ప్రజల వైద్యుడు సదాశివరావు!
ఈ ఏడాదికి చాలా ప్రత్యేకత ఉంది. తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన ఐదుగురు మహానుభావుల శతజయంతి ఉత్సవాలను
ఈ ఏడాదికి చాలా ప్రత్యేకత ఉంది. తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన ఐదుగురు మహానుభావుల శతజయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు, ఘంటసాల వెంకటేశ్వరరావు, ప్రముఖ శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ. అలాగే ఈ ఏడాది అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. ఉన్నతమైన విలువలు, విద్య, వైద్య, సాంస్కృతిక, సాహితీ, రాజకీయ రంగాలలో సేవలందించిన డాక్టర్ కాసరనేని సదాశివరావు కూడా ఈ కోవకే చెందుతారు. ఆయన శతజయంతి ఉత్సవాలను నేడు జరుపుకుంటున్నారు. ఇందులో ముగ్గురికి సినీ నేపథ్యం ఉంటే.. మిగిలిన ఇద్దరు వైద్యరంగం, శాస్త్రరంగంలో పేరు ప్రతిష్టలు గడించారు. ఇలాంటి ఘనత తెలుగునేలపై కొందరికే సొంతం.
కుటుంబమంతా డాక్టర్లే!
డాక్టర్ కాసరనేని ఆరు దశాబ్దాల పాటు ప్రజలతో మమేకమై తన జీవన పయనాన్ని సాగించారు. పేదల డాక్టర్‌గా పేరు గడించారు. వృత్తి వైద్యం అయినప్పటికీ.. ప్రవృత్తి సాహితీ, రాజకీయ రంగాలు. మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించి తన స్వశక్తితో ఎదిగారు. ఆయన 13-10-1923న గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు శివారు రామచంద్రపాలెంలో జన్మించారు. తన మేనమామ స్వాతంత్ర్య సమరయోధులు పిన్నమనేని సూరయ్య ప్రోత్సాహంతో వైద్యవృత్తిని ఎంచుకున్నారు. ఆ రోజుల్లో ఎంఎస్ కోర్సులో గోల్డ్ మెడల్ సాధించడం అంత చిన్న విషయమేమీ కాదు. ఆయన కుటుంబ సభ్యులందరూ వైద్యులే! బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ కుటుంబంలోనూ ఇంతమంది డాక్టర్లు ఉండరు.
ఆయన గుంటూరులో 1951లో ప్రజా వైద్యశాలను స్థాపించారు. అది పేరుకే కాదు.. ఆచరణలో కూడా ప్రజల వైద్యశాలగా స్థిరపడింది. గ్రామీణ పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వైద్యులు వివిధ రూపాల్లో దోచుకునే రోజులవి. ఆ పరిస్థితుల్లో గ్రామీణ పేదల కష్టాన్ని దగ్గర చూసిన నేపథ్యంలో వారికి ఉచిత వైద్యాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. జీవితాంతం ఆచరించి చూపారు. ప్రజా వైద్యశాల ప్రభుత్వ వైద్యశాలను మరిపించేది. నిరుపేదలైతే మందులు కూడా ఉచితంగా ఇచ్చేవారు. నిరక్ష్యరాస్యులు, అమాయకులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. ఆయనకు ధనిక, పేద అనే తారతమ్యం లేదు. వైద్య పరీక్షలు నిర్ధారించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో రోగ నిర్ధారణ చేయడంలో ఆయనకు ఎవరూ సాటిరారు. విద్యుత్ సౌకర్యం లేకపోయినా లాంతర్ల వెలుతురులో శస్త్ర చికిత్సలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రోగుల కుటుంబాలతో మమేకమై.. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ప్రేమను, ఆప్యాయతను పంచారు. సదాశివరావు రోగులపట్ల చూపిస్తున్న వాత్సల్యమే సగం రోగాలను నయం చేసేది. అనేకమంది యువ వైద్యులను ప్రోత్సహించి వారికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. నూతన ఆసుపత్రిని ప్రారంభించే క్రమంలో అనేక ఆసుపత్రులను తన చేతుల మీదుగా ప్రారంభించారు. దీనికి కారణం ఆయన హస్త వాసిపై ఉన్న నమ్మకమే. రాష్ట్రంలో ఎక్కువ ఆసుపత్రులు ప్రారంభించిన ఘనత ఆయనకే దక్కుతుంది. వైద్య రంగాన్ని వ్యాపార దృష్టితో కాకుండా మానవతా దృక్పథంతో చూడాలని ఎప్పుడూ ఆయన చెబుతుండేవారు. ఈ తరం వైద్యులు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటే సమాజంలో విలువలు, విశ్వసనీయత పెరుగుతాయి.
రాజకీయాల్లోకి ప్రవేశించి..
