మిషన్ ప్లాంటేషన్ లో పాల్గొని ప్రకృతిని కాపాడదామా!
పురాతన కాలం నుంచీ ప్రకృతిని ప్రేమించే, పూజించే సంస్కృతి ఉన్న దేశం మనది. 'కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి చెక్కితే అమ్మరా' అన్నారు అందెశ్రీ.
పురాతన కాలం నుంచీ ప్రకృతిని ప్రేమించే, పూజించే సంస్కృతి ఉన్న దేశం మనది. 'కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి చెక్కితే అమ్మరా' అన్నారు అందెశ్రీ. ప్రతి ఊరిలో వేప, రావి, మర్రి, తులసి చెట్లు తప్పక ఉంటాయి. మానవ మనుగడ కోసం, సర్వ జీవుల సుఖ జీవనం కోసం వృక్ష సంపదను పరిరక్షించాలని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. 'వృక్షో రక్షతి రక్షిత:' అని భారతీయ తత్వం బోధిస్తుంది. పండ్ల చెట్లను పెంచడం వలన అవి మనుషులకే కాకుండా పక్షులు, జంతువులకు కూడా ఆహారంగా ఉపయోగపడి జీవ వైవిధ్యం దెబ్బతినకుండా ఉంటుంది.
ప్రస్తుతం జనాభా పెరుగుదల, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, వాహనాల పెరుగుదల, అడవుల నరికివేత, వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి రసాయనాల వాడకం వలన భూమి, జలం, వాయువు కాలుష్యంతో నిండిపోతున్నాయి. దీంతో ప్రకృతి వైపరీత్యాలు, భూతాపం పెరిగి జీవరాశులు అంతరించిపోతున్నాయి. జీవవైవిద్యం దెబ్బతింటున్నది. ప్రపంచం అనేక సమస్యలతో సతమతమయ్యే ప్రమాదం ఉంది. 'ఏకాత్మ మానవ దర్శనం' తత్వాన్ని ప్రభోదించిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రకృతిని ఆర్థిక అవసరాల కోసం నాశనం చేయకూడదని కోరారు. మనకు ప్రకృతిని నాశనం చేసే హక్కు లేదు. జీవరాశులపై దయతో మెలగాలి.
అందులో భాగమవుదాం
ఏబీవీపీ విశాల దృక్పథంతో ఏర్పాటు చేసిన 'స్టూడెంట్ ఫర్ డెవలప్‌మెంట్' (SFD) ప్రకృతిపై ప్రేమను పెంచేందుకు కృషి చేస్తున్నది. 'జల్, జంగల్, జాన్వర్, జన్, జమీన్'తో మమేకం అయ్యేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక రుగ్మతలను ప్రత్యక్షంగా చూసే అవకాశం, వాటి మీద అవగాహనను కలిగిస్తున్నది. పరిష్కార మార్గాలు చూపుతున్నది. రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికులు, గల్ఫ్ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నది. ఈ కోవలోనే ప్రకృతి పరిరక్షణ కోసం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా 'వృక్ష మిత్ర అభియాన్' ద్వారా దేశవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని నిర్ణయించింది. ప్రతి విద్యార్థి https://sfdindia.org/mission-plantation-register-form లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఒక్కొక్కరు పది మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలి. వారిని 'వృక్షమిత్ర'గా పిలుస్తారు. ఒక చెట్టు యేటా 120 కేజీల ఆక్సిజన్ అందిస్తుంది. దీంతో కాలుష్యానికి కారణమవుతున్న అనేక సమస్యలను పారదోలవచ్చు. ప్రకృతి ప్రేమికులుగా చెప్పుకునే సెలబ్రెటీలు సైతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి విద్యార్థి 'వృక్షమిత్ర'గా మారితే ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపినవారవుతారు. విద్యార్థులమందరం ఈ మహా యజ్ఞంలో భాగస్వాములమవుదాం. పర్యావరణ సమతుల్యతను, జీవవైవిధ్యాన్ని కాపాడుకుందాం.
శ్రీశైలం వీరమల్ల
ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు
ఓయూ, రీసెర్చ్ స్కాలర్
9912342434