NDA VS I-N-D-I-A: సవాళ్ళతో సవారీ
NDA VS INDIA, Big Challenges Has to Achieve Both Political Alliances
ఇల్లు అలకగానే పండగ కాదు.. అనే సామెత తరహాలో ఇప్పుడు ఎన్డీఏ, ‘ఇండియా’ కూటముల ముందు పెను సవాళ్ళే ఉన్నాయి. పోటాపోటీగా కూటమిలోకి పార్టీలను చేర్చుకున్నాయి. మీకంటే మేమే బలవంతులం అని చెప్పుకునే ప్రయత్నం చేశాయి. సమావేశాలు పెట్టుకుని బలప్రదర్శనలు చేసుకున్నాయి. పార్టీల సంఖ్య పెరగడంతోనే బలపడ్డామని అవి భావించొచ్చు. కానీ అసలు తిప్పలు ఇప్పుడే మొదలుకానున్నాయి. కూటమిలోకి చేరిన ఆ పార్టీలకు టికెట్లు ఇచ్చి సంతృప్తిపర్చడం ఎన్డీఏకు, ‘ఇండియా’కు అతి పెద్ద సమస్య. ఉత్తరాదిన హిందీ బెల్టులో బలపడడం ‘ఇండియా’ కూటమికి అతి పెద్ద సవాలు. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు గెలుచుకోవడం బీజేపీకి శక్తికి మించిన పని.
ఇప్పటివరకూ ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదంతో బీజేపీ దూకుడుగా వ్యవహరించింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో పరేషాన్ అయింది. దక్షిణాదిన పవర్‌లో ఉన్న ఏకైక రాష్ట్రం చేజారిపోయిందనే ఆందోళనలో పడ్డది. కాంగ్రెస్ బలపడుతున్నట్లు గ్రహించింది. ‘బీజేపీ ముక్త్ సౌత్ ఇండియా’గా మారుతుందేమోనని భయం పట్టుకున్నది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ బీజేపీ ఏటికి ఎదురీత తప్పదనే అభిప్రాయానికి వచ్చింది. తెలుగుదేశం, అకాలీదళ్, జేడీయూ లాంటి పార్టీలు దూరమైనా ఇంతకాలం పట్టించుకోలేదు. బేఫికర్‌గానే వ్యవహరించింది. ఎక్కడో తేడా కొడుతుందని భయపడి హడావిడిగా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో మీటింగ్ పెట్టుకోక తప్పలేదు.
పదునెక్కుతున్న వ్యూహాలు
రెండు కూటములూ వరుస మీటింగులతో వ్యూహరచనలో పడ్డాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే టార్గెట్‌గా పెట్టుకున్నాయి. కర్ణాటక విజయానికి కొనసాగింపుగా తెలంగాణ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వస్తాయని ఆ పార్టీ కొండంత ధీమాతో ఉన్నది. అధికారంలో ఉన్నా మధ్యప్రదేశ్‌లో కూడా చేదు అనుభవం తప్పదని బీజేపీ ఉలిక్కిపడుతున్నది. జోడో యాత్ర తర్వాత బలపడుతున్నామని కాంగ్రెస్ ధీమాతో ఉంటే గ్రాఫ్ పడిపోతున్నదేమోనని బీజేపీ ఆందోళనలో పడ్డది. అందుకే లోక్‌సభ ఎన్నికలకు ఇంకా పది నెలల టైమ్ ఉన్నా ఇప్పటి నుంచే స్ట్రాటెజీలకు పదును పెడుతున్నాయి. అందులో భాగమే కూటముల పునర్ వ్యవస్థీకరణ.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో 38 పార్టీలున్నా అందులో లోక్‌సభలో ప్రాతినిధ్యం లేనివే ఎక్కువున్నాయి. అయినా వాటి అవసరం ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేని తీరులో రెండు పార్టీల వ్యవస్థ తరహాలో రెండు కూటముల పరిస్థితి నెలకొన్నది. ఆరేడు పార్టీలు మినహా మిగిలినవన్నీ ఈ రెండు కూటముల కింద మొబిలైజ్ అయ్యాయి. ఇంతకాలం లెక్కలోకే రాని పార్టీలకు ఇప్పుడు ప్రాధాన్యత పెరిగింది. కుల సమీకరణాలు, ఓట్ల చీలిక, ప్రత్యర్థి కూటమిని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా సమావేశాల్లో వ్యూహాలు ఖరారవుతున్నాయి. ఎంత చిన్న పార్టీ అయినా ఇప్పుడు వీఐపీ ట్రీట్‌మెంట్ లభిస్తున్నది. అవసరాలు, అవకాశవాదం, అధికారమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
త్యాగాల పునాదిపై ‘ఇండియా’
యాంటీ-బీజేపీ భావజాలంతో ఉన్న పార్టీలన్నీ ‘ఇండియా’ (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్)గా ఏర్పడ్డాయి. పాట్నాలో జరిగిన సమావేశంలో 16 పార్టీలు పాల్గొంటే మూడు వారాల వ్యవధిలోనే అది 26కు పెరిగింది. ఆ మేరకు కొత్త పార్టీలను ఆకర్షించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ముంబాయిలో జరిగే నెక్స్ట్ మీటింగ్ నాటికి మరిన్ని పార్టీలు వచ్చి చేరుతాయనే కాన్ఫిడెన్స్ పెరిగింది. అవసరమైతే ఒక మెట్టు దిగడానికి కూడా సిద్ధమైంది. అందుకే ప్రధాని రేసులో కాంగ్రెస్ లేదని ఆ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే సంకేతాన్నిచ్చారు. ప్రధానిగా ఎవరుండాలనేది ఎన్నికల తర్వాతే ఖరారవుతుందని చెప్పాల్సి వచ్చింది. ‘ఇండియా’ కూటమికి నాయకత్వం వహించే చైర్‌పర్సన్‌పైనా నిర్ణయాన్ని వాయిదా వేసింది అందుకే.
