సమర్థ పాలకుడు సంఘ సంస్కర్త రాజా బహదూర్ వెంకట్రామి రెడ్డి
Remembering Raja Bahadur Venkatram Reddy, the first Kotwal of Hyderabad kingdom
హేతుబద్ధమైన ప్రక్రియ ద్వారానే గొప్ప గొప్ప భావాలు కలుగుతాయని చెప్పలేము. అవి ఎప్పుడో ఆకాశంలో మెరుపులాగా మెరుస్తుంటాయి. సృజనాత్మకమైన భావానికి, తెలివికి ఎలాంటి సంబంధము ఉండదు. అది అసంకల్పితముగా తట్టేది కూడా కాదు. దానిని సహజ జ్ఞానము అంటే సరిపోతుందేమో! మేధ తార్కికమైనది, తెలివి కారణానురాగాల మిశ్రమం, సహజ జ్ఞానము అంటే ఆ రెండింటి కన్న విశేషమైనది. విజ్ఞాన సంబంధమైన ఆవిష్కరణలు, నూతన కల్పనలు మనిషి దృక్ పరిధికి లోబడిన సృజనాత్మక భావశక్తి జనితాలే.
గుణశీలత మెండుగా ఉన్న వ్యక్తి
విజ్ఞాన శాస్త్ర పరంగా జరిగిన గొప్ప గొప్ప ఆవిష్కరణ లేవీ ప్రయోగశాలలో జరిగినవి కావు. అసలు సంబంధమే లేని విభిన్న స్థలాలలో జరిగాయి. స్నానం చేస్తున్నప్పుడు ‘గురుత్వాకర్షణ శక్తి’ని కనుగొన్నాడు ఆర్కిమోజ్. తోటలో ఒక చెట్టు క్రింద బద్ధకంగా పడుకొని ఉన్నప్పుడు రాలిపడిన పండు మెదడుకు పనిచెప్పగా ‘భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని’ ఆవిష్కరించాడు న్యూటన్ మహాశయుడు. ‘పెరూ’లో అనారోగ్యంతో మంచం మీద పడుకొని ఉండగా కాలానికి, దూరానికి మధ్య గల సంబంధాన్ని కనుగొన్నాడు ఐన్‌స్టీన్. నేలను తొలిచే ఒక కీటకం పనివిధానాన్ని గమనించిన ఒక ఇంజనీరు సొరంగాలను తొలిచే ఒక కొత్త విధానాన్ని కనుగొన్నాడు. సముద్రతీరంలో తీరుబడిగా కూర్చున్నప్పుడు చంద్రునికి, ఆటుపోట్లకు గల సంబంధాన్ని కనుగొన్నాడు కెప్లర్. సృజనాత్మకత గలవారు విచిత్రమైన ఆలోచనపరులుగా కనబడవచ్చును. సృజనపరులైన ఆ ప్రపంచ ప్రఖ్యాత మహాపురుషులు చదువులో అంతగా రాణించిన వారు కాదు. వాస్తవంగా, వారి ఆలోచనలు ఇతరుల కన్నా భిన్నంగా ఉండేవి. వారి చింతనా శైలి సృజనాత్మక భరితంగా ఉండేది.
సృజనాత్మకతను నేరుగా బోధించలేం. దానికి అనుగుణమైన ఒక వేదికనో, వాతావరణాన్నో కల్పించగలం. ఏ కట్టుబాట్లు, ఆంక్షలు లేకుండా సంపూర్ణ స్వేచ్ఛా వాతావరణంలో సృజనాత్మకత నవనవోన్మేషమౌతుంది. సాధారణంగా సృజన పరులైన వారికి లక్షణాలు నిష్కాపట్యం, ఊహాత్మకత, నమ్రత, విభిన్నత్వం, పట్టుదల. అయితే, వ్యక్తి వృత్తి జీవన విధానంలో ఎంచుకోబడిన విషయంపై తరచుగా ఆలోచిస్తుండటం వలన, దానికి సృజనశీలత అనుసంధానమవడంతో నూతన విషయాలు ఆవిష్కరణల రూపంలో బహిర్గతమవుతుంటాయి.
