ప్రభుత్వ పాలనపై.. ప్రజల సంతృప్తి!

తెలంగాణలో కాంగ్రెస్ పాల‌న‌కు 9నెలలు గడుస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనే విషయంపై రాష్ట్రవ్యాప్త చర్చలు మొదలైన నేప‌థ్యంలో

Update: 2024-09-10 01:15 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పాల‌న‌కు 9నెలలు గడుస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనే విషయంపై రాష్ట్రవ్యాప్త చర్చలు మొదలైన నేప‌థ్యంలో రేవంత్‌రెడ్డి పాల‌న‌ ప‌ట్ల ప్రజ‌లు ఏమ‌నుకుంటున్నారు? వాస్తవానికి 9 నెలలు పెద్దలెక్కలోకి రాక‌పోయినా.. గత ప్రభుత్వం చేసిన విధ్వంస పాలన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హయాంలో హైడ్రా కూల్చివేతలు, ప్రజ‌ల సంతృప్తి వంటివి ఇప్పుడు చ‌ర్చకు దారితీశాయి. హైడ్రా కూల్చివేతలు సాక్షాత్ కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, సినీ స్టార్ నాగార్జున ఎన్. కన్వెన్షన్ సెంటర్ ‌లాంటి బలవంతులతోటే మొదలు కావడం మామూలు విషయం కాదు. 

హైదరాబాద్ నగర సహజసిద్ధ ప్రకృతిని, పర్యావరణాన్ని పునరుద్ధరించే ప్రయత్నం రేవంత్ రెడ్డి దృఢ సంకల్పంతో మొదలు పెట్టారు. అలాగే మూసీ సుందరీకరణ కూడా చేపట్టి, విజయం సాధిస్తే తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి వందల ఏళ్లు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక స‌ర్వేలో రేవంత్ పాల‌న‌పై 72 శాతం మంది ప్రజ‌లు సంతృప్తి వ్యక్తం చేసిన‌ట్టు వెల్లడయింది. ఇందుకు ప్రధానంగా ప‌లు సంక్షేమ ప‌థ‌కాలు, రుణమాఫీకి తోడు హైడ్రా కూల్చివేతలతో ప్రజ‌లకు చేరువైన ముఖ్యమంత్రిగా ఆయ‌న భారీ ఆద‌ర‌ణ పొంద‌డం విశేషం.

9.2 శాతం వృద్ధి రేట్‌తో

వాస్తవ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి(జీఎస్‌డీపీ)లో తెలం గాణ దూసుకుపోతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో 9.2 వృద్ధి రేటును సాధించినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర గణాంకాల శాఖ సెప్టెంబర్ 1వ తేదీన వెల్లడించిన వివరాల ఆధారం గా ఈ ఏడాది వృద్ధిరేటులో తెలంగాణ అత్యత్తమ ప్రదర్శనను కనబర్చింది. జాతీయ వృద్ధిరేటు 8.2 ఉండగా.. తెలంగాణ 9.2 వృద్ధి రేటు నమోదు చేయడం గమనార్హం. 2024-25లో ఆరు నెలలు గడిచేసరికి జాతీయ వృద్ధి రేటు కంటే.. తెలంగాణ జీఎస్‌డీపీ ఏకంగా 1.0శాతం ఎక్కువ నమోదు కావడం విశేషం. ఈ ఆరు నెలల కాలంలో వృద్ధిరేటు అమాంతం పెరగడానికి, జీడీపీ వృద్ధిరేటులో కీలకమైన గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ)లో తమిళనాడు వాటా 53శాతం. జీవీఏలో సేవలు, తయారీ, తదితర ఉత్పత్తి రంగాలు ఉంటాయి. జీవీఏలో అతిపెద్ద వాటాదారు అయిన తమిళనాడు సేవల రంగం వాటా 9 శాతం కాగా.. తెలంగాణ 11శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. తయారీ, రియల్ ఎస్టేట్ రంగాలు కూడా ఆశాజనకంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పారిశ్రామిక రంగం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఐటీ, బయోటెక్నాలజీ రంగాలు గణనీయమైన వృద్ధి రేటును సాధించడంలో దోహదపడ్డాయి.

హైడ్రా దూకుడు..

