అతడి ఆకలి డప్పుల చప్పుడుతో
ఈ సువిశాల ప్రపంచం నిద్రలేస్తుంది
అతడి ‘తూలి’ నడకల కింద నిర్మించబడ్డ నగరం
అతడి గుండె చప్పుడును వినిపిస్తుంది
మీకు ఊపిరికి ఆకారాలు ఉన్నాయని
తెలియదు కదా.. రండి నేను చూయిస్తాను
పగుళ్లు ఇచ్చుకున్న పాదాల గుండా
కాయలు కాసిన చేతి వేళ్ళసందున
గుంతలు పడ్డ కళ్ల మధ్యన
ఒక్కటేమిటి.. దుఃఖాలతో కూడా
గాలిని పిలుస్తూ ఉన్నాడు
నీకు బతకడానికి కలలు ఒక్కటే చాలు
అతడికి దేహం కావాలి
ఊపిరి హృదయమై హృదయం ఒక దేహమై
దేహమంతా ఒక పాదమై ఓ జీవితం కావాలి
తరాలను నిలబెట్టడానికి
తరిమి వేయబడ్డ ప్రాంతాల నుండి
వెలి వేయబడ్డ దేశాల నుండి
తిరిగి నిలబడటానికి చెమట చుక్కల కింద
చిత్రమైన బతుకు చిత్రమో.. మట్టి కొట్టుకుపోయిన
నెత్తుటి మరకల్లో మిగిలిన జ్ఞాపకమో కాదు
అసలు అతడు గాయపడటంలో విశేషమేమీ లేదు
అతడు బతకడంలో కలగనడాన్ని మర్చిపోయాడు
అతడికి కాసిన్ని కలల్ని మిగల్చడంలో
కాలమెప్పుడూ కాసింత వెనకే ఉండిపోయింది
చెప్పాపెట్టకుండా కాలం చెల్లితే
మరణానికో రూపం ఉంటుంది
ఏ ఇటుక పెళ్ల సందులోనో
ఏ సిమెంట్ కంకర లోనో
అజాగ్రత్త పేలుళ్లలోనో
ఏ రాజ్యమో పన్నిన కుట్రల మంటల్లోనో
ఇంత భూమి మీద
అతనికంటూ ఏ సమాధి లేకుండా
అనామకుడిగా అనాధగా
అతనికై వెతికే కళ్ళు ఉండవు
అతనికై కార్చే కన్నీళ్లు ఉండవు
రాజ్యాలను నిలబెట్టడానికి
రాజులు చేసిన యుద్ధాల గురించి
ప్రేమకో గుర్తులుగా నిర్మించిన భవనాల గురించి
కథలు రాసుకున్న చరిత్ర
అతడి గురించి రాయలేదు ఎందుకో!
అయినా ఎలా రాస్తుంది?
ప్రపంచం పునాదుల మీదకంటే
అదృశ్యాలనే ఆశపడుతున్నది కదా
అయినా నువ్వేం దిగులుపడకు
కత్తులు మోసిన నీ నెత్తుటి చేతుల గురించి
రాళ్ళు మోసిన నీ భుజాల గురించి
కాలమొక కావ్యం రాసే ఉంటుంది
ఆ కావ్యమెప్పుడు నీ వైపే నిలబడి ఉంటుంది
నేను, నాలాంటివాళ్ళు
నీ వైపు నిలబడి ఓ కవిత్వం రాస్తారు
నీ కోసమొక కొవ్వొత్తిని వెలిగిస్తారు
వెళ్ళిపోతూ మళ్లీ వచ్చే దారుల్లో
నీ చరిత్రను తిరిగి రాస్తారు.
(భవన కార్మికుల మహనీయ మాన్య కృషికి నీరాజనం పలుకుతూ...)
పి. సుష్మ
99597 05519