చరిత్రలో రాయబడని గాథలెన్నో...!

బ్రిటీష్‌ ఇండియాకు స్వతంత్రమొచ్చెనని ఈ గడ్డ పులకించినది. గాంధీ హత్య వార్త తెలుసుకుని బాపూ బాపూయని ఈ భూమి విలపించినది.

Update: 2024-09-17 02:15 GMT

“బ్రిటీష్‌ ఇండియాకు స్వతంత్రమొచ్చెనని ఈ గడ్డ పులకించినది. గాంధీ హత్య వార్త తెలుసుకుని బాపూ బాపూయని ఈ భూమి విలపించినది. కానీ మా భూమిపై జరుగుతున్న అకృత్యాలకు మీరెందుకు స్పందించడం లేదని ఎవ్వరినీ నిష్టూరమాడని కర్మభూమి ఇది”

విలీన దినమా, విద్రోహ దినమా, విమోచన దినమా

బ్రిటీష్‌ వారి నుంచి స్వాతంత్ర్యం పొందిన ఆగష్టు 15న దేశమంతా జాతీయ జెండాలు ఎగరేసి, దేశంకోసం పోరాడిన మహానీయుల్ని స్మరించుకుని నివాళులర్పించుకోవటం కనీస బాధ్యతగా భావించుకుంటాం. సెప్టెంబర్‌ 17 విలీన దినమా, విద్రోహ దినమా, విమోచన దినమా అని మేధావులు పడే తర్జన భర్జనలతో పాటు అసలు జరపాలా, జరపరాదా అనే మీమాంసలు సాగుతూండగానె ఆరోజు వల్లభాయ్‌ పటేల్‌ ఫోటోలతో జాతీయ జెండాలు ఎగరేయడంతో పాటు హైదరాబాద్‌ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమవటానికి, నిజాం తలొంచటానికి కారణం కేవలం పటేల్‌ చొరవ, ధైర్యం అనే విధంగా ప్రచారం జరిగిపోతోంది. ఇది అనాడు ఆయుధాలు చేతబట్టినవాళ్ల, ప్రాణాలను కోల్పోయిన వాళ్ల త్యాగాలను విస్మరించడమేనని నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని జైలు జీవితం తర్వాత రహస్య జీవితం గడిపిన జైని మల్లయ్య గుప్త లాంటి ఎందరో ఉద్యమకారుల వేదన.

ఆ పోరాటం ఆధునిక వీర భారతం

ఆపరేషన్‌ పోలో 1948 సెప్టెంబర్‌ 13న ప్రారంభం కాకముందే తెలంగాణలో భూస్వామ్య చిహ్నాలయిన గడీలు కూల్చబడి మొండిగోడలతో శిధిల వ్యవస్థకు సాక్షులుగా మిగిలాయి. వేలాది గ్రామాలు విముక్తమయ్యాయి ఆయా గ్రామాల్లో ఎన్నికల ద్వారా కమిటీలు ఏర్పాడ్డాయి. ఆ కమిటీలతో ప్రజా సమస్యలు పరిష్కారమయ్యాయి. జనగామ దేశ్‌ముఖ్‌ విసునూరి రామచంద్రారెడ్డికి చెందిన 40 వేల ఎకరాలతోపాటు వేలాది గ్రామాల్లో పేదలకు పంచిన భూమి షుమారు పది లక్షల ఎకరాలు. భూస్వామ్యం నుంచి నేరుగా సోషలిజానికి తీసుకువచ్చే క్రమంలో రైతులు జరిపిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటంగా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికక్కడంతో పాటు దేశ కమ్యూనిష్టు ఉద్యమచరిత్రలో స్వతంత్ర ప్రతిపత్తిగల ఉద్యమంగానూ నిలిచింది. శ్రమ దోపిడీ, వెట్టి చాకిరీ వంటి సామాజిక దురాచారాలపై సంఘటితమైన ప్రజల ఆవేదన ఉద్యమంలా మారింది. తెలంగాణ ప్రాంతంలో 1946-51 మధ్య జరిగిన ఉద్యమం గురించి కెనడాకు చెందిన రచయిత కాంట్‌వెల్‌స్మిత్‌ 1962లో 'ది మీనింగ్‌ అండ్‌ ఎండ్‌ ఆఫ్‌ రిలీజియస్‌' అనే పుస్తకంలో పేర్కొన్నారు. రప్యన్‌, పోలిష్‌, స్పానిష్‌ భాషల్లో ఈ పోరాటానికి సంబంధించి అనేక కథలు, కవిత్వాలు వచ్చాయి. వీటి ద్వారా ఆధునిక వీరభారతంగా పేర్కొనే తెలంగాణ సాయుధ పోరాటం అంతర్జాతీయంగా పొందిన గుర్తింపుని మనం అర్థం చేసుకోవచ్చు.

