ప్రజల మనిషి చెన్నమనేని
Remembering Communist leader Chennamaneni Rajeshwara rao
‘గొప్ప వ్యక్తుల జీవితాలే చరిత్ర’ అంటారు కార్లైల్. ఆయన చెప్పినట్లుగా కొందరి త్యాగాలు, పోరాటాలు, వారి సేవలు సమాజం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. ఆ సందర్భంలో వ్యక్తిని, సమాజాన్ని వేరువేరుగా కాకుండా ఒక్కటిగానే చరిత్ర రాయాల్సి వస్తుంది. ఇలా చరిత్రను ప్రభావితం చేసిన మహనీయులెందరో.. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కమ్యూనిస్టు నాయకులు చెన్నమనేని రాజేశ్వరరావు.
ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో 1923 ఆగస్టు 31న జన్మించారు. పాఠశాల విద్య కరీంనగర్‌లో చదువుతుండగా, 4వ ఆంధ్ర మహాసభ సమావేశం సిరిసిల్లలో జరిగితే ఆ కార్యక్రమానికి 12 సంవత్సరాల రాజేశ్వరరావు వాలంటీర్‌గా సేవలందించింది ప్రముఖ నాయకుల మెప్పు పొందారు. కరీంనగర్‌లో డిబేటింగ్ సొసైటీ ఏర్పరచి దానికి కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. తొమ్మిదవ తరగతి చదివే సమయంలోనే క్విట్ ఇండియా ఉద్యమంలో భాగస్వాములైనారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంటర్మిడియట్, డిగ్రీ పూర్తి చేశారు. యూనివర్సిటీ సి హాస్టల్ వీరి కార్యకలాపాలకు కేంద్రం. అక్కడే ఉన్న ఇతర నాయకులతో ఈయనకు గట్టి మైత్రి ఏర్పడింది. 1942లో అక్కడి నుండే విద్యార్థి రాజకీయాలు ఉధృతమయ్యి 1947 నాటికి అఖిల భారత విద్యార్థి సంఘ నాయకుడిగా ఎదిగేలా చేశాయి. 1944లో కాలేజీ విద్యార్థిగా ‘భగవద్గీతపై భౌతిక దృష్టి’ అనే ఆయన ప్రసంగం భారత కోకిల సరోజినీ నాయుడి చేత ప్రశంసలను అందుకుంది.
విప్లవ సిద్ధాంతాన్ని నమ్మి..
1947 నుంచి 1948 వరకు సాగిన నిజాం వ్యతిరేక పోరాట ఉద్యమంలో తన వంతు పాత్ర పోషిస్తూ వచ్చారు. అందులో భాగంగా హైదరాబాద్ నడిబొడ్డున 1947 సెప్టెంబర్ 2న కేశవ మెమోరియల్ హైస్కూల్ ప్రాంగణంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, పోలీసులకు చిక్కకుండా రహస్య స్థలంలోకి వెళ్లిపోయారు. అలాగే 1947 సెప్టెంబర్ నుండి 1952 వరకు తెలంగాణ రైతాంగ సాయుధపోరాట నాయకులుగా అజ్ఞాత జీవితం గడిపారు. ఈ కాలంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసమంటూ తుపాకీ చేబూని ప్రజల తరపున పోరాటాన్ని చేశారు. ఈ సందర్భంలో పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముఖూం మొహియుద్దీన్, దేవులపల్లి వెంకటేశ్వరరావు, దాసరి నాగభూషణరావు వంటి నిబద్ధ కమ్యూనిస్టులతో కలిసి పనిచేశారు. 1951 నుంచి 1952 ఫిబ్రవరి వరకు ఒక సంవత్సర కాలం జైలు జీవితాన్ని అనుభవించారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత, 1952 నుంచి 2008 వరకు జిల్లా, రాష్ట్ర, అఖిల భారత స్థాయి రైతు సంఘం నాయకులుగా, 1944 నుంచి 1999 వరకు 55 సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా, జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ సభ్యులుగా వివిధ హోదాలలో పనిచేశారు. ఆరు పర్యాయాలు శాసనసభ్యులుగా, ముప్పై సంవత్సరాలు శాసనసభలో ప్రతిపక్ష పార్టీ నాయకులుగా వ్యవహరించారు. కమ్యూనిస్టు పార్టీలో ఏనాడూ ఎవరితోను ఒక మాట పడకుండా క్రమ శిక్షణాయుత కార్యకర్తగా పేరు పొందారు. పార్టీ అప్పజెప్పిన ప్రతి పనిని కఠోరదీక్షతో కార్యరూపం దాల్చడానికి నిరంతరం శ్రమించారు. అందుకే ఆయన ‘పార్టీ యజ్ఞంలో నేను సమిధను/పార్టీ చీకట్లో నేను ప్రమిదను/పార్టీ పోరాటంలో నేను సైనికుడిని/ పార్టీ నిర్మాణంలో నేను కార్మికుడిని/పార్టీ పాఠ్యాంశంలో నేనొక ముఖ్యాంశాన్నవుతాను/అవును నా పాత్ర ఇంకా సశేషం/ నేనొక విశేషం’ అని తనకు తానే గర్వంగా చెప్పుకున్నారు. ఆయన దృష్టిలో ‘విప్లవ సిద్ధాంతం అజరామరం. విప్లవమంటే శాశ్వత తీవ్రవాదంగాని, శాశ్వత హింసావాదం కానీ కాదు. వర్తమాన, సామాజిక స్థితిగతులను కాలజ్ఞానంతో ముందుకు, మున్ముందుకు నడిపిస్తూ సువిశాల ప్రజా ఉద్యమ చైతన్యంతో సమసమాజ గమ్యాన్ని చేరుకోవడం’ అని అంటారు. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానాలకు విరుగుడు సంపూర్ణ సోషలిజమే అని విశ్వసించారు.
