ఆ గొర్రెల మందలు మందలుగా నడుస్తున్నాయి
వాటి కుంతలాలపై కిరణాలు ప్రసరిస్తున్నాయి
ఆ నది చిక్కి శల్యమయ్యింది
దాని గుండెల మీద ఇంకా
గునపాలు పొడుస్తున్నారు
నిప్పులు చిమ్ముతూ సూర్యుడు
మనుషుల ప్రాణాలు కబళిస్తున్నాడు
నడెండలో ఎవరో రాముణ్ణి
గ్రాఫిక్స్‌లో చూపించారు!
ఇది కథా? వాస్తవమా? అని
అందరూ విస్తుపోయారు!
అందుకే వాల్మీకి రాముడు,
తులసీ రాముడు,
బౌద్దరాముడు, జైన రాముడు
ఆ కథల్లో అనేక శిల్పాల్లో పాత్రలు
అప్పటి రాముడికి మీసాలు లేవు
ఇప్పటి రాముడికి మీసాలు ఉన్నాయి!
రావణ పాత్రధారుడికైతే
గడ్డాలు మీసాలు కూడా ఉన్నాయి
సీతకి, రాముడికి
ప్రణయ గీతాలు ఉన్నాయి
కథ కాలానుగుణంగా
మారుతుంది కదా!
అది వాల్మీకి సృష్టించిన కథే గాని
అందులో నిజం లేదు కదా!
రామునితో రాజకీయమా?!
రాముని కథాగమనంలో
సీత ఒక కథలో చెల్లి
ఒక కథలో వంచిత
ఒక కథలో తిరుగుబాటుదారు
ఒక కథలో భూమి పుత్రిక
శివుని విల్లును అలవోకగా
ఎత్తగలిగిన సీతను
శివుని విల్లుని ఎత్తలేనివాడు
ఎలా ఎత్తుకెళ్లాడని ప్రశ్న?
ఒకటేమిటి! వెయ్యి ప్రశ్నలు?
వాల్మీకి ఏమో లంకంతా బంగారంతో
నిండి ఉందని చెప్పాడు
అందుకే దాన్ని స్వర్ణపురి అంటారు
రావణుడేమో మహాబలవంతుడు
వంద ఆయుధాలతో యుద్ధం చేయగలడు
పది తలలు గల మేధావి అని వాల్మీకి చెప్పాడు
రామునికేమో బాణం ఒక్కటే! విల్లంబు ఒక్కటే!
రావణుడేమో రత్న సువర్ణ
ఆభరణ ఖచిత వస్త్రధారుడు
రాముడేమో నార వస్త్రధారుడు
వాల్మీకి ఈ కథలో
రాముని వైపు మొగ్గాడా?
రావణుడి వైపు మొగ్గాడా?
అదొక ప్రశ్న?
రావణుడేమో మండోదరిని వరించాడు
ధరించాడు, రక్షించాడు
రాముడేమో సీతను వివాహమాడాడు
రక్షించుకోలేకపోయాడు
సీతా దహనానికి కారకుడయ్యాడు
సీతను అడవికి పంపాడు
చివరకు సీత ఆత్మహననం
రామునిది అనుమాన వ్యక్తిత్వంగా
వాల్మీకి తేల్చాడు
అందుకే ఓ దర్శకుడు
రావణున్ని హీరో చేశాడు
ఎవరి కథ వారిది
ఇంత జరిగినా ఇది కల్పిత కథ అని
తెలుసుకోకపోవడం ఏమిటని
అంబేద్కర్ ప్రశ్న?
ఏది భారతీయం?
ఏది అభారతీయం?
ఈ నేలలో పుట్టిన మనిషి
అభారతీయుడా?!
ఇక్కడ పుట్టిన కథ మాత్రమే భారతీయమా?
ఇది కథా వాస్తవమా?
వాస్తవ కథనమా?
ఇక్కడ నమ్మకాలు, అపనమ్మకాల
ప్రస్తావన ఏముంది?
రామ కథలో అదొక వ్యధ
అదొక గృహహింస
అదొక అనుమాన వ్యక్తిత్వం
అదొక దండకారణ్య దురాక్రమణం
అదొక ద్రవిడ స్రీ తాటకిపై
పురుషాహంకార ఆర్యుల దాడి
అదొక శూద్ర శంభూకుని వధ
అదొక గిరిజన నాయకుడు వాలి హత్య
అదొక కథా కథన ఇంద్రజాలం
ఆనాడు అక్షర కావ్యాలు
ఈనాడు దృశ్య గానాలు
రెండు మూడు గంటల ముదావహంలో
ఒక రాజకీయ హేల!
ఇప్పుడు...
దేశాన్ని రంగస్థలం చేస్తున్నారా?
నాటకశాల చేస్తున్నారా?
అందుకే అంబేద్కర్
ఆనాడే అన్నాడు
చరిత్ర వేరు, కథనం వేరు అని
ఇప్పుడు భారతదేశం బుర్రలకు
కథల బూజు పట్టింది!
చరిత్రను దహించాలని చూస్తున్నారు
భారత ఉపఖండంలో
జీవించి. నడిచి, ప్రవచించిన
చారిత్రక వ్యక్తి బుద్దుడు
ఆయన ఐదు మాటలు చెప్పి
రెండువందల దేశాల్లో
ప్రజ్వలించాడు
అందుకే ఆయన సత్యాన్నే
మాట్లాడమని చెప్పాడు
మాట్లాడదాం
చరిత్రను బతికిద్దాం
కథ కంచికి, మనం చరిత్రలోకి...
డాక్టర్ కత్తి పద్మారావు.
98497 41695