సాయుధ పోరాటం అలా మొదలై...

1948 సెప్టెంబర్‌ 17న నిజాం లొంగుబాటు ప్రకటన తర్వాత కలకత్తాలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో వారి నాయకుడు రణదివే ఆలోచన మేరకు తెలంగాణలో కమ్యూనిష్టు పాలన కోసం సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. శాంతి భద్రతల రక్షణ పేరుతో కమ్యూనిస్టు పార్టీని నిషేధించడమే కాక హోంమంత్రి పదవిలో ఉన్న వల్లభాయ్ పటేల్‌ హైదరాబాద్‌లో ఒక్క కమ్యూనిస్టు కూడా లేకుండా చేస్తానని ప్రకటించడంలో 18 నెలల పాటు అడవులనుంచే కమ్యూనిస్టులు ఉద్యమం సాగించారు. పగలు పోలీసు బృందాల గాలింపు చర్యలు, రాత్రుళ్ళు గెరిల్లా పద్ధతుల్లో కమ్యూనిస్టుల దాడుల మధ్య ప్రజాజీవనం కల్లోలమయింది. సరిగ్గా మూడేళ్ల తర్వాత 1951 సెప్టెంబర్‌లో కమ్యూనిస్టులు సాయుధ పంథాను వీడి ప్రజాసామ్య మార్గంలోకి రావటానికి ఒప్పుకోవడంతో అప్పటి వరకు కమ్యూనిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం తొలగించింది. 1952లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన కమ్యూనిష్టులు 14 స్టానాల్లో గెలిచారు. నల్గొండ పార్లమెంట్‌ నుంచి పోటీ చేసిన ఉద్యమ నాయకుడు రావి నారాయణ రెడ్డి నాటి ప్రధాని నెహూ కన్న ఎక్కువ మెజారిటీ పొందడంతో నెహ్రూ చొరవతో అప్పటి పార్లమెంట్‌ భవనంలో తొలి అడుగు వేసిన ఘనత తెలంగాణ సాయుధ పోరాట నాయకుడికి దక్కింది.

ఆ మూడేళ్ల అకృత్యాలకు బాధ్యులెవరు?