అట్టి గుణ శీలతలను సహజాతంగా, మెండుగా కలిగివున్న వ్యక్తి హైదరాబాద్ నగర 14వ కొత్వాల్ పాశం వెంకటరామరెడ్డి. ఉన్నత విద్యావకాశాలు పొందలేకపోయిన, విదేశీ విద్య లేకపోయినా వ్యవహార శైలిలో అలాంటి అవకాశాలను పొందిన వారిని మించిన సమర్ధతను, సార్ధకతను నిరూపింపజేసిన మహనీయుడు. హిందూ ముసల్మానుల మతకలహాలను ఎంతో నేర్పుతో, ఓర్పుతో శాంతింపజేయడమే కాకుండా, వారిలో పరస్పరమైన సుహృద్భావ వాతావరణాన్ని కల్పించడం అనేది ఊహకందని విషయం.
కొత్వాల్‌గా నియమితులై..
ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలను, స్థానాలను సందర్శించడం మూలంగా ప్రజల బాధలను, అవసరాలను, ఆశక్తతలను పూర్తిగా అర్థం చేసుకుని, వాటికి కారణాలను సైతం అవగతం చేసుకుని సామాజిక పరమైన పరిష్కారాలను వెదుకుతూ తన మస్తిష్కంలో పొందుపరచుకున్నారు. మానవతా వాదం వారిలో నిండుగా ఉండేది. సహజాతంగా రౌద్రగుణం కలవారు. సద్భుద్ది, సహనశీలత, సకారాత్మకత, అతి తక్కువ సమయంలోనే ఎదుటి వ్యక్తుల మనోభావాలను గుర్తించగల సూక్ష్మబుద్ధి, సేవాదృక్పథం, అన్నింటినీ మించిన సృజనాత్మకతల వరప్రసాది పాశం వెంకటరామరెడ్డి. రాచరిక వ్యవస్థ లక్షణాలతో కూడుకొనియున్న హైదరాబాద్ నగర కొత్వాలీ వ్యవస్థ స్వభావాన్ని సమూలంగా మార్చివేసి ప్రజాస్వామ్య పద్ధతిలో బాధ్యతల నిర్వహణను చేపట్టినారు. తదనుగుణంగా పోలీసు శాఖలో మార్పులను ప్రవేశపెట్టి పేదల పాలిట పెన్నిధిగా వ్యవహరించారు. ఏడుగురు ప్రభువులు పాలించిన నిజాం రాజులలో ఏడవ నిజాం పాలనా కాలంలో హైదరాబాద్ నగర కొత్వాల్‌గా నియమితులైన ఏకైక లేదా చివరి హిందువు పాశం వెంకటరామరెడ్డి. తన పరిపాలన శైలిలో ఏ చిన్న దోషం దొర్లినా మతపరమైన వివాదాస్పదుడిగా మద్రపడగల సున్నిత పరిస్థితి వారిని అనునిత్యం వెంటాడుతూనే ఉండేది. కానీ ఆయన నిష్పాక్షికత, ఆలోచనా సునిశతత్వం, గ్రహణశీలత, వినయం, మితభాషిత్వం, శాంతి కాముకత్వం, అన్నింటి కన్నా మానవీయ తత్వ గుణశీలతల వలన ఆయనొక చారిత్రక పురుషుడిగా, లౌకిక వాదిగా ప్రజల గుండెల్లో సదాస్మరణీయులుగా నిలిచిపోయారు.
ఎవరికో తొత్తుగా వ్యవహరించకుండా..
