భారతదేశంలో రాజకీయాలు ఇప్పుడు చాలా పిరం అయిపోయాయి. పైసలున్నోనికే పార్టీ టిక్కెట్లు ఇవ్వడం మొదలై 35 ఏండ్లు దాటింది. ఇక ఇప్పుడు వారి వారసులు 192 మంది ఎంపీలుగా ఉన్నారు. అయ్యల పేరు మాత్రమే వీరి ఎలిజిబిలిటీ అంటే అతిశయోక్తి కాదు. ఇది 2000 సంవత్సరం నుంచి పెరిగి 2014 వచ్చేసరికి పరాకాష్టకు ఎక్కింది, బ్యూరోక్రాట్లు కూడా చాలామంది ప్రజా సేవ కన్నా అధికారంలో ఉండే పాలకుల సేవలో జీ హుజుర్ అంటూ నిమగ్నం అయిపోవడం కూడ ఇదే జంక్చర్‌లో ఎక్కువ అయిపోయింది. ప్రజలకు కూడా వీరి మీద నమ్మకాలు తగ్గుకుంటూ వచ్చాయి. దీనితో రాజకీయం చాలా కాస్ట్‌లీ అయిపోయింది.
పేరు ప్రతిష్టలు సంపాదించి..
దేశంలోని పార్లమెంట్, రాజ్యసభలో సభ్యులుగా ఉన్న 215 మంది దాకా కార్పొరేట్లు ఉన్నారు. తమ వ్యాపారాలు, ఆస్తులు కాపాడుకునే లక్ష్యంతోనే వీరంతా ప్రజాప్రతినిధుల అవతారం ఎత్తిన వారు ఉన్నారు. వీరందరి ఒక్కొక్కరి ఆస్తులు 100 కోట్ల నుంచి 2000 కోట్ల దాకా ఉంటాయి. 22 మంది రాజ్యసభ సభ్యులు, 18 మంది ఎంపీలు భారీగా వందల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నవాళ్లు ఉన్నారు. మైనింగ్‌తో సంబంధం ఉన్నవారు 22 మంది ఉండగా, ఎగుమతి, దిగుమతి వ్యాపారం ఉన్నవాళ్ళు 17 మంది ఉన్నారు. పది మంది ఎంపీలు అయితే టాప్ 10 కార్పొరేట్లుగా ఉన్నారు. సంపాదించుడు, జమా చేసుడు విధిగా వ్యాపారాలు చేసేవారు ఉన్నారు. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల ఎంపీలు, రాజ్యసభ సభ్యుల మధ్యవర్తిత్వాలు, భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కమిషన్లు, వ్యాపార లావాదేవిల్లో జోక్యం, లిక్కర్ దందాలకు అయితే కొదువ లేదు. పాలసీలు ఉంటాయి, కాని ఇలాంటి వారి దందాల కోసం అవి మ్యూట్‌లో ఉంటాయి.
దేశంలోని ఫలానా రాష్ట్రంలో ఇలాంటి దందాలు ఉండవు అనేది లేదు. మన రాజకీయాల్లో ఉత్తములకే గతి లేదు, పురుషోత్తముల కోసం వెతకడం పీడకలే అవుతుంది. భారతదేశం అత్యంత లంచగొండి రాజకీయ నేతలున్న దేశంగా కూడా ప్రసిద్ధికి ఎక్కింది. పలువురు జైలుపాలు అయి శిక్షలు పడినవారు ఉన్నారు. కొందరు బెయిల్ మీద ఉండగా, కొందరు ఇంకా జైల్లోనే ఉన్నారు. రాష్ట్ర మంత్రుల ఇండ్లలో కోట్ల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. అవినీతి అక్రమాల దందాలు బయటకు రాకుండా మీడియా పర్సన్స్‌తోనూ కాంప్రమైజ్ లు జరుగుతుంటాయి, ఇలాంటి వారు ప్రజాసేవ పేరిట రాజకీయాల్లోకి వస్తారు, ఆయా పార్టీల టిక్కెట్లు సంపాదిస్తారు, ఆ తర్వాత ఎన్నికల్లో గెలవడానికి డబ్బు ఖర్చు చేస్తారు, సేవ పేరిట కొన్ని చిన్నచిన్న సహాయాలు చేసి, ట్రస్ట్‌లు పెట్టుకుని ఆ పేరు మీద ప్రతిష్టలు సంపాదించుకుని ఎంపీలు అయి కూర్చుంటారు.
అదే వారి లక్ష్యం
నిజానికి రాజ్యసభ అంటేనే మేధావుల సభ, పెద్దల సభ కానీ అక్కడ మనకు పిడికెడు మంది కూడా మేధావులు కనిపించరు. అంతా బాగా డబ్బున్న కార్పొరేట్ స్థాయి పెద్దలే దర్శనమిస్తారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం ఇలాగే ఉంది. బినామీల పేరిట ఆస్తులు ఎంపీలకు, మంత్రులకు సంబంధించి ఎక్కువ కనిపిస్తాయి. ఇది ఒక్క పార్టీ అని కాదు, అన్ని పార్టీలలోనూ ఇదే పరిస్థితి ఉంది. అధికార బీజేపీలో కాస్త ఎక్కువ మంది, మిగతా పార్టీలలో కాస్త తక్కువ ఉంటారు. ఇలాంటి వారితో మన దేశం నడుస్తుంది. ఇలాంటి వారు సగం కన్నా ఎక్కువ మంది మన ప్రజా ప్రతినిధులు, మంత్రులు, పాలకులు, నిరుద్యోగం ,అధిక ధరలు, అసమానతలు, అత్యాచారాలు, హత్యలు, అమాయకుల మీద జులుంలు, దాష్టికాలు, ఆకలి, ప్రభుత్వ రంగాల అమ్మకం, ఉద్యోగుల ఉద్యోగాలు ఊడి వారు పడుతున్న ఇబ్బందులు వారికి పట్టవు, ఫక్తు ఎలక్షన్లు, అందులో గెలవడానికి నానా యాగీ చేయడం అధికారాన్ని నిలబెట్టుకోవడం, ఉన్న అధికారాన్ని కాపాడుకోవడం మాత్రమే వారి లక్ష్యంగా పేర్కొనాలి.
దేశ సంపదను కొల్లగొడుతూ, ప్రజలు తినే కంచంను గుంజుకుని, ఎంగిలి మెతుకులు వేస్తూ ఇదే సంక్షేమం అని అంటున్న పాలకులకు, వారి తాబేదార్లకు బ్యాలెట్ ద్వారా అవకాశం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలని బుద్ధి జీవులు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుత వ్యవస్థలో పురుషోత్తములు ఎలాగూ లేరు, భూతద్దం తీసుకుని వెతికినా కనిపించరు. కనీసం ఉత్తములను అయినా, అందులో కొంత బెటర్‌ను ఎన్నుకునే ప్రయత్నం చేద్దాం.
ఎండి.మునీర్,
సీనియర్ జర్నలిస్ట్
9951865223
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672