తెలుగు వాక్యానికి కొత్త ఒరవడి 'చేరా'

Remembering Chekuri Rama Rao

Update: 2023-10-01 00:45 GMT

తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, భాషా శాస్త్రవేత్తగా పిలిపించుకున్న మేధావి చేకూరి రామారావు ‘చేరా’గా అందరికీ సుపరిచితులు. తెలుగు వాక్యాన్ని విశ్లేషించి కొత్త ఒరవడికి ఆద్యులయ్యారు. ఆంధ్రజ్యోతి ఆదివారంలో చేరాతలు నిర్వహించిన సాహితీ పండితుడు. చేరాగా ప్రసిద్ధుడైన చేకూరి రామారావు ఖమ్మం జిల్లా మధిర తాలూకాలోని ఇల్లందు పాడు గ్రామంలో 1934 అక్టోబర్ 1న జన్మించారు. ప్రొఫెసర్ తోమాటి దోణప్ప ప్రోత్సాహంతో భాషా శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ (ఏం. ఏ) పట్టా తీసుకున్నారు. భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి ప్రోత్సాహంతో అమెరికాలోని కోర్నెల్ యూనివర్సిటీ నుంచి తెలుగు భాషా పరివర్తన సిద్ధాంతం (ట్రాన్స్‌ఫర్మేషన్‌ థియరీ ఇన్‌ తెలుగు) అనే అంశంపై పిహెచ్‌డి పొందారు. ఆధునిక భాషాశాస్త్ర రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన నామ్ చామ్‌స్కీ పరివర్తన సిద్ధాంతాన్ని ఉపయోగించి, తెలుగు వాక్యాన్ని విశ్లేషించి కొత్త ఒరవడికి ఆద్యులయ్యారు.

తెలుగు వాక్యంపై పరిశోధన

చేరా రచించిన తెలుగు వాక్యం (1975), తెలుగులో వెలుగులు (1982), భాషానువర్తనం (2000), భాషాంతరంగం (2001) వంటి పుస్తకాలతోపాటు ఇంకా ఎన్నో వ్యాసాలు భాషాశాస్త్రజ్ఞులను ఎంతగానో ఆలోచింపజేశాయి. ఇవి ఆయన భాషాశాస్త్ర రచనలలో మచ్చుకు కొన్ని మాత్రమే. ఐతే తన ప్రతిభకు రెండవ పార్శ్వం కూడా ఉంది. అదేమిటంటే సాహితీ శ్రమజీవులను అబ్బురపరిచే విధంగా భాషాశాస్త్రాన్ని మేళవించి లక్షణ చర్చను రంగరించి తెలుగు ఛందోరీతుల సూత్రీకరణలు చేయడం. తెలుగు వాక్యం-పదవర్ణ సహితం అంటూ తెలుగు వాక్య నిర్మాణంపై చేసిన పరిశోధన అనతి కాలంలో అందరి మన్ననలు పొంది వివిధ విశ్వ విద్యాలయాల్లో పాఠ్యాంశంగా, ఇతర పోటీ పరీక్షలు, ఉద్యోగార్థులకు ఉపయుక్తంగా నిలవడం గమనార్హం. సంప్రదాయ వ్యాకరణ విద్యకు, ఆధునిక భాషా శాస్త్రానికి మధ్య సహేతుకంగా హేతుబద్ధ సేతువును నిర్మించడంలో చేరా సఫలం చెందారు. సాహిత్య విమర్శ - పరామర్శ పేరిట వివిధ కవుల, ప్రక్రియల, వాదాల, విధానాల, కవిత్వ ఉద్యమాలపై 'చేరాతలు'గా మనకు అందించి ఎంతో మేలు చేశారు. ప్రధానంగా ఆయా కవుల కవితా తత్వాన్ని అరటిపండు వలిచినట్లు చేశారు.

మోజు తగ్గని చేరాతలు

అందుకే ఏళ్ళు గడచినా చేరాతలపై మోజు తగ్గలేదు. ఆసక్తీ సన్నగిల్లలేదు. అన్ని వివాదాలను తట్టుకుని నిలబడ్డారు చేరా. తన కాలర్‌ పట్టి, గుండీని వూడదీసిన యాంగ్రీ యంగ్‌మన్‌ని కూడా నవ్వుతూ పలకరించి, సుతారంగా జవాబిచ్చేవారు. ఉద్రేకం, పక్షపాతం, దళిత, లెఫ్ట్‌, రైట్‌.. ఇలా దేనితోనూ ఆయనకు పనిలేదు. ఆయన పనల్లా కేవలం కేవలం కవిత్వంతోనే ఆయన 2001లోనే రాసిన సాహిత్య విమర్శనల వ్యాస సంకలనం 'రింఛోళి' బహుముఖ ప్రశంసలను అందుకుంది. ఈ అరుదైన సంకలనంలో ప్రాచీన కావ్యాల పరిచయాలనుండి, ఆధునిక కావ్యాల పలకరింపుల కూడా విస్తృతంగా అవలోకన చేశారు. కోవెల సంపత్కుమారాచార్య ' చేరానుశీలనం' తో మొదలై పురాణ, ప్రబంధ, చంపూ, ముత్యాలసరాలు, శ్రీశ్రీ, ఆరుద్రల వరకు, సాహిత్య విమర్శనా పద్ధతులు, మార్క్సిస్టు విమర్శనా పద్ధతులు, ప్రజల భాషావికాసంతో సాహిత్యం, గ్రాంథిక, వ్యవహార భాషా శైలులు ఎన్నో ఇక్కడ తడిమి మన అధ్యయనం కోసం చేరా అందించారు.

తెలుగు సాహిత్యంలో విశేషమైనటువంటి సేవలు చేసి, ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చేకూరి రామారావు 2014 జూలై 24న డెబ్బై సంవత్సరాల వయసులో పరమపదించారు. చేరా భౌతికంగా మనల్ని విడిచి పెట్టి వెళ్లినా, ఆయన సాహిత్యానికి చేసినటువంటి సేవలు కలకాలం మిగిలి ఉంటాయనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఈ అరుదైన సాహిత్య విమర్శకుడిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడం భాషాభిమానులుగా మన కర్తవ్యం.

(నేడు చేరా జయంతి)

యాడవరం చంద్రకాంత్ గౌడ్

94417 62105

Tags:    

Similar News