ఉత్కృష్టమైన ఆయన పోలీసు పరిపాలన విధానాలు, సంఘ సంస్కరణల విధానాలకు ముగ్ధుడై పోయిన ఏడవ నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్... వారిని ‘రాజా బహదుర్’ అను బిరుదుతో సత్కరించారు. పదవీ విరమణ వయసు వచ్చినా కొత్వాల్ సేవలను పలుమార్లు పొడిగించి వారి అభిమతాన్ని అలా చాటుకున్నారు. బ్రిటిష్ ఇండియా వారి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ‘రెసిడెంట్’కు సైతం నిత్యం అందుబాటులో ఉంటూ వారి వ్యవహారిక విషయాల్లో ఆహ్వానం మేరకు చొరవ చూపుతూ అందించిన విశిష్టమైన సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ రాణిచే ‘ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్’ అనే పతక ప్రధాన సత్కారాన్ని పొందారు. స్వతహాగా రాజా బహదూర్ పాలకుల వ్యతిరేకి కాదు. అలాగని వారికి తొత్తుగానూ వ్యవహరించలేదు. ఆది హిందూ దళిత ఉద్యమకారుడైన భాగ్యరెడ్డి వర్మపై హైదరాబాద్ నగర బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయబడిన సందర్భంలో కొత్వాలు తన పలుకుబడిని ఉపయోగించి ఆయనపై ఎలాంటి చర్య లేకుండా చేశారు. విధి నిర్వహణలో ప్రదర్శించిన సమర్థత, విశ్వసనీయతల వలన చేకూరిన పలుకుబడినంతా తెలంగాణ ప్రజల పురోభివృద్ధికి, సామాజిక సంస్కరణలకు ఉపయోగించారు. అనేక సామాజిక వర్గాల సమావేశాలకు ముఖ్య అతిథిగా వెళ్ళి ఎన్నో ప్రోత్సాహాకాలనందించారు.
ఆచరణలో నిజాయితీగా వ్యవహరించి..
స్త్రీలకు పురుషులతో పాటు సమాన హక్కులుండాలని ఆకాంక్షించారు. సమాజ వికాసానికి మూలం స్త్రీలను విద్యాధికులుగా చేయడమేనని గాఢంగా విశ్వసించి వారి కోసం పలు విద్యాలయాలను, హాస్టళ్లను స్థాపించారు. ఇతరులచే స్థాపింపజేశారు. అదే విధంగా బాలురకు సైతం పలు విద్యాలయాలు, హాస్టల్‌లు వారిచే స్థాపితమయ్యాయి. మద్య నిషేధం కోసం విశేష కృషిని కొనసాగించారు. గ్రంధాలయోద్యమాన్ని ప్రోత్సహించి ఎన్నో గ్రంథాలయాల ఆవిష్కరణకు కారకులైనారు. అంధకారంలో మ్రగ్గుతున్న తెలంగాణ ప్రజానీకాన్ని జాగృతపర్చేందుకు గోలకొండ పత్రికను స్థాపింపచేశారు.
యావత్ ప్రపంచంలో పౌరహక్కుల ఊసేలేని కాలంలో కూడా రాజా బహదూర్ గారు వాటిని గుర్తించి సమర్థవంతంగా అమలుపరిచి తమ మానవత్వ పరిమళాలను విస్తరింపజేశారు. పిల్లలను అమ్ముకోవడం విధానాన్ని రద్దుచేసేందుకు అప్పటి పోలీసు మినిష్టరు సర్ ట్రెంచ్‌ని ఒప్పించి, కౌన్సిల్‌లో బిల్లును ప్రవేశపెట్టించి చట్టబద్ధతను కల్పింపజేశారు. ప్లేగు నివారణ కమిటీ సభ్యునిగా ప్రజారోగ్య పరిరక్షణకు, మెంటల్ హాస్పిటల్ పాలకమండలి సభ్యునిగా మానసిక వికలాంగుల సంరక్షణకు విశేషమైన సేవలందించారు. నాటి తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి రాజా బహదూర్ గారు చేపట్టిన సామాజిక వికాస కార్యక్రమాలను అందిపుచ్చుకొని ఆచరణలో నిజాయితీగా వ్యవహరించడం చైతన్యకాంక్షితులైన తెలుగు ప్రజల కర్తవ్యం.
(నేడు కొత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి జయంతి)
పెద్దిరెడ్డి తిరుపతి రెడ్డి
94400 11170