బీజేపీని ఓడించాలంటే కూటమి స్ట్రాంగ్‌గా ఉండాలని కాంగ్రెస్ రియలైజ్ అయింది. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ ఫార్ములాతో పనిచేయక తప్పడంలేదు. కూటమి చైర్‌పర్సన్ విషయంలో ఏకాభిప్రాయం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. అందరినీ కలుపుకుపోయే నేతకు అప్పగించడానికైనా సిద్ధంగానే ఉన్నది. ప్రధాని పదవినే వద్దనుకున్నప్పుడు కూటమిని లీడ్ చేసే విషయంలో పంతం నెగ్గించుకోవాలని అనుకోవడంలేదు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నది. ఈసారి ‘ఇండియా’ పవర్‌లోకి రావడమే ఏకైక టాస్క్ గా పెట్టుకున్నది. అందుకు అవసరమైన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ సిస్టమ్‌నే ఈసారి కూడా అమలు చేయాలనుకుంటున్నది. రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని టికెట్లు ఇవ్వాలన్న విషయంలోనూ మొండి వైఖరి వద్దనే ఆలోచనతో ఉన్నది.
ఓట్లు.. సీట్లు.. టికెట్లు
కొత్త పార్టీలు వచ్చి చేరుతున్నాయని రెండు కూటములూ సంతోషపడుతున్నా వాటికి టికెట్లు ఇచ్చే విషయం సవాలుగా మారింది. లోక్‌సభలో ప్రాతినిధ్యమే లేని పార్టీలు చాలా ఉన్నాయి. వాటికి టికెట్లు ఇవ్వక తప్పదు. కుల సమీకరణాలు, ప్రత్యర్థి కూటమిలో ఓట్ల చీలిక లాంటి అంశాలే ఇందుకు కారణం. గెలుపే లక్ష్యంగా రెండు కూటములకూ ఇలాంటి సవాళ్ళు ఉన్నాయి. చిన్న పార్టీలే అయినా సామాజికవర్గాల రీత్యా ఓట్లపై ప్రభావం చూపుతాయనుకుంటే తగిన ప్రయారిటీ ఇవ్వడానికి కాంగ్రెస్, బీజేపీ సిద్ధపడుతున్నాయి. ఒక్క సీటు గెల్చే పార్టీలే అయినా వదులుకోవాలని అనుకోవడంలేదు. కూటమిలోకి తీసుకురావడం వరకు సక్సెస్ అయినా టికెట్ల విషయంలో పేచీలు రాకుండా ఆచితూచి వ్యవహరించే ధోరణి రెండు జాతీయ పార్టీలకు అనివార్యంగా మారింది.
ఎన్డీఏ వర్సెస్ ‘ఇండియా’
లోక్‌సభ ఎన్నికలకు పది నెలల ముందే కసరత్తు మొదలైంది. ఎన్డీఏ వర్సెస్ ‘ఇండియా’ పొలిటికల్ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. ఆరేడు పార్టీలు మినహా మిగిలినవన్నీ ఈ రెండు కూటముల్లో చేరిపోయాయి. దాదాపుగా రెండు పార్టీల సిస్టమ్ తరహా రెండు కూటముల మధ్య పోటీ వాతావరణం నెలకొన్నది. ఈ రెండు కూటములూ ఒకదాన్ని మించి మరొకటి బలప్రదర్శన చేసుకున్నాయి. చిన్నా చితకా పార్టీలనూ చేర్చుకోడంలో విజయం సాధించాయి. ఒక కూటమికి ప్రధాని ఫేస్‌గా మోడీ వ్యవహరిస్తున్నారు. మరో కూటమి తరపున పీఎం అభ్యర్థి ఎవరనేది ఎన్నికల తర్వాతే డిసైడ్ కానున్నది. రెండు కూటములూ ప్రత్యర్థులుగా ఏర్పడినా అవి అనేక సవాళ్ళను ఎదుర్కోక తప్పదు. ఇంతకాలం లెక్కలోకే లేని పార్టీలనూ ఇప్పుడు వీఐపీలుగానే చూస్తున్నాయి.
బలమా.. బలహీనతా..
