అధ్యక్షా!
అధికార పార్టీ మెజారిటీతో
అవలీలగా ప్రభుత్వాలు
నడుస్తూనే ఉంటాయి
తమరికి అంతా తెలిసినా
అడిగితే తప్ప చెప్పని
నోరు విప్పని విదురులు మీరు
తటస్తమో, అధికార పక్షమో
ఎటూ తేల్చుకోలేని
ఆస్థాన సభలో అధ్యక్ష స్థానం మీది
మైకు ఇవ్వకపోయినా పర్వాలేదు
జనం తరఫున మాట్లాడే
నా పైన కనికరం చూపి
గొంతును మాత్రం నొక్కే
ప్రయత్నం చేయకండి ప్రభూ!
అనధికార శాసనకర్తలాంటి కవిని నేను
కమ్మిన చిమ్మ చీకట్లను చీల్చే రవిని నేను
60 ఏళ్ల పొత్తులో జరిగిన
పాలన ఒక ఎత్తు అయితే
తొమ్మిదేళ్ల పాలనలో
అధ్యక్షా! ధర్మ రక్షకులు
పట్టపగలు చుక్కలు చూపెట్టిండ్రు
నాడు వెలుగు చీకటి
కుల్లంకుల్లా కనబడుతుండేది
నేడు ఎందుకో ఏమో
అయ్యా ! దొంగ చీకటి ఒకటైనట్లు అనిపిస్తుంది
కొత్త సీసాలో పాత సారా
సంక్షేమ పథకాలు
మంకు పిల్లలను బుదురకిచ్చి
చేతిలో పుట్నాలు పెట్టినట్టు
కరుణామయులు బాంచన్
మోచేతికి బెల్లం పెట్టి నాకిపిస్తుండ్రు
నేతి బొట్టు వేసి కొసరి కొసరి పెడితే
యాష్టతో లేచిపోయినట్టు
గావర గావర గత్తర గత్తర
కండ్లు పెయ్యి తిరిగే
అంటించిన సిచ్చుబుడ్డి
అభివృద్ధి మిరుమిట్లకు పిడీలు
తాతలు, తండ్రులు యాదికొస్తున్నరు
దున్నేవాడిని కాదని
భూమి ఉన్నవాడే రైతన్నప్పుడైనా
మాకు సోయి రాకపాయె
స్పీకర్ దొరా!
పింఛన్లు ఇచ్చినప్పుడు
ఆసరా అయితండ్రు అనుకున్నం కానీ
గిట్ల మాసర్లకు లేకుండ
ఐపోతామని అనుకోలేదు
మా వాగుళ్ల ఉసికెను
లారీలల్ల ఎత్తుకు పోతుంటే
ఊర గుట్టలను పరపరా కోసుకు పోతుంటే
మునాఫా వస్తుంటే దేన్నైనా
తెగ అమ్ముతారని ఎరుగని
అమాయకులం, మ్యాదకులం
ఎడ్డోల్లం గుడ్డోల్లం చెవిటోల్లం
చెప్పులు ఉన్నోని వెంట
చెప్పులు లేనోని లెక్క తిరిగినం
బాంచన్ మీరు కూసుంటే
మహదానందంతో పల్లకీలు మోసెటోల్లం
బంజరుదొడ్లె పడ్డంక
పాయమాలు కట్టకుంటే
మారె పని కాదు కదా సారూ!
జూకంటి జగన్నాథం
కవి, రచయిత
94410 78095