పాలనపై సరికొత్త ముద్ర!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు మీద ఉన్నారు. హైదరాబాద్‌ నగర చుట్టు పక్కల ప్రాంతాలను ఆక్రమణల చెరనుంచి విముక్తి చేయడానికి

Update: 2024-09-18 01:15 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు మీద ఉన్నారు. హైదరాబాద్‌ నగర చుట్టు పక్కల ప్రాంతాలను ఆక్రమణల చెరనుంచి విముక్తి చేయడానికి ఉక్కు సంకల్పంతో ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగా హైడ్రాకు సంపూర్ణ అధికారాలు ఇచ్చారు. హైడ్రా కూల్చివేతలతో కబ్జారాయుళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. గడువులోగా రైతుల రుణమాఫీ చేసి శెహభాష్ అనిపించుకున్నారు. ఇదొక్కటే కాదు ఆహార కల్తీపై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. కల్తీని నిరోధించడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి పరిపాలనలో దూసుకుపోతున్నారు. వీటన్నిటితో పాటు కోఠి ఉమెన్స్ కాలేజీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టారు. తెలంగాణ ఐడెంటిటీని కాపాడటంలో ఎవరికీ తగ్గేది లేదంటున్నారు.

హైదరాబాద్ నగరానికి ఏడాదికేడాది ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్న జనం ఎక్కువయ్యారు. అలాగే సైబరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగాలు చేయడానికి హైదరాబాద్ నగరానికి యువతీ యువకులు పోటెత్తడం మొదలైంది. దీంతో హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరించడం మొదలైంది.

స్థలాలు ఆక్రమణలకు గురవడంతో..

నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో రియల్ బూమ్ వచ్చింది. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించారు ఆక్రమణదారులు. రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో రియల్టర్లు నిబంధనలకు పాతర వేయడం మొదలెట్టారు. దీంతో హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో మెజారిటీ స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయి. వీటిలో ప్రధానంగా చెరువులు, కుంటలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే ప్రధానంగా గత పదేళ్లలో ఇవి ఎక్కువయ్యాయి. ఈ ఆక్రమణలపై రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆక్రమణల నుంచి ప్రభుత్వ భూములకు విముక్తి కలిగించాలని నిర్ణయించుకుంది. ఈ ఆలోచనలో నుంచే హైడ్రా పుట్టింది. రేవంత్ రెడ్డి చిత్తశుద్ది కారణంగా ఆపరేషన్ హైడ్రాకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది.

ఏ నిర్ణయం తీసుకున్నా..

తెలంగాణ రైతులకు మూడు దశల్లో రుణమాఫీ చేసి చూపించారు ముఖ్యమంత్రి. మూడో విడతలో లక్షన్నర రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేశారు. తెలంగాణ పాలనను గడీల నుంచి ప్రజల వద్దకు తీసుకువచ్చారు. పాలనలో కొత్త ఒరవడికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పరంగా ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. నిర్ణయాల పర్యవసానాలను ముందుగానే బేరీజు వేసుకుంటున్నారు. ఫలానా నిర్ణయం తీసుకోవడం వల్ల సమాజంలో ఏ ఏ వర్గాలకు న్యాయం జరుగుతుంది? అనే విషయాలపై క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ప్రధానంగా ఆయా రంగాలకు చెందిన నిపుణుల అలాగే బ్యూరోక్రాట్స్ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. దీంతో మహిళా లోకంలో ఈ సర్కార్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఇదొక్కటే కాదు.. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన మిగతా గ్యారంటీలపై కూడా ఈ సర్కార్ దృష్టి పెట్టింది. అలాగే ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధి ప్రదర్శిస్తోంది. పరిపాలనలో పారదర్శకతతో ముందుకెళుతోంది.

ఆహార కల్తీకి చెక్ పెట్టేందుకు..

దశాబ్దకాలంగా హైదరాబాద్ నగరం బాగా విస్తరించింది. ఐటీ కావచ్చు...మరోటి కావచ్చు భాగ్యనగరంలో ఉద్యోగాలకు వచ్చేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. వీరి ఆహారపు డిమాండ్ల కోసం హైదరాబాద్ నగరంలో హోటల్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది. దాదాపుగా ప్రతి గల్లీలోనూ హోటళ్లు, రెస్టారెంట్లు పెరిగాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు హోటళ్లు, రెస్టారెంట్లపై ఆధారపడే వారి సంఖ్య పెరిగింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హోటల్ ఇండస్ట్రీ కూడా నగరం నలుమూలలా విస్తరించింది. ప్రతి గల్లీలోనూ తోపుడు బండ్లపై పానీపూరీ వంటి తినుబండారాలు అమ్మేవారి సంఖ్య కూడా బాగా పెరిగింది. ఇవే కాదు...నగరంలో ఎటు చూసినా కర్రీ పాయింట్లు పెరిగాయి. బ్రహ్మచారులు ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాల్లో కర్రీ పాయింట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. దీంతో హైదరాబాద్‌ నగరంలోని అనేక హోటళ్లలో, రెస్టారెంట్లలో యథేచ్ఛగా కల్తీ జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆహార కల్తీపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నగరంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలోని పరిస్థితులపై అందరూ అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో ఆహార కల్తీకి చెక్ పెట్టే ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది.

చాకలి ఐలమ్మకు అపూర్వ గౌరవం

తాజాగా, తెలంగాణ అస్థిత్వాన్ని పరిరక్షించేందుకు హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకమైన కోఠి ఉమెన్స్ కాలేజీకి తెలంగాణ వీర మహిళ చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈ విషయం వెల్లడించారు. అంతేకాదు చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇలా మొత్తం మీద పారదర్శక పాలనతో ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు రేవంత్ రెడ్డి.  

- ఎస్‌. అబ్దుల్ ఖాలిక్,

63001 74320

Tags:    

Similar News