ఇప్పటిదాకా ఎన్డీఏను బీజేపీ లెక్కచేయలేదు. బీజేపీ ఇప్పుడు హడావిడిగా పోలరైజేషన్‌పై ఫోకస్ పెట్టింది. రెండో టర్ములో ఫస్ట్ టైమ్ ఎన్డీఏ మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. దాదాపు పాతికేళ్ళుగా ఉనికిలో ఉన్న ఎన్డీఏ గురించి మోడీ సీరియస్‌గా పట్టించుకోలేదు. సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ స్థాయిలో సీట్లు రావడంతో ధీమాగా ఉన్నారు. తెలుగుదేశం, డీఎంకే, జేడీయూ, జేడీఎస్, శివసేన, అకాలీదళ్ లాంటి అనేక పార్టీలు దూరమవుతున్నా లెక్క చేయలేదు. కానీ కర్ణాటక రిజల్టు తర్వాత అలర్ట్ కావాల్సి వచ్చింది. విపక్షాలన్నీ యాంటీ-బీజేపీ స్టాండ్‌తో ఐక్యమవుతుండడంతో ఎన్డీఏను స్ట్రాంగ్ చేసుకోవడం ఆయనకు అనివార్యంగా మారింది. విపక్ష కూటమికంటే ఎక్కువ పార్టీలను చేర్చుకున్నామని క్రెడిట్ కొట్టేశారు. కానీ ఇది ఎన్డీఏ బలానికి చిహ్నమా.. లేక గ్రాఫ్ పడిపోతున్నందునే చేర్చుకోక తప్పలేదనే సంకేతమా మోడీ బలపడుతున్నట్లా.. లేక బలహీనపడుతున్నట్లా?
మరోవైపు ‘ఇండియా’ కూటమి సంగతి చూద్దాం. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ తరహాలో ఈ కూటమి పార్టీల మధ్య ఈక్వేషన్స్ ఉన్నాయి. బీజేపీ లేదా ఎన్డీఏను ఢీకొట్టడానికి తన శక్తి సరిపోదని కాంగ్రెస్‌కు అర్థమైంది. తొమ్మిదేండ్ల అనుభవమూ దాన్నే రుజువు చేసింది. కేరళలో కాంగ్రెస్, సీపీఎం; పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం; తెలంగాణలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఉప్పు-నిప్పు. కానీ లోక్‌సభ ఎన్నికల దగ్గరకొచ్చేసరికి ఇవన్నీ మిత్రపక్షాలు. పాట్నా మీటింగ్‌లో 16 పార్టీలుగా ఉన్న బలం మూడు వారాల్లోనే 26కు పెంచుకోగలిగింది. ఈ మేరకు ఆ కూటమి సక్సెస్ అయినట్లే. లోకల్‌గా ఎన్ని విభేదాలున్నా యాంటీ-బీజేపీ ఫైట్‌లో ఒకే మాటతో ఫ్రెండ్లీ పార్టీలుగా మారిపోయాయి.
కీలకంగా మారిన రీజినల్ పార్టీలు
‘ఇండియా’ టీమ్‌లో డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ లాంటి కొన్ని రీజినల్ పార్టీలు స్ట్రాంగ్‌గా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్, కేరళ లాంటి చోట్ల సీపీఎం సైతం బలంగానే ఉన్నది. వాటి మాటకు విలువిచ్చి కూటమిలో ఉంచుకోవడం కాంగ్రెస్‌కు అనివార్యం. సీట్ల కేటాయింపు దగ్గర పేచీ పెట్టుకోవాలని కాంగ్రెస్ అనుకోవడం లేదు. కర్ణాటక రిజల్టు వరకూ కాంగ్రెస్‌ను లెక్కచేయని ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఆలోచనను మార్చుకున్నాయి. టికెట్ల కేటాయింపు మొదలు అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టుఫోలియోల పంపకాల వరకూ అనేక సవాళ్ళు ‘ఇండియా’ ముందున్న సవాళ్ళు. వీటిని అధిగమించడం కాంగ్రెస్‌కు కత్తిమీద సాము. యాంటీ-బీజేపీ ఐక్యత అప్పటిదాకా కొనసాగుతుందా లేక ఎన్సీపీ, శివసేన తరహాలో పార్టీలో చీలికలొచ్చి వీక్ అవుతుందా అనే అనుమానాలు లేకపోలేదు.
ఏ కూటమిలో చేరకుండా ఉన్న బీఆర్ఎస్, తెలుగుదేశం, వైఎస్సార్సీపీ, బిజూ జనతాదళ్, బహుజన్ సమాజ్ పార్టీ తదితరాలు ఇప్పటివరకూ బీజేపీకి పరోక్షంగా సహకారం అందిస్తూనే ఉన్నాయి. వారి వ్యక్తిగత అవసరాలు కావచ్చు. అధికారంలో ఉన్నందున కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు కారణం కావచ్చు. ఎన్నికల తర్వాత ఎన్డీఏ, ‘ఇండియా’ టీమ్‌ల మ్యాజిక్ ఫిగర్‌లో తేడా వస్తే ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారనేది కీలకం. ఎందులో చేరడానికైనా తగిన వాతావరణాన్ని కల్పించుకున్నాయి.
ఎన్. విశ్వనాథ్
99714 82403