మద్యంతో.. ప్రజారోగ్యం బేజారు!
Oxford Population Health says that, Alcohol consumption increases the risks of over 60 diseases
మనిషి ప్రశాంత జీవనాన్ని చెడగొట్టి అనర్ధాలకు, అనారోగ్యానికి గురిచేసే మద్యపాన వ్యసనాన్ని తక్షణమే నియంత్రించుకుంటూ పూర్తిగా మానివేయాలని సమాజంలోని దుర్భర పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వాలు సైతం సామాజిక బాధ్యతతో దీనిని నిషేధించాలి. ఏదో సరదాగా మొదలెట్టిన మద్యపానం ఆ మత్తుకు బానిసై కుటుంబాలను, బంధాలను, బాధ్యతలను విస్మరించి లింగ భేదాలు మరిచి చిత్తుగా తాగుతూ అనారోగ్యం పాలవుతున్నారు. దీనికి బానిసగా మారిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందని ప్రభుత్వ నివేదికలే ప్రస్తుత దుర్భర పరిస్థితిని రూడీ చేస్తున్నాయి. గుడి, బడి అనే తేడా లేకుండా ఇలా అడుగడుగునా ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు దర్శనమిస్తున్న వాస్తవాన్ని కాదనగలమా! వ్యక్తులు, వ్యవస్థలు మద్యం వ్యాపారం జోరు పెంచుకుంటూ.. ఆ ఆదాయంతోనే నేడు ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే? పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతుంది. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ.. అబ్బే తప్పు చేశామని చింతిస్తూ, తిరిగి మళ్లీ అదే తప్పులు చేస్తుంటే? దానిని పశ్చాత్తాపమంటారా! ఆ పశ్చాత్తాపానికి విలువేముంది.
ఎన్నో రోగాలకు కారణం అవుతూ..
ప్రజారోగ్యానికి పట్టం కట్టాల్సిన ప్రభుత్వాలు.. ఆదాయం కోసం మద్యాన్ని సమర్థిస్తే రేపటి సమాజం ఎన్నో అనర్థాలు, మానసిక బలహీనతలతో రోగగ్రస్తంగా మారబోతుందని గమనించండి. అందుకే ప్రభుత్వాలు, మనుషులు సమిష్టిగా ఈ మద్యం వల్ల జరిగే అనర్థాలు, నష్టాల నుండి చైతన్యవంతులై అవగాహన పెంచుకుంటూ క్రమేణా నియంత్రిస్తూ, నిషేధించే విధానాలు రావాలనే ప్రశ్న అడిగే వారు లేరు? ఎందుకంటే క్రమ క్రమేణా అందరినీ ఈ ఊబి (మద్య వ్యసనం)లోకి ప్రభుత్వాలు నెట్టి వేస్తున్నాయి.. బాధితులు ఊగిపోతున్నారు. క్రమంగా నేనేమీ ఎక్కువ మద్యం తాగడం లేదని సమర్థించుకుంటారు. కానీ మనుషులు వారి స్థాయిని బట్టి ప్రతిరోజు మద్యం తాగడం పరిపాటి అయింది. ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం లేని పెళ్లి, చావు, పండుగ, కాలక్షేపం లేదన్నది కాదనలేని నిజం. ఈ పరిస్థితి మార్చలేమా? మద్యం తాగడం..అది కొంచెమైనా సరే ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఆక్స్ఫర్డ్ పాపులేషన్ హెల్త్ పేకింగ్ యూనివర్సిటీ పరిశోధకులు సుమారు 5 లక్షల మంది మద్యం బాధితులపై కీలక పరిశోధన చేసి విస్తుపోయే నిజాలు వెల్లడించారు. గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్యం 28 రోగాలకు కారణం అవుతుందని తేల్చగా, తాజా పరిశోధన మాత్రం మద్యం తాగడం వల్ల ప్రత్యేక్షంగా 61 రోగాలకు, పరోక్షంగా 206 వ్యాధులకు కారణమవుతుందని తాజా పరిశోధన స్పష్టం చేసింది. మద్యం ఎక్కువ తాగినా తక్కువ తాగినా మనిషి శరీరంలోని అన్ని అవయవాలపై దాని దుష్ప్రభావం ఉంటుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మద్యం వలన ఏటా 30 లక్షల మంది చనిపోతున్నారని, కోట్ల మంది అనారోగ్యం, అంగవైకల్యానికి గురవుతున్నారని తెలిపింది. ఈ అధ్యయనం ‘నేచర్ మెడిసిన్ జర్నల్’లో ప్రచురితమైనది.
