అక్రమ నిర్బంధానికి పరిహారం లేదా?

చెయ్యని నేరానికి 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన వ్యక్తికి అమెరికాలోని చికాగో కోర్టు, 50 మిలియన్ డాలర్ల (రూ.419.96 కోట్ల) నష్టపరిహారం చెల్లించాలని

Update: 2024-09-14 01:15 GMT

చెయ్యని నేరానికి 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన వ్యక్తికి అమెరికాలోని చికాగో కోర్టు, 50 మిలియన్ డాలర్ల (రూ.419.96 కోట్ల) నష్టపరిహారం చెల్లించాలని సంచలన తీర్పు ఇచ్చింది. అమెరికా ఫెడరల్ కోర్టుతో సమానమైన న్యాయ సమీక్షాధికారం కలిగిన మన సుప్రీంకోర్టు కూడా గతంలో కొంతకాలం శిక్ష అనుభవించిన తరువాత కోర్టు విచారణలో నిర్దోషులుగా పేర్కొంటూ కొందరిని విడుదల చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. అయితే అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పును మన సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా ఆదర్శంగా తీసుకొని నిందితుల పట్ల మానవతా దృష్టితో కేసులు సత్వరంగా విచారించాలి. సుదీర్ఘ కాలం జైల్లో మగ్గుతున్న వారికి స్వేచ్ఛ కల్పించాలి.

19 ఏళ్ల వ్యక్తిని హత్యచేశాడన్న అభియోగంపై 'మార్షల్ బ్రౌన్'‌ను 2008లో పోలీసుల అరెస్టు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు... అతడిని దోషిగా నిర్ధారిస్తూ 35ఏళ్ల పాటు జైలుశిక్ష విధించింది. అయితే బ్రౌన్‌తో పోలీసులు బలవంతంగా నేరం ఒప్పించారని... అలాగే కల్పిత సాక్షాలు సృష్టించారని 2018లో అతడి న్యాయవాదులు కోర్టుకు సాక్షాలు సమర్పించారు. దీంతో బ్రౌన్‌పై నమోదైన కేసును కొట్టి వేసిన కోర్టు... అతడిని విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే తనకు జరిగిన అన్యాయంపై బ్రౌన్ షికాగో ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 'తప్పు డు కేసులో బ్రౌన్‌ను అరెస్టు చేసినందుకు 10 మిలియన్ డాలర్లు, 10 ఏళ్ల పాటు జైలు శిక్షతో మగ్గేలా చేసినందుకు 40 మిలియన్ డాలర్లు నష్టపరిహారం అతనికి చెల్లించాలని ఆదేశించింది. ఇలాంటి సంచలనాత్మక తీర్పు ఇచ్చినందుకు షికాగో ఫెడరల్ కోర్టు న్యాయమూర్తులను, అక్కడి న్యాయవాదులను అందరూ అభినందించాలి. తప్పుడు కేసులో ఇరికించినందుకు అక్కడి పోలీసులకు లేదా ఇతర విచారణాధికారులకు డిపార్టుమెంట్ పరంగా ఎలాంటి శిక్షలు విధించారో సమాచారం వెల్లడి కాలేదు.

బతికి బయట పడ్డారంటే గొప్ప!

మన దేశంలో ప్రొఫెసర్ సాయిబాబాను సుమారు పదేళ్లు జైల్లో నిర్భందించారు. ఆయన అండ సెల్‌లో అనేక బాధలు అనుభవించారు. ఆయన సుమారు 80 శాతానికి పైగా వికలాంగుడు. తన నిత్య కాలకృత్యాలు తీర్చుకోవటానికి కూడా కనీసం ఇద్ధరు లేదా ముగ్గురి సహాయం కావాలి. తన వీల్ చైర్ కూడా పట్టని అతి ఇరుకైన అండ సెల్‌లో ఆయన్ని నిర్బంధించారు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒంటరిగా సెల్‌లో నరకయాతన అనుభవించాడు. ఆయనకు కొవిడ్ సమయంలో కూడా బెయిల్ ఇవ్వలేదు. నిత్యం వాడే మందులు సైతం ఇవ్వలేదు. కొడుకు జైలుపాలు అయితే తల్లడిల్లిన ఆయన తల్లి మనాదితో చనిపోయింది. అయితే కన్న తల్లిని చివరిసారి చూపేందుకు కూడా పోలీసులు ఆయనను అనుమతించలేదు. ఈ అక్రమ అరెస్ట్ వల్ల తన ఇంగ్లిష్ ప్రొఫెసర్ ఉద్యోగం ఊడింది. కుటుంబం ఆర్థికంగా చితికి పోయింది. తాను అనుభవించిన జైలు బాధలు, కష్టాలు ఇటీవల మీడియాకు స్వయంగా ఇచ్చిన ఇంటర్వూలో ప్రొఫెసర్ సాయిబాబా చెప్పారు. పదేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో ఆయన నిర్దోషిగా బయట పడ్డారు. అలాగే విప్లవ రచయిత వరవరరావుపై అనేక కేసులు పోలీసులు పెట్టారు. బెయిల్ వస్తే తిరిగి మరోకేసులో ఆయనను ఇరికించి, నిర్బందించడం షరా మాములుగా మారింది.