ఇక్కడ ముఖ్యంగా చర్చించుకోవలసినది 1948 సెప్టెంబర్‌ 17న పోలీస్‌ చర్య పేరుతో జరిగిన సైనిక చర్య పూర్తయినా హైదరాబాద్‌ రాజ్యం కాలేదు. సైనిక పాలన మొదలై మూడేళ్ళ పాటు కొనసాగింది. నిజాం పాలన అనగానే గుర్తుకొచ్చే దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్లు, దొరల దుర్మార్గాలు ఆ వెంట ఖాసిం రజ్వీ అతడి సైన్యమైన రజాకార్లు వాళ్ళ పైశాచిక చేష్టలు చరిత్రలో లిఖించపడ్డాయి. కానీ ఆ విషాదాలకు, విశ్చంఖతలకు మించి యూనియన్‌ ప్రభుత్వం తన సైనిక పాలనలో నియమ నిబంధనలు, శాసనం చట్టం లాంటి విషయాలను పూర్తిగా మరచిపోయింది. సర్దార్ పటేల్‌ అభీష్టమైన కమ్యూనిస్టుల అణచివేత పేర ప్రజలపై మధ్యయుగాలను మరిపించే దౌర్జన్యాలకు, నీచాతినీచ కృత్యాలకు దిగిన వైనాన్ని నాజీలను మించేలా ఏర్పర్చిన కాన్సంట్రేషన్‌ క్యాంపులు, జరిపిన అత్యాచారాలు, చేసిన పిశాచకృత్యాలను వాటి గురించి తెలుసుకునీ కిమ్మనని స్వతంత్ర భారత ప్రజ, దేశ నేతల గురించి దాశరథి రంగాచార్య తన 'జీవనయానం' పుస్తకంలో ప్రసావించారు. అప్పటికే బలహీనపడ్డ నిజాం లొంగుబాటు గొప్పదనం పటేల్‌కి కట్టబెట్టేవారు ఆ మూడేళ్ల కాలంలో జరిగిన అకృత్యాలకు బాధ్యులెవరో చెప్పాల్సి ఉంటుంది. అయినా దేశంలో ఆనాడున్న 560 సంస్థానాల గాటన తెలంగాణను కట్టడం అత్యంత అవివేకం, అవగాహన రాహిత్యం.

నూటపదహార్లు వెనుక చరిత్ర ఇదీ!

బ్రిటీష్‌ ఇండియా కరెన్సీ రూపాయి కాగా హైదరాబాద్‌ రాజ్య కరెన్సీగా ఉస్మానియా సిక్కా ఉండేది. 7 ఉస్మానియా సిక్కాలు 6 బ్రిటీష్‌ రూపాయలకు సమానం. పూజాది కార్యక్రమాల్లో బ్రాహ్మణుల కోరిక మేరకు వారికి దక్షిణగా హైదరాబాద్‌ ప్రాంతం వారు 116 ఉస్మానియా సిక్కాలు ఇచ్చేవారు. ఎందుకంటే అది బ్రిటిషిండియా కరెన్సీకి నూరు రూపాయలతో సమానమవుతుందని. ఇప్పుడు నిజాము లేడు. అతని ప్రభుత్వమూ, కరెన్సీ ఏవీ లేవు కానీ వందా, వేయి, లక్ష ఏదైనా చివర నూట పదహార్లు మాత్రం తెలుగు వారి సంసృతి, సంప్రదాయమై ఉండిపోయింది. నూట పదహార్ల వెనకున్న కారణం తెలియకపోవడం తప్పేమికాదు. అసలు చరిత్ర తెలియకున్నా దోషమేమీ కాదు. కానీ చరిత్రను ఏమార్చాలనుకోవడం, అర్థసత్యాలను, అసత్యాలను చరిత్రగా ప్రచారం చేయడం దుర్మార్గం.

తెలంగాణ వీర గాథల్ని సగర్వంగా చాటుదాం

యుద్ధంలో ప్రాన్స్‌ కవులంతా చెల్లాచెదురుగా పారిపోతే దేశంలో నిలబడి ప్రజలకోసం గీతాలు రాసిన లూయి ఆరగాన్‌ గురించి ప్రపంచం గొప్పలు చెప్పుకుంటుంటే ఇక్కడ ఉద్యమంలో పాల్గొంటూనే ప్రజలకోసం, కలమెత్తిన, గళమెత్తిన కవులు దాశరధి సోదరులు, వట్టికోట ఆళ్వారుస్వామి, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజి, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి లాంటి ఎందరో ప్రజాకవుల గురించి మనమెంత గొప్పగా చెప్పుకోవాలి? జారుచక్రవర్తిపై రష్యాలో నాడు తిరుగుబాటు చేసిన నాయకులు, ప్రజాకవులు, ప్రజలకు సరితూగగల తెలంగాణ సాయుధ పోరాట గాధల గురించి సెప్టెంబర్‌ 17న సగర్వంగా చాటుకుందాం.

నరసింహ ప్రసాద్ గొర్రెపాటి

సమన్వయకర్త, మాభూమి సాహితీ సాంస్కృతిక చైతన్య వేదిక

94407 34501

Tags:    

Similar News