నా కథ ‘ఆలీబాబా అనేక దొంగలు’ను తీసుకుంటున్నామని నవీన్ చెప్పినప్పుడు, ‘థాంక్స్’ అంటూ మామూలుగానే స్పందించా. తర్వాత వాళ్లు అడిగిన వివరాలన్నీ మామూలుగానే పంపా. కానీ, కథ-34 ఆవిష్కరణ దగ్గర పడుతుంటే..ఏదో ఉద్వేగం. జ్ఞాపకాల దొంతరలు పొరలుపొరలుగా విచ్చుకుంటున్నాయి. అవును మరి, దానికి ఐదేళ్ల వయసప్పటి నుంచీ పరిచయం. రెండు మూడేళ్లు ప్రూఫ్ రీడింగ్ కూడా చేశాను.
34 ఏళ్లుగా 'కథ' విజయం
అప్పట్లో ఈ కథ వ్యవహారం మామూలుగా వుండేది కాదు. ఈసారి ఎవరి కథలు వున్నాయోయని కొట్టుకు సచ్చిపోయేవాళ్లు. కొమ్ములు తిరిగిన తెలుగు కథకులు ఎంతోమంది తమ కథ అందులో ఉండాలని ఉవ్విళ్లూరేవారు. లేకపోతే ఆగ్రహించేవారు. సంపాదకుల ప్రత్యక్ష, పరోక్షాల్లో తీవ్రస్థాయిలో గొడవలైపోయేవి. ద్వారకా కేంద్రంగా చర్చలు నడిచేవి. శివారెడ్డి గారి పెద్దరికంతో శాంతిం చేవి. ఇవన్నీ కూడా కథ మరింత బలంగా కొనసాగడానికే దోహదపడ్డాయి. కానీ, వీరిని చూసి వాతలు పెట్టుకుని వివిధ తెలుగు ప్రాంతాల నుంచి వెలువడిన ఇదే తరహా సంకలనాలు మఖలో పుట్టి పుబ్బలో అదృశ్యమైపోయాయి. కానీ కథా సాహితి 34 ఏళ్లగా దూసుకుపోతోంది. 204 మంది కథకుల నుంచి 470 కథలు ఈ సంకలనాల్లో చోటు చేసుకున్నాయంటే సంపాదకుల కృషి ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విశ్వవిద్యాలయాలు కూడా ఇంత విస్తారంగా కృషి చేయగలవా? అనేది సందేహాస్పదమే.
కొనసాగుతున్న కథా ప్రయాణం
ఇంకో విశేషం ఏమిటంటే, ఈ 34 ఏళ్లలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మినహా మరెక్కడా పునరావృతం కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికా, ఢిల్లీ, బెంగుళూరుల్లో ఈ తెలుగు ‘కథ’ ఆవిష్కృతమైంది. మూడు పదులకు మించిన తెలుగు ‘కథ’ సంకలనాలను సెట్లు సెట్లుగా దాచుకున్న అజ్ఞాత పాఠకులే వీరి అప్రతిహత ప్రయాణానికి అభిమాన చోదకులు. ఎన్ని అద్భుతమైన కథలో, ఎంత నేర్చుకున్నామో-చెప్పడం అంత సులువు కాదు. ఏదో మిస్ అండర్ స్టాండింగ్ వల్ల ఆ కథల ప్రూఫ్ రీడింగ్ నుంచి విముక్తి పొందినా, నవీన్‌గారి సాన్ని హిత్యం వల్ల ‘కథ’తో ప్రయాణం కొనసాగుతూనే వుంది. కథ ఆవిష్కరణ సభలన్నిటికీ దాదాపుగా హాజరయ్యా. ఈసారి సమ్‌థింగ్ స్పెషల్, అది నా కథ కూడా వుండ టమే. సంపాదకులు పాపినేని శివశంకర్ గారికి, వాసిరెడ్డి నవీన్ గారికి ధన్యవాదాలు.. జై తెలుగు ‘కథ’.
(నేడు సాయంత్రం 6 గంటలకు ఖమ్మం జడ్పీ హాల్‌లో కథ-34వ ఆవిష్కరణ సభ సందర్భంగా)
దేశరాజు
99486 80009