హైడ్రా సీఎం రేవంత్‌ ‌రెడ్డి సొంత ఆలోచన, అందుకే దీనికి అనేక అధికారాలు ఇచ్చి హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా మార్చేందుకు రేవంత్‌ దీనిని తీసుకొచ్చారు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై 'హైడ్రా' ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. దీంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. హైడ్రా కూల్చివేతలపై ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ 'నేను శ్రీకృష్ణుని ప్రబోధాన్ని అనుసరిస్తాను సరస్సుల సమీపంలో నిర్మించిన కొన్ని ఫామ్‌హౌస్‌లు మురుగునీటిని గండిపేట్ వంటి తాగునీటి వనరులలోకి విడుదల చేస్తాయి. ఇవి నగరంలోని కొన్ని ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు అందుకే తమ ప్రభుత్వం వీటిని అణిచివేస్తుందని ఇలా చేయకపోతే ప్రతినిధిగా తాను విఫలం చెందినట్లే గదా అని వేదనతో మాట్లాడారు.

రైతుల రుణమాఫీ

రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని పార్ల‌మెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అయితే ఆర్థిక నిపుణులు కష్టమని చెప్పినను, ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయనీ తెలిసినప్పటికీ. ఇచ్చిన మాటకు కట్టుబడి, రాహుల్‌గాంధీ మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత. రైతులను మభ్యపెట్టకుండా ఏక మొత్తంలో రూ.2లక్షల రుణమాఫీ చేయడం విశేషం.

డ్రగ్స్‌పై నిరంతర నిఘా!

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే డ్రగ్స్ పెనుముప్పు. ఇంతకుముందు డ్రగ్స్‌ను ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రమే విక్రయించేవారు. కానీ పరిస్థితులు మారాయి అవి ప్రతిచోటా అందుబాటులో ఉన్నాయి. స్కూల్ స్థాయి వరకు చేరిపోయిన డ్రగ్స్‌ని నియంత్రణ చేయకపోతే భవిష్యత్తు తరాలు పూర్తిగా నాశనం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడి డ్రగ్స్ కట్టడి కోసం ప్రభుత్వం నార్కోటిక్ బ్యూరోని ఏర్పాటు చేసింది. దీనికి డీజీ స్థాయి అధికారులు నియమించింది. పెద్ద ఎత్తున నిధులతో పాటు సిబ్బందిని కేటాయించింది. మరోవైపు అప్పటికప్పుడు పరీక్షలు చేసి నివేదికలు ఇచ్చే డ్రగ్స్ కిట్లను కూడా నార్కోటికి బ్యూరో అందించింది. మరోవైపు నార్కోటిక్ బ్యూరోకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దీంతోపాటు డ్రగ్స్ అమ్మకం కొనుగోలు దారులపై నిఘా పెట్టేందుకు అవసరమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. గత తొమ్మిది నెలల కాలంలో ఊహిం చనీ రీతిలో నార్కోటిక్ బ్యూరో ఫలితాలు సాధించింది.

ఆహార భద్రత‌పై నజర్!

రాష్ట్రంలో కల్తీ ఫుడ్ పెరిగిపోతున్నది. పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట నూనె, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్.. ఇట్ల ప్రతీది కల్తీ అవుతున్నది. ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టడంలో సర్కార్ విఫలమవుతున్నది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఫుడ్ సేఫ్టీ విషయంలో మన రాష్ట్రం చివర్లో ఉన్నది. ఫుడ్ సేఫ్టీలో 17 పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే 15వ స్థానానికి దిగజారింది. అంటే కల్తీ ఫుడ్ ఎక్కువున్న రాష్ట్రాల జాబితాలో టాప్ -3లో ఉన్నది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇటీవల విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీపై సర్వే చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ. పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా రిపోర్టులు ఇచ్చింది. పెద్ద రాష్ట్రాల జాబితాలో ఒడిశా, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల కంటే తెలంగాణలో ఫుడ్ కల్తీ ఎక్కువగా ఉన్నట్టు రిపోర్టులో తేలింది. మరోవైపు ఫుడ్ క్వాలిటీ చెకింగ్‌లోనూ రాష్ట్రం వెనుకబడిందని వెల్లడైంది. ఆహార భద్రత‌పై ప్రత్యేక దృష్టి పెట్టి, ఆహార భద్రత విషయంలో రాజీపడబోమని ప్రభుత్వం సీరియస్‌గా పని చేస్తోంది.

- డా. బి. కేశవులు నేత. ఎండి,

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం,

85010 61659 

Tags:    

Similar News