సెల్‌లో చేరినప్పుడు ఈయన స్కావెంజర్ల కష్టాలను మొదటి సారిగా విన్నారు. మాన్యువల్ స్కావెంజర్లు, డ్రై లెట్రిన్‌ల నుండి మానవ విసర్జనను శుభ్రపరిచే వ్యక్తుల దుస్థితిని తగ్గించడానికి నడుం బిగించారు. స్కావెంజింగ్ అనేది మానవరహిత శుద్ధి పద్ధతి అని నమ్మి, 1970 సంలో సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. ఇది విద్య ద్వారా మానవ హక్కులు, పర్యావరణ పరిశుభ్రత, సాంప్రదాయేతర ఇంధన వనరులు, వ్యర్థాల నిర్వహణ, సామాజిక సంస్కరణలను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. ఇప్పుడిది పారిశుధ్యం, పరిశుభ్రత రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉంది. ఆయన ఎంతో మంది మాన్యువల్ స్కావెంజర్లను అమానవీయ వృత్తి నుండి విముక్తి చేసి వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధిని చూపిన దార్శనికుడు. తక్కువ ఖర్చుతో సులభ్ టాయ్లెట్లను రూపకల్పన చేసిన వ్యక్తి. మాన్యువల్ స్కావెంజర్ల హక్కుల కోసం పోరాడిన మంచి మనసున్న మనిషి. సులభ్ శౌచలయ నిగమ్ లిమిటెడ్‌ను స్థాపించారు. భారతీయ రైల్వేల స్వచ్ఛ రైలు మిషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సేవలందించారు.
బిందేశ్వర్ పాఠక్ తన జీవితాన్ని మానవాళికి సేవ చేయడానికి, ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడానికి అంకితం చేసిన నిజమైన నాయకుడు. ఆయన చేసిన సేవలకు గాను 2009 సంవత్సరంలో ప్రఖ్యాత స్టాక్ హోం వాటర్ ప్రైజ్ అవార్డు లభించింది. పారిస్‌లోని ఫ్రెంచ్ సెనేట్ నుండి లెజెండ్ ఆఫ్ ప్లానెట్ అవార్డు అందుకున్నారు. 2014లో సామాజిక అభివృద్ధి రంగంలో ఎక్సలెన్స్ కోసం సర్దార్ పటేల్ అంతర్జాతీయ అవార్డుని పొందారు. భారత ప్రభుత్వం 1991వ సంవత్సరంలో ఆయన చేసిన సేవలకు గాను దేశ మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. 2023 ఆగస్టు 15న పాఠక్ గుండెపోటుతో కన్నుమూశారు. పారిశుద్ధ్యానికి మార్గదర్శకుడిగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తిగా ఆయన గుర్తుండిపోతారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన లక్ష్యాలను మరువకుండా మనమందరం నివాళులు అర్పిద్దాం.
డి జె మోహన రావు
94484 85824