కోచింగ్‌ చెరల్లో బందీలు..!

poem on Coaching Centres

Update: 2023-08-15 23:00 GMT

ఐఐటీ జెఈఈ ఐఐయం..

నీట్‌ సివిల్స్‌ గ్రూప్స్ నెట్‌ స్లెట్‌..

పోటీ పరీక్ష ఏదైనా..

సీటు కోసం తెగ యుద్ధమే...

వేలు, వందల్లో సీట్లు..

లక్షల్లో ఆశావహుల పాట్లు

పుట్టగొడుగుల్లా కోచింగ్‌ సెంటర్లు

కోటా, ఢిల్లీ గల్లీల్లో చెరసాల‌లు

అర్హతకు మించి కనే కలలు !

ఫ్యాక్టరీ ముడిసరుకుల్లా..

కోచింగ్‌ గదుల్లో పిల్లల్ని బంధించే..

పేరెంట్స్‌ దురాశల ధోరణులు

భారీ చదువుల భారాలు..

నిద్రలు బహుదూరాలు

పక్కోడిని చూసి పరేషాన్లు

నెగ్గనేమో అనే ఆవేదనలు

తీవ్ర మానసిక ఒత్తిడులు !

ప్రషర్‌ కుక్కర్‌లో పెట్టినట్టు

పీడనం పెరిగి కుక్కర్‌ పేలినట్లు..

ఒత్తిడి ఉప్పెన భారీగా పెరిగి..

కన్న కలలు కల్లలైన అకాలాన..

ఆత్మహత్యలే అంతిమ తీర్పులై..

సీలింగ్‌ ఫ్యాన్‌, నిద్ర మాత్రలు

భవనం నుంచి దూకే సాహసాలు !

తాత్కాలిక వైఫల్యాలకు..

బలవన్మరణ శాశ్వత పరిష్కారాలు

ఎంత చెట్టుకు అంత గాలని..

ఎంత ఒంటికి అంత బట్టని..

గెలుపోటములు అనివార్యాలని..

చావులు సమాధానాలు కావని..

తల్లితండ్రులు బుద్ది తెచ్చుకొని..

బిడ్డలపై మోయలేని బరువు పెట్టొద్దు

ఆత్మహత్యలకు పురికొల్పవద్దు

రేపటి పౌరులకు నేడే పాడె కట్టొద్దు !

మధుపాళీ

99497 00037

Tags:    

Similar News