కోల్పోయిన జీవితం తిరిగొస్తుందా?

ఇలా అక్రమంగా ఇరికించిన ఎంతోమంది విచారణను ఎదుర్కొంటూ జైళ్లలోనే మరణించారు. విచారణ పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది. అంతకాలం వారు జైలులో మగ్గా ల్సిందే. సంవత్సరాల శిక్ష తర్వాత కోర్టులు నిర్దోషులుగా ప్రకటిస్తే.. వారు అనుభవించిన భౌతిక యాతనకు, మనోవేదనకు, కుటుంబం పొందిన మాన, అవమానాలకు, కోల్పోయిన విలువైన స్వేచ్ఛకు జవాబుదారీతనం ఎవరు వహిస్తారు? కొన్నిసార్లు నేరం చేస్తే పడవలసిన శిక్షాకాలం కంటే ఎక్కువ కాలం జైలు నిర్భంధాన్ని ఎదుర్కో వలసి వస్తుంది. అసలు ఏ కేసుల్లో పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో...ఏ కేసులు తమపై పోలీసులు బనాయించారో తెలియని అనేక మంది నిరక్షరాస్యులు, పేద గరిజనులు, దళితులు పడే అగచాట్లు చెప్పలేము. ఎన్నో ఏళ్ల తరువాత నిర్దోషులుగా కోర్టులు తుది తీర్పు వెలువడే నాటికి వారు కోల్పోయిన జీవితం తిరిగిరాదు. ఇప్పటికీ ఎంతోమందిపై విచారణకు రాని లక్షలాది కేసులు వివిధ కోర్టుల్లో పెండింగులో ఉన్నాయి. ఎప్పటికీ ఆ కేసులు పరిష్కారం అవుతాయో ఎవరూ చెప్పలేరు. పోలీసులు, దర్యాప్తు సంస్థలు శాస్త్రీయ పద్ధతుల్లో విచారణ జరపడం లేదు. చట్ట వ్యతిరేకంగా నిందితులను కొట్టి, హింసించి, చార్జిషీట్లపై సంతకాలు తీసుకుని అభియోగాలు మోపు తున్నారు. ఇలా అక్రమంగా ఇరికించిన కేసుల్లో ఒక కోర్టు బెయిల్ ఇస్తే మరో కేసులో బెయిల్‌ను నిరాకరించి నిందితుడిని సుదీర్ఘంగా బంధిస్తున్నారు. ఇలాంటి సంస్కృతికి స్వస్తి చెప్పాలి.

ఈడీ కేసులన్నీ నిరాధారాలేనా?

గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వ లోపాలను విమర్శించినందుకు, అనేక మంది కవులను, కళాకారులను, సంపాదకులను, జర్నలిస్టులను ఈడీ, సీబీఐ, ఐటీ మొదలైన కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడి చేసి, సోదాలు జరిపి అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 2014-2024 మధ్యకాలంలో మనీ లాండరింగ్ చట్టం క్రింద మొత్తం 5,297 కేసులు పెట్టింది. అయితే అందులో సాక్షాధారాలతో రుజువైనవి కేవలం 40 మాత్రమే. అంటే ఈడీ సక్సెస్ రేటు కనీసం 1 శాతం కూడా లేదు. ఈ డేటాను కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్‌కు సమర్పించింది. ఇదే విషయంపై ఈడీ పనితీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది.

అందుకే రాజకీయ ప్రేరణలతో అక్రమ కేసులు పెట్టే పోలీసు అధికారులకు శిక్షలు విధించాలి. పౌర హక్కులు, మానవ హక్కులకు న్యాయస్థానమే రక్షణ కల్పించాలి. విచారణ జరగకుండా కేసులు వాయిదా పడేటట్లు జాప్యం చేసేందుకు పరస్పరం సహకరించుకొనే పోలీసులకు, న్యాయవాదులకు కూడా కోర్టులు శిక్షలు వేయాలి. నిర్దోషులుగా విడుదల అయిన వారికి అమెరికా ఫెడరల్ కోర్టు నష్టపరిహారం ఇప్పించినట్లు మన ఉన్నత న్యాయస్థానాలు కూడా బాధితులకు పెద్ద మొత్తంలో నష్ట పరిహారం ఇప్పించాలి.

డా. కోలాహలం రామ్ కిశోర్

98493 28496 

Tags:    

Similar News