నిత్యం ప్రజాహితాన్నే కోరి..
ప్రస్తుత సిరిసిల్ల జిల్లా ఒకప్పుడు కరువు కల్లోలిత ప్రాంతం. అలాంటి ప్రాంతానికి ముప్పై ఏళ్ళు ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించి వేలాది మంది రైతులకు కౌలుదారి భూసంస్కరణల చట్టాల ద్వారా హక్కులను కల్పించారు. సిరిసిల్ల రాయిని చెరువులో ఉన్న 600 ఎకరాల భూమిని పదివేల మంది నేత కార్మికులకు పోరాటంతో ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి ఇండ్ల స్థలాలుగా పట్టాలిప్పించారు. ఆ ప్రాంతానికి తన రాజకీయ గురువు కమ్యూనిస్టు నాయకులు బద్దం ఎల్లారెడ్డి పేరును పెట్టారు. అలాగే 1970లో అమెరికా ఫోర్డు ఫౌండేషన్ సహకారంతో అప్పటి ముఖ్యమంత్రిని ఒప్పించి ‘సెస్’ ఏర్పాటు చేయించి సిరిసిల్ల జిల్లాలో నూరు శాతం విద్యుద్ధీకరణతో పాటు వ్యవసాయానికి, పవర్ లూమ్ మగ్గాలకు ఇరవైనాలుగు గంటలూ కరెంట్ సరఫరా చేసి సిరిసిల్ల నేతన్నలకు జీవం పోశారు. అలాగే జర్మని సహకారంతో సేవ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి 200 కోట్ల అభివృద్ధి పనులు చేయించారు. ఈ జిల్లా కరువు తీరి, సస్యశ్యామలంగా ఉండాలంటే ఎత్తిపోతల పథకాలే శరణ్యమని 1957లో శాసనసభలో బల్లగుద్ది చెప్పారు. ఆయన దూరదృష్టితో రూపొందించిన ప్రణాళికలే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ద్వారా సాకారమై కరువు నేలలో కనక వర్షం కురిపిస్తోంది.
ఆయన మృదు స్వభావం, నిజాయితీ, ముక్కుసూటితనం ప్రతిపక్షాల వారిని సైతం ఆకర్షించేది. సైద్ధాంతిక విభేదాలు పక్కన బెట్టి ప్రజల కోసం పని చేసేవారు కాబట్టి, అధికార పార్టీ వారు కూడా నిర్ణయాలను తీసుకోవడానికి రాజేశ్వరరావును సంప్రదించేవారు. వీరు జిల్లాలోని అందరి రాజకీయ నాయకులతో చాలా సన్నిహితంగా మెలిగేవారు. నిత్యం ప్రజాహితాన్నే కోరుకునేవారు. అరవై ఆరేళ్ళు క్రియాశీలక ప్రజా జీవితాన్ని గడిపి, 2009లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగారు. రాజేశ్వరరావు 2016 మే 9న అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఆయన ఆలోచనల్ని, ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళులు.
(నేడు చెన్నమనేని రాజేశ్వరరావు శతజయంతి)
డా. సందెవేని తిరుపతి
చరిత్ర పరిరక్షణ సమితి తెలంగాణ
98496 18116