ఇది..అణు విస్ఫోటనం కన్నా మిన్న!
ఈ పరిశోధనలో వివిధ వయస్సులకు చెందిన 5,12,724 మందిపై చైనాలో ఐదేళ్లపాటు అధ్యయనం చేసి, సుమారు లక్ష మందికి పైగా మద్యం తాగిన బాధితుల ఆరోగ్య సమస్యలను పరిశీలించి, వారి జీవనశైలి, ప్రవర్తన, మద్యం అలవాటు, జరుగుతున్న చికిత్స వివిధ అవయవాలపై దాని దుష్ప్రభావం, క్రమం తప్పకుండా తాగే వారిని, అప్పుడప్పుడూ తాగే వారిని ఇలా 12 ఏళ్ల దవాఖానాల రికార్డులు అనుసంధానం చేసి దీనిని విడుదల చేశారు. ఈ పరిశోధనలో జన్యు విశ్లేషణ కూడా చేసి, మద్యం తాగే వారు 35 ఏళ్ల నుంచి 84 ఏళ్ల లోపు దవాఖానాల్లో చేరడమో, మరణించడమో జరిగిందని గుర్తించారు. ఈ పరిశోధనలో మొత్తంగా.. మద్యం తాగడం వల్ల మనకై మనమే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అని తెలుస్తుంది. ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలిలో మద్యం తాగడం బాగా అధికమవుతుంది. ఇది ఎంతగా ఉందంటే? అది అన్లిమిటెడ్‌గా, అన్ స్టాపబుల్‌గా, భయానకంగా ఉంది. ముఖ్యంగా పిల్లలు, స్త్రీలలోను తాగే వారి వాటా ఎక్కువైపోతుంది. మద్యం తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలిసి కూడా కుంటిసాకులతో ప్రజలు తమ ఆరోగ్యాన్ని నష్టపరుచుకుంటున్నారు.
తాగడం ఎక్కువవుతే, వయసుతో సంబంధం లేకుండా తాగేవారిలో రోగ నిరోధక శక్తి బాగా తగ్గుతుంది. బీపీ, షుగర్, గుండె సమస్యలు, కడుపులో అల్సర్లు, ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా, మెదడు, కాలేయానికి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. దీనికి బానిసగా మారిన కొంతమందిలో హింసా ప్రవృత్తి పెరిగిపోతుంది. నేడు సమాజంలో జరిగే హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దుర్మార్గాలు, వాహన ప్రమాదాలు తదితర ఘటనలకు ప్రధాన కారణం మద్యం తాగడం వల్లనేనని ఎన్నో నివేదికలు సైతం తెలిపాయి. అయినా పాలకుల్లో, పాలితుల్లో మార్పు రాలేదు. రోజు రోజుకు మద్యం తాగడం పెరిగిపోతూనే ఉంది. ఇలా అయితే ఎలా? మద్యం సృష్టించే విధ్వంసం అణు విస్ఫోటనం కన్నా మిన్నగా, స్లో పాయిజనై ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందనే సోయి కూడా లేదు. కావున పాలకులారా.. పాలితులారా ప్రజారోగ్య నిర్ణయానికి కట్టుబడి.. మానవీయ కోణంలో ఆలోచించి మద్యాన్ని నియంత్రిస్తూ.. నిషేధించాలి. మద్యం ప్రియులు సైతం దీన్ని మానేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని తెలుసుకొండి.. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు. ఆనందానికి మించిన ప్రశాంతత లేదు. మద్యం వద్దే వద్దు.. ఆరోగ్యమే ముద్దు..
మేకిరి దామోదర్
సామాజిక విశ్లేషకులు
95736 66650