దక్షిణ భారత తిరుగుబాటు వీరుడు..

Remembering korukonda subbareddy

Update: 2023-10-05 22:30 GMT

బ్రిటిష్ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశాన్ని బానిసత్వపు సంకెళ్లు నుండి విముక్తి చేయడానికి బ్రిటిష్ వారితో యుద్ధం చేసిన గిరిజన వీరుల్లో కోరుకొండ సుబ్బారెడ్డి ఒకరు. ఒకప్పటి పశ్చిమ గోదావరి జిల్లా ‘కొండరెడ్డి’ అనే ఆదివాసీ తెగకు చెందిన ఆయన 1857 నుండి తన తోటి గిరిజనుల సాయంతో గోదావరి ఏజెన్సీలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటును కొనసాగించి ఒక సంవత్సరం పాటు భీకర యుద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతంలో స్వాతంత్ర్య పోరాటానికి నిజమైన చిహ్నంగా నిలిచింది అయన పోరాటం.

సిపాయి తిరుగుబాటు ప్రభావం!

ఆయన పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం నుంచి యర్నగూడెం వరకు అనేక గిరిజన గ్రామాలకు మున్సబ్‌గా ఉండేవారు. 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పీష్వా నానా సాహెబ్, తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు చేసిన రోజులవి. వారిని ఆదర్శంగా తీసుకొని కోరుకొండ సుబ్బారెడ్డి పశ్చిమ గోదావరి పోలవరం పరిసరాల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. అటవీ ప్రాంతం కావడంతో సుబ్బారెడ్డిది పైచేయి అయింది. చివరకు యుద్ధంలో పోరాడలేక నజరానా ప్రకటించింది. ఆ పోరాటంలో పాల్గొన్న రెండు ప్రధాన గిరిజన తెగలైన కొండ రెడ్లు, కోయల మధ్య విబేధాల చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు ఈస్ట్ ఇండియా అధికారులు. కానీ సాధ్యపడలేదు. ఆయనను పట్టుకోవడానికి బ్లూమ్ ఫీల్డు వారు ప్రయత్నం చేశారు కానీ పట్టుకోలేకపోయారు. కానీ రెండోసారి పట్టుబడ్డారు. ఈ పోరాటంలో దొరికిన వారిలో ఐదుగురిని జీవిత ఖైదులుగా అండమాన్ తరలించారు. కొందరిని గుంటూరు జైలుకు పంపారు. ఇక కోరుకొండ సుబ్బారెడ్డి సహా 8 మందికి ఉరి వేశారు. వీరందరిని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఉరి తీశారు. 1858 అక్టోబరు 7న వీరికి ఉరి వేశారు. సుబ్బారెడ్డికి మరణ శిక్ష విధించిన తర్వాత, అతని మృతదేహాన్ని ఇనుప పంజరంలో ఉంచి, రాజమండ్రిలోని కోటగుమ్మంలో వేలాడదీశారు. అలా ఆయన అస్థిపంజరం 1920 వరకు వేలాడదీసి ఆదివాసీలను స్వాతంత్ర్య పోరాటం వైపు మొగ్గు చూపకుండా చేశారు. ‘ఇప్పటికీ దారి సరిగా లేని ఒక చిన్న ఆదివాసీ గ్రామ పాలకుడికి ఎక్కడో మేరట్‌లో జరిగిన నానా సాహెబ్ ఆధ్వర్యంలోని సిపాయిల తిరుగుబాటు గురించి సమాచారం రావడం చాలా ఆశ్చర్యకరం. సుబ్బారెడ్డి పోరాట లక్ష్యాల్లో అనేక అంశాలున్నప్పటికీ, కోర్టులో మాత్రం నానాసాహెబ్ వస్తాడు అని చెప్పడం, ఆయన సాగించిన పోరాటంపై1857 తిరుగుబాటు ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పవచ్చు. కోరుకొండ సుబ్బారెడ్డి త్యాగం భారతీయ తరాలకు స్ఫూర్తి దాయకం.

ఎన్. సీతారామయ్య

94409 72048

Tags:    

Similar News