కాలం ఎంతకు కదలదు
ఎంత తీసేసిన గతం వదలదు
ఒక పగలు మరొక రాత్రి
వెరిసె మెరిసే ఒకరోజు
భయంకరమైన నిశ్శబ్దం
గోడ మీద గడియారం
నిర్విరామంగా క్షణాలను
జారవిడుస్తున్న టిక్ టిక్ శబ్దం
కర్ణకఠోరంగా వినిపిస్తుంది
నువ్వీ క్షణాన్ని పండించు పండించకపో
అక్షరాల జీవించు జీవించకపో
నీ రెండో రాక కోసం కాలం
కాలు మీద కాలేసుకుని కూర్చోదు
నిన్ను దాటి మునుముందుకు
పోతూనే ఉంటుంది
పల్లె కాంతి కనుమరుగు అయ్యాక
ఊరికి వచ్చే బస్సు
పల్లెవెలుగుగా భాసిస్తుంది
మనిషి లోలోన మసిబారి పోయాక
మనసు కాలిన కట్టగా శ్వాసిస్తుంది
ఇది స్వేచ్ఛా మార్కెట్
నిన్ను నువ్వు ఏదో ధరకు తెగ అమ్ముకోవాలి
ఇది పూర్తిగా ప్రైవేటు
పాత సామానుకు కొత్త సామాగ్రి ఇవ్వబడుతుంది
ఇది ప్రపంచీకరణ
పాత చెప్పును దృశ్శాలువలో
పెట్టి అందంగా కొల్ల కొట్టబడుతుంది
ఆగామి కాలాన్ని ఫిక్స్‌డ్ ధరకు కొనుక్కోవచ్చును
గతాన్ని ఏదో ఒక వెలకు అమ్ముకోవచ్చును
ప్రపంచీకరణ అంతా కొడితే ఇంతే మరి
మాటైనా పాటైనా ఆటైనా అక్షరమైన
ఏదైనా సరే
సర్కార్ సవాల్ కు
కొసరు లేకుండా కొనబడును
-జూకంటి జగన్నాథం
94410 78095