రెండళ్ళయినా మారని ధరణి! ఉదంతాలెన్నో
రెండళ్ళయినా మారని ధరణి! ఉదంతాలెన్నో... special editorial on Dharani for two years
ప్రభుత్వ భూములను ఆక్రమించినవారు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన ఇనాం భూములను వెనక్కి తీసుకోవాలి. 2021లో కేసీఆర్ చెప్పినట్టు అక్షంశాలు, రేఖంశాల ఆధారంగా వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి పట్టాదారులకు శాశ్వత రక్షణ కల్పించాలి. రద్దు చేసిన రెవెన్యూ కోర్టుల స్థానంలో జిల్లాకో ట్రిబ్యునల్ ఏర్పాటు చెయ్యాలి. తహశీల్ కార్యాలయాలలో అదనపు సిబ్బందిని నియమించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన రికార్డులను మాన్యువల్‌గా తిరగ రాయాలి. డిజిటల్ రూపంలోనూ భద్రపరచాలి. అప్పుడే భూరికార్డుల సంరక్షణ రైతులకే కాదు, దేశ ప్రగతికి కూడా కీలకం అవుతుంది.
దీర్ఘకాలంగా రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యలను, వివాదాలను పరిష్కరించడం కోసం తెలంగాణ ప్రభుత్వం 'ధరణి' పోర్టల్‌ను ఆవిష్కరించింది. అందులో భాగంగా రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి వాటి వివరాలను డిజిటలైజేషన్ చేసింది. ఆ తరువాత ఎకరా పంటకు నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయమంటూ రైతుబంధు పథకం ప్రవేశపెట్టడంతో అసలు సమస్య మొదలైంది. ఈ పథకం కోసం రైతులు పెద్ద ఎత్తున భూములను వినియోగంలోకి తెచ్చారు. తమ పేర్లను ధరణిలో నమోదు చేయించుకునేందుకు, పట్టాదారు పుస్తకాలు పొందేందుకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. పారదర్శకంగా జరగాల్సిన భూముల నమోదు ప్రక్రియ అవినీతికి దారితీసింది.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను సబ్ రిజిస్ట్రార్ నుంచి తొలగించి తహసీల్దార్‌లకు అప్పగించారు. ధరణి పోర్టల్ ప్రారంభించి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్నప్పటికీ ఆచరణలో మాత్రం అనుకున్న రీతిలో విజయవంతం కాలేకపోయింది. ధరణికి పూర్వం భూ ప్రక్షాళన కోసం 120 చట్టాలు చేసినా అవి విజయవంతం కాలేదు. ధరణికి సాంకేతిక అంశాలు తోడుగా ఉన్నప్పటికీ అమలులో జరుగుతున్న పొరబాట్లలని తప్పులను సరిదిద్దే వ్యవస్థ లేకపోవడం, కింది స్థాయి సిబ్బంది లేకపోవడం అతి పెద్ద లోపంగా మారింది.
