మానవుని మేధస్సును అత్యున్నత స్థాయికి చేర్చే శాస్త్రమే గణితం. విద్యావంతుడైనా, నిరక్షరాస్యుడైనా గణితాన్ని ఉపయోగించకుండా జీవితంలో ఒక్కరోజైనా గడపలేడు. ఏ వృత్తిలోనైనా గణిత జ్ఞాన వినియోగం ఉంటుంది. అలాంటి గణితం పట్ల ఆసక్తిని ప్రాథమిక స్థాయి నుండే విద్యార్ధులకు అలవాటు చేయాలి. లెక్కల సాధనతో వారిలో తార్కిక సామర్థ్యం మెరుగవుతుంది. విశ్లేషణాత్మక ఆలోచన పెరుగుతుంది. బుద్ధి పదునెక్కుతుంది. శాస్త్రీయ ఆలోచన ధోరణి ఏర్పడి క్రమబద్ధమైన విధానం అలవడుతుంది. స్వచ్ఛత, కచ్చితత్వం, వేగం, సృజనాత్మకత వంటి లక్షణాలు అలవడతాయి.
అనవసర భయాలతో..
ప్రపంచవ్యాప్తంగా ఏ విద్యార్థిని అయినా భయపెట్టే పాఠ్యాంశాలలో గణితందే తొలి స్థానం. ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ కావడానికి, మధ్యలో బడి మానడానికి కారణమయ్యేది గణితమే. లెక్కల భయం విద్యార్థుల్లో ఆందోళన పెంచి వారి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ బెరుకును ఎలా తొలగించాలన్నదే ప్రస్తుత గణిత విద్య ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. గణితం అనాసక్తికరమైన సృజనాత్మకత లేని, సంక్లిష్టమైన, కష్టతరమైన విషయం అని చాలామంది విద్యార్థుల అపోహ. ఉపాధ్యాయులు తరగతి గదిలో గణితం భావనల్ని ఆచరణాత్మక అంశాలతో జోడించి చెప్పడం చాలా అరుదుగా జరుగుతున్నది. భావనల్ని బోధిస్తారు తప్ప ఎలా అన్వయించుకోవాలనే కోణాన్ని వివరించి చెప్పడం లేదు. దీనివల్ల విద్యార్థులు తమ తరగతి గదిలో జరిగే అభ్యసన ప్రక్రియను వాస్తవిక ప్రపంచ పరిస్థితులతో అన్వయించుకోలేక పోతున్నారు. కొందరు ఉపాధ్యాయులు గణిత పాఠ్య పుస్తకాల్లో ఒక ఉదాహరణ ఇచ్చి దాని ఆధారంగా సాధన చేయాల్సిన లెక్కల జాబితాను ఇస్తున్నారు. దీనివల్ల పిల్లలకు ప్రాథమిక భావనలపై సరైన రీతిలో దృష్టి కేంద్రీకృతం కావడం లేదని గణిత మేధావులు అంటున్నారు.
గణిత ఫోబియా పోవాలంటే..
ప్రస్తుత ప్రపంచంలో విజ్ఞాన శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో గణితం కీలకంగా మారిన క్రమంలో ప్రభుత్వం దేశీయంగా నాణ్యమైన విద్యను అందించేందుకు కొన్ని నిర్దిష్ట చర్యలతో ముందుకు రావాలి. రామానుజన్ పుట్టిన మనదేశంలో గణితం పట్ల మరింత ఆసక్తి పెరిగేలా, భయం పోయేలా అవసరమైన వాతావరణాన్ని నెలకొల్పాలి. దేశంలో గణిత ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారు ఇది రెట్టింపు కావాల్సి ఉంది. అందుకు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో వీరి నియామకాలు చేపట్టాలి. గణిత ఉపాధ్యాయులకు ప్రపంచ ప్రమాణాలకు తగినట్లుగా శిక్షణ అవసరం. వర్తమాన అవసరాలకు అనుగుణంగా గణిత పాఠ్య ప్రణాళికలో మార్పులు అవసరం. ప్రాథమిక స్థాయిలోని గణిత ఉపాధ్యాయులతో పాటు మానసిక శాస్త్రవేత్తలు కౌన్సిలర్లను నియమించాలి. గణిత విద్యలో సాంకేతిక పరిజ్ఞానానికి చోటు కల్పిస్తూ యాప్‌ల సాయంతో 3డి నమూనాలతో గణిత సూత్రాలను అర్థమయ్యేలా బోధించవచ్చు. పజిల్స్, అబాకస్, సంఖ్య బోర్డులు, పూసల చట్టం ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్, ఈ-బుక్స్ బ్లాగ్స్ వంటి వనరులు ఉపయోగించుకోవాలి. గణిత ప్రయోగశాలలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల్లో దృశ్యాత్మక అవగాహన మెరుగుపడి ఆచరణాత్మక జ్ఞానం పెరుగుతుంది.
(నేడు జాతీయ గణిత దినోత్సవం/ శ్రీనివాస రామానుజన్ జన్మదినం)
అంకం నరేష్
63016 50324