డాక్టర్ సదాశివరావు స్ఫురద్రూపి, బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. క్రమశిక్షణ, విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి, ఏకాగ్రత ఆయనలో ఉన్నాయి. ఆయన ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ. అన్నింటికంటే సహృదయత, జాలి, దయ, దాతృత్వ స్ఫూర్తి ఆయనను ఉన్నత శిఖరాలపై నిలిపాయి. చదువుసంధ్యలపై ఆయనకున్న అపారమైన ఆసక్తి విద్యాసంస్థల అభివృద్ధికి బాటలు వేసేలా చేశాయి. చదువు లక్ష్యం సంపాదన కోసం కాదు.. విద్య వివేకాన్ని, సృజనాత్మకతను, సంస్కారాన్ని అందించాలని తపించేవారు. విద్యార్థి దశ నుంచే గ్రామీణ పేదలకు విద్యను అందించాలనే తపన ఆయనలో ఉండేది. విద్యార్థినీ, విద్యార్ధుల వసతి గృహాలకు తనవంతు సాయం అందించారు. పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించి దానిని కార్పోరేట్ పాఠశాలలను తలదన్నేలా తీర్చిదిద్దారు. సుదీర్ఘకాలం జేకేసీ కళాశాల పాలకవర్గంలో వివిధ హోదాల్లో పనిచేశారు. తన దార్శనికత, ముందుచూపుతో రాష్ట్రంలోనే అత్యుత్తమ కళాశాలగా తీర్చిదిద్దారు. సాంకేతిక విద్య అవసరాన్ని, ప్రాధాన్యతను గుర్తించి ఆర్.వి.ఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపనలో, పాలకవర్గంలో పనిచేశారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థగా తీర్చిదిద్దారు. ఆయన సతీమణి జయప్రదాంబ పేరుతో ఒక కళాశాలను కూడా నెలకొల్పారు. స్వాతంత్ర్య సమరయోధులు కొండా వెంకటప్పయ్య పంతులు స్థాపించిన శారద నికేతన్‌కు సదాశివరావు దంపతులు వివిధ రూపాల్లో తమ సేవలను అందించారు. ఒక జాతిని సామాజికంగా, ఆర్థికంగా నడిపించే శక్తి విద్య, విజ్ఞానానికి, నైపుణ్యానికి మాత్రమే ఉందని ఆయన ప్రగాఢ విశ్వాసం. విద్యా బోధనలో, విద్యా ప్రమాణాలలో ఎక్కడా రాజీపడేవారు కాదు.
చదువుకున్నవారు రాజకీయాల్లోకి రావాలని బలంగా నమ్మేవారు. ఆనాటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నియంతృత్వ పోకడలను తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పాలనను నిరసించారు. రైతు సమస్యలపై పోరాడుతున్న ఆచార్య ఎన్జీ రంగా అంటే ఎనలేని అభిమానం. 1978లో జనతాపార్టీ అభ్యర్థిగా కేంద్రమంత్రి కొత్త రఘురామయ్యపై గుంటూరు పార్లమెంట్ నుంచి సదాశివరావు పోటీ చేశారు. అనంతరం తన రాజకీయ గురువైన ఎన్జీ రంగాపై కూడా పోటీ చేశారు. పోటీదార్లను శత్రువులుగా కాకుండా ప్రత్యర్థులుగా చూసే స్వభావం కలిగిన సంస్కారవంతుడు సదాశివరావు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పిలుపు మేరకు 1985లో పెదకూరపాడు నుంచి పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. రైతుల కోసం అనేక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టారు. 1992లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఓటమిపై ఎన్టీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంలో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా ఎన్టీఆర్ ముందుంచారు. ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు, సినీ యాక్టర్‌గా కాదని ఆయన సమక్షంలో తన అభిప్రాయం చెప్పారు.
సాహిత్యంలోనూ దిట్ట!
సాహిత్యం పట్ల ఆయనకు ఎనలేని మక్కువ. దీంతో తెలుగు సాహిత్యాన్ని ఔపాసన పట్టారు. బలమైన వర్తమానం, ఆశావహ దృక్పథంతో అనేక మంది కవులు, సాహితీవేత్తలను ఒక వేదికపైకి తీసుకువచ్చారు. ప్రతి సందర్భంలోనూ ప్రజల ఆలోచనలతో మమేకమవుతూ, వారి ఊహలకు, ఉద్వేగాలకు, అనుభూతులకు, అనుభవాలకు అద్దం పడుతూ ముందుకు నడిచారు. సాహితీ జగత్తులో నూతన వ్యవస్థ నిర్మాణం కోసం కృషిచేశారు. గుర్రం జాషువాతో కలిసి సాహితీవేత్తలతో సదస్సులు నిర్వహించారు. ఈ సాహితీ సదస్సుల్లో తుమ్మల సీతారామమూర్తి, దివాకర్ల వెంకటావధాని, వానమాబలై వరదాచార్యులు, ఉత్పల సత్యన్నారాయణ, కాళోజి నారాయణరావు, ఏటుకూరి వెంకటనరసయ్య, సి.నారాయణ రెడ్డి, నాయని కృష్ణ కుమారి, బి.వి. నరసింహారావు, బుర్రకథలో ప్రసిద్ధులు షేక్ నాజర్, మరుపూడి కోదండరామిరెడ్డి, పుట్టపర్తి నారాయణాచార్యులు, రాజన్న కవి, రామలక్ష్మి ఆరుద్ర, మాధవరాయ శర్మ, జంధ్యాల పాపయ్యశాస్త్రి, నాగళ్ల గుళ్ల ప్రసాదరావు, బేతవోలు రామబ్రహ్మం, ప్రసాదరాయ కులపతి లాంటి సాహితీ దిగ్గజాలు పాల్గొనేవారు.
తెలుగుదనానికి ఆయన నిలువెత్తు నిదర్శనం, మహోన్నత మానవత్వం, సమున్నత వ్యక్తిత్వం. ఆయన పంచె కట్టినా, సూటు బూటు వేసినా ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. ఆనాటి సమాజంలో విలువలు, విశ్వసనీయతకు ప్రతిరూపంగా నిలిచారు. నీతి, నిజాయతీలే ఊపిరిగా శ్వాసించి, ధ్యానించి అమరుడైన డాక్టర్ కాసరనేనికి ఘనంగా శతవసంతాల నీరాజనాలు అర్పిద్దాం. తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రపుటల్లో, జన హృదయాల్లో ఆయన చిరస్మరణీయులే. ఆయన కీర్తి అజరామరం. సదాశివరావు జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం కావాలి.
(నేడు డాక్టర్ కాసరనేని సదాశివరావు శతజయంతి ఉత్సవాలు)
మన్నవ సుబ్బారావు
99497 77727