Also read: సామాజికం: కొత్త ఖాస్రా పహాణీ కావాలి
దీనిని పట్టించుకోకుండానే
ధరణిని సాంకేతికంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకుండానే ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌లు ప్రారంభించింది. దీంతో భూవివాదాలు ఎక్కువయ్యాయి. సాంకేతిక లోపాలను అడ్డు పెట్టుకొని అక్రమార్కులు రంగ ప్రవేశం చేశారు. అసైన్‌డ్, ఎస్‌ఆర్‌ఎస్‌పీ, దేవాదాయ, ఇనాం, వక్ఫ్ భూములు ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ అవుతూనే ఉన్నాయి. కొత్త సర్వే నంబర్ల ప్రకటన, సర్వే నంబర్ లేని భూముల వివరాలు, అసలు రికార్డులు లేని గ్రామాల వివరాలు, ఖాతా నంబర్లు లేని భూములు అమ్మిన తరువాత పేరు మారని వివరాల వంటి 54 అంశాలతో సుమారు 2 కోట్ల 40 లక్షలకు పైగా ఎకరాలు ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉన్నాయి. ధరణికి ముందు ఈ భూముల కోసం కేటాయించిన 'పార్ట్-బి'ని ప్రభుత్వం పట్టించుకున్న దాఖలా లేదు. ఇందులో లక్షల ఎకరాలకు పాస్‌బుక్‌లు జారీ కాక, రైతుబంధు రాక రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
పోర్టల్‌లో మాయమవుతున్న సర్వే నంబర్ గురించి, కనిపించని డిజిటల్ సంతకాల గురించి పట్టించుకునే నాథుడే లేడు. తనఖా పెట్టిన భూములను సైతం విడిపించిన తర్వాత క్రయవిక్రయాలు జరుపుకునేందుకు ధరణి సహకరించడం లేదని లక్షలాది రైతులు వాపోతున్నారు. తప్పులని సరిదిద్దుకునే ఆప్షన్స్ లేకపోవడం, రోజుకో సాంకేతిక సమస్య రావడంతో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. మార్ట్‌గేజ్ ఉన్న భూములపై కూడా సాంకేతిక లోపాల ముసుగులో అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న తహసీల్దార్‌లు ఉన్నారు. నకీలీ డాక్యుమెంట్‌లపై కూడా ఎంక్వయిరీ చేయకుండానే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పాస్ బుక్ ఎంట్రీ కోసం, తప్పుల సవరణ కోసం కూడా రైతులు లంచాలు ఇవ్వాల్సి వస్తున్నది.
Also read: రద్దు కాకపోతే పోరు తప్పదు!
ఇప్పుడే ఖర్చు ఎక్కువ
నిషేధిత భూముల జాబితా పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం రెవెన్యూ శాఖను ఆదేశించినప్పటికీ అది కార్యాచరణకు నోచుకోలేదు. కనీసం ధరణి అమలులోకి వచ్చే ముందైనా ఈ జాబితా సిద్ధం చేసి నోటిఫై చేయాలని తహసీల్దార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ధరణి ఒక అద్భుతమని ప్రభుత్వం బడాయి మాటలు చెబుతున్నా రైతులు మాత్రం అరిగోస పడుతున్నారు. ధరణిని ప్రభుత్వం ఒక ఆదాయ వనరుగా మార్చుకుంది. ఈ రెండేళ్ల కాలంలో భూముల విలువను రెండుసార్లు సవరించిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచింది. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో అయ్యే ఖర్చు కన్నా నేడు తహసీల్దార్ కార్యాలయాలలోనే రెట్టింపు ఖర్చులు అవుతున్నాయి. రెవెన్యూ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి, మోసానికి రైతులు బలవుతూనే ఉన్నారు. ధరణి రిజిస్ట్రేషన్‌లతో ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తున్నది. పాస్ బుక్‌ల మార్పిడి పేర డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతోనే ప్రభుత్వానికి 15 కోట్ల ఆదాయం వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతో అధికారులకు పని భారం పెరిగింది. ఎనిమిది లక్షల ఎకరాలను వివాదస్పదంగా ప్రకటించిన ప్రభుత్వం సమస్య పరిష్కారానికి మాత్రం కృషి చేయడం లేదు. ప్రభుత్వ భూములను ఆక్రమించినవారు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన ఇనాం భూములను వెనక్కి తీసుకోవాలి. 2021లో కేసీఆర్ చెప్పినట్టు అక్షంశాలు, రేఖంశాల ఆధారంగా వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి పట్టాదారులకు శాశ్వత రక్షణ కల్పించాలి. రద్దు చేసిన రెవెన్యూ కోర్టుల స్థానంలో జిల్లాకో ట్రిబ్యునల్ ఏర్పాటు చెయ్యాలి. తహశీల్ కార్యాలయాలలో అదనపు సిబ్బందిని నియమించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన రికార్డులను మాన్యువల్‌గా తిరగ రాయాలి. డిజిటల్ రూపంలోనూ భద్రపరచాలి. అప్పుడే భూరికార్డుల సంరక్షణ రైతులకే కాదు, దేశ ప్రగతికి కూడా కీలకం అవుతుంది.
పసునూరి శ్రీనివాస్
అడ్వకేట్, మెట్‌పల్లి
88018 00222