ఎంతో చరిత్ర కలిగిన మునుగోడును గాయపరిచిందేంటి?

ఎంతో చరిత్ర కలిగిన మునుగోడును గాయపరిచిందేంటి?... special editorial on munugode development

Update: 2022-11-08 19:00 GMT

కనీసం మరో ఉప ఎన్నిక లేదా సాధారణ ఎన్నిక వరకు అయినా నాయకుల క్రయ విక్రయాలు, ఓటుకు డబ్బు పంపిణీని నియంత్రించే వ్యవస్థ పటిష్టంగా ఏర్పడాలని కోరుకుంటున్నాను. ఓటును అమ్మేసుకున్నంక ప్రశ్నించే హక్కును కోల్పోతామన్న కనీస స్పృహ కల్పించాల్సిన బాధ్యతను మేధావి లోకం తీసుకుంటుందన్న విశ్వాసం బతికే ఉన్నది. మునుగోడు ఉప ఎన్నికలో బయటపడిన బహిరంగ పంపిణీని చూసిన తర్వాతైనా విద్యావంతులు రంగంలోకి దిగి ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. మహబూబాబాద్ జిల్లాకు చెందిన నేత 'ఊర్కునేవాళ్లం కాదన్న' మాటలు స్ఫూర్తిమంతం కావాలి.

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు నా మిత్రుడొకరు ఫోన్ చేశాడు. అతడిది మహబూబాబాద్ జిల్లాలోని ఓ మారుమూల పల్లె. ప్రస్తుతం అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యుడు కూడానూ. 'అన్నా ఎవరు గెలుస్తరంటవ్?' అన్నాడు. 'మీరేం అనుకుంటున్నారో చెప్పొచ్చు కదా?' అన్నాను. 'పోలింగ్‌ ముగిసే వరకు రాజగోపాల్ రెడ్డికే ఐదు శాతం లీడ్ ఉన్నది. మా సర్వేలలో అదే బయటపడింది. అందుకే మావోళ్లు టెన్షన్ పడ్డరు. ఐతే వాళ్లు మూడు వేలు, మేం మూడు వేలు పంచినం. తర్వాత మేం రూ. రెండు వేల వరకు పంచినం. అదే మాకు ప్లస్ పాయింట్ కావచ్చు. సాయంత్రం ఎక్కువ పోల్ అయ్యింది. అది ఎటు పడుతుందో చెప్పలేకపోతున్నం. మావోళ్లు మాత్రం వాళ్లంతా మనోళ్లేనంటున్నరు. అందుకే గెలుస్తమని అనిపిస్తుంది. కానీ, రాజగోపాల్ రెడ్డి మీద జనానికి అభిమానం చాలా ఉన్నది. ఆయన మీదున్న అభిమానాన్ని మేం ఏం చేసినా చెల్లుబాటు కాలేదు. నేను నెల రోజులు ఐదారు ఊర్లలో ప్రచారం చేసిన. అక్కడే ఉన్న. వాళ్ల మధ్యనే తిరిగిన. ఐనా మా లీడర్లు ఏం చేయలేకపోయిర్రు. ఎవరైనా పార్టీలోకి వచ్చినా దాని వెనుక పెద్ద తతంగమే నడిచిందంటూ' తన నెల రోజుల అనుభవాన్ని పంచుకున్నడు.

'నేను గతంలో నల్లగొండ జిల్లాకు రాలె. మొన్ననే వచ్చి నెల రోజులు అక్కడే ఉన్నా. మా ప్రాంతమే చాలా వెనుకబడిందనుకునేటోడ్ని. అక్కడి ఊర్లు, గల్లీలు, రోడ్లు, డ్రైనేజీ చూసినంక మా ఊరు చాలా నయమనిపించింది. మా దగ్గరైతే ఇంత ఘోరంగా ఉంటే ప్రజాప్రతినిధులకు చెప్పుల దండేసి ఊరేగించేటోళ్లం. మా దగ్గరైతే ఊర్కునేటోళ్లం కాదు. మీ దగ్గర ప్రశ్నించే తత్వం కోల్పోయిర్రు. యువత ఎక్కువ అని పేరుకే! లక్ష మంది ఉన్నారని చెప్పిర్రు. కానీ ఏం చేశారు? అసలు ప్రశ్నించే తత్వం ఉండకపోతే సమస్యలు ఎట్ల పరిష్కారమైతవి. అందుకే మీవోళ్లకు ఆ గుణం అలవాటు లేదనిపించిందని కుండబద్దలు కొట్టిండు' 'అన్నా.. మీరు నాకు బాగా పరిచయం కనుక నా అభిప్రాయం ఉన్నదున్నట్లు చెబుతున్న. మా ఊర్ల సమస్యకు నేను ఎన్నిసార్లు మంత్రుల దగ్గరికి తిరుగుతున్నో, ఎన్నిసార్లు కలెక్టర్‌ని కలిసిన్నో మీకు తెలుసు కదా? మనం ప్రశ్నించకపోతే ఎవరన్నా పరిష్కరించేందుకు ముందుకొచ్చేది' అంటూ తన అనుభవాన్ని చెబుతుంటే తల తీసేసినట్లయ్యింది. అంటే ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్రంలోని లీడర్లంతా మునుగోడులో పర్యటిస్తే ఇక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమైంది.

కలిచివేసిన అమ్మకం

మునుగోడులో ఎవరు గెలిచారన్న చర్చ కంటే అక్కడి ప్రజలు ఎందుకు ఓటును అమ్మేశారన్న బాధ కలిచివేస్తున్నది. 'ఓటుకు ఇంత ఇవ్వకపోతే వేయం' అది మా హక్కు అన్నట్లుగా మార్చిన రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసింది. రెండు నెలల పాటు ఈ లీడర్లు, ఓటర్ల క్రయ విక్రయాలు, కండువాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాగింది. దీన్ని స్వయంగా చూసిన దూర ప్రాంత లీడర్లకు మునుగోడు ప్రజల స్వభావాన్ని తప్పు పట్టారన్నది నా అభిప్రాయం. ఇంత ఘోరంగా తమకు డబ్బులు ఇవ్వలేదంటూ పార్టీలు, నేతలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించిన వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటి కింద ట్యాగ్ లైన్లు దారుణంగా కనిపిస్తున్నాయి. ఎన్నో పోరాటాలు చేసిన ఘన చరిత్ర కలిగిన మునుగోడు ప్రాంతాన్ని ఈ ఉప ఎన్నిక గాయపరిచింది. చరిత్ర మూలాలను మూలకు నెట్టేసింది.

ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ కలిగిన ప్రాంతం. ఫ్లోరోసిస్ నరకాన్ని అనుభవించిన మునుగోడు ప్రజానీకం పరిష్కారం కోసం దశాబ్దాల పోరాటం చేశారు. తాగునీటిని సాధించుకున్న చరిత్ర పుటలు రాసుకున్నం. ఇంకా సాగునీటి భాగ్యం కలగలేదన్నది వేరే అంశం. దాని కోసమూ పునాదిరాళ్లు పడ్డాయి. ఆ పనులనే వేగవంతం చేయాలన్న డిమాండ్ ఉప ఎన్నికలోనూ నేతల కంఠంలోనూ వినిపించింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోనూ భాగస్వామ్యం కలిగిన ఈ గడ్డపైనే ప్రశ్నించేతత్వం లేదేమోనన్న అనుమానాలు రేకెత్తించడం ఆలోచించదగ్గ పరిణామం.

Also read: శతాబ్దాలుగా అభివృద్ధికి ఆమడదూరంలో మునుగోడు! సీనియర్ జర్నలిస్టు విశ్లేషణ

వారినే స్ఫూర్తిగా తీసుకుని

'తప్పు వారిదేనంటూ' ఒకరిపై నెపాన్ని మోపినా హర్షించదగ్గ పరిణామం కాదు. మొదటి నుంచి 'ఎవరేం ఇచ్చినా తీసుకోండి, ఓటుకు రూ. 20 వేలు, రూ. 30 వేలు, తులం బంగారం ఇస్తారు. అవి మీ డబ్బులే. తప్పేం లేదు. తీసుకోండి. ఓటు మాత్రం మాకే వేయండంటూ' బాధ్యత కలిగిన పదవులలో ఉన్నోళ్లు సైతం చిలుక పలుకులు పలికారు. వారేం గల్లీ లీడర్లు కాదు. రాజ్యాంగం, చట్టం, ఓటు విలువ.. అన్నీ తెలిసినవారే. అలాంటి పెద్ద మనుషులే ఓటును అమ్మేసుకోండన్నారు. ఆ ఓటుకు విలువ కట్టారు. ఓటర్లు మాత్రం ఇంకేం చేస్తారు? పనులు మానుకొని డబ్బుల కోసం వేచి చూశారు. ఓ పార్టీ తరపున అందినప్పుడు, రెండో, మూడో పార్టీ నుంచి ఎందుకు ఇవ్వరంటూ తెగేసి కొట్లాడి రాజకీయ నాయకులు అందించిన స్ఫూర్తిని ప్రదర్శించారు. ఆఖరికి డబ్బులు ఇచ్చే దాకా పోలింగ్ స్టేషన్‌కి రామంటూ పేచీ పెట్టిన ఘనతను సాధించారు. ఈ వెల కట్టిన ప్రజాస్వామ్యం ద్వారా నియోజకవర్గ అభివృద్ధి శూన్యమన్నది మాత్రం గ్యారంటీగా కనిపిస్తున్నది.

అలా జరుగుతుందా!?

కనీసం మరో ఉప ఎన్నిక లేదా సాధారణ ఎన్నిక వరకు అయినా నాయకుల క్రయ విక్రయాలు, ఓటుకు డబ్బు పంపిణీని నియంత్రించే వ్యవస్థ పటిష్టంగా ఏర్పడాలని కోరుకుంటున్నాను. ఓటును అమ్మేసుకున్నంక ప్రశ్నించే హక్కును కోల్పోతామన్న కనీస స్పృహ కల్పించాల్సిన బాధ్యతను మేధావి లోకం తీసుకుంటుందన్న విశ్వాసం బతికే ఉన్నది. మునుగోడు ఉప ఎన్నికలో బయటపడిన బహిరంగ పంపిణీని చూసిన తర్వాతైనా విద్యావంతులు రంగంలోకి దిగి ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. మహబూబాబాద్ జిల్లాకు చెందిన నేత 'ఊర్కునేవాళ్లం కాదన్న' మాటలు స్ఫూర్తిమంతం కావాలి. బాధ్యత మరిచిన ప్రజాప్రతినిధులను నిలదీసి అడిగే స్వేచ్ఛ, హక్కును పొందేందుకు ఎలాంటి ఎన్నికల కార్యాచరణ ఉండాలన్నది ఓటరు రూపొందించుకోవాలి.


శిరందాస్ ప్రవీణ్ కుమార్

80966 77450

Tags:    

Similar News