నాయకత్వ లోపమే వారికి శాపం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 2014 ఆగస్టులో నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ లెక్కల ప్రకారం బీసీలలోని అన్న
తెలంగాణ రాష్ట్రంలోని రెండు ప్రధాన ముదిరాజ్ కులసంఘాలు కేసులో భాగస్వాములు కావడమే ఘనకార్యంగా వ్యవహరిస్తుండగా, ఈ రెండు సంఘాలను ఎండగట్టడం, ఆడిపోనుకోవడమే తమ ప్రధాన ఎజెండాగా ముదిరాజ్ కులం పేరుమీద ఉనికిలోకి వచ్చిన ఇతర సంఘాలు 'ఆత్మస్తుతి-పరనింద' విధానాలను అనుసరించాయి. ఈ నేపథ్యంలో ముదిరాజుల రిజర్వేషన్ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్మాయ మార్గాలను అన్వేషించడం, వాటిని సాధించుకునే దిశలో ఆచరణాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడం 'సమిష్టి ఆలోచన-ఉమ్మడి కార్యాచరణ' పద్ధతిలో ఆ ప్రణాళికలను అమలుపరచగలిగే దీక్షాదక్షతలను కలిగి ఉన్న నాయకత్వాన్ని నిర్మించుకోవడమే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముదిరాజ్ ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక మార్గం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 2014 ఆగస్టులో నిర్వహించిన 'సమగ్ర కుటుంబ సర్వే' లెక్కల ప్రకారం బీసీలలోని అన్ని కులాలకంటే అత్యధిక జనాభా సంఖ్య కలిగి ఉన్న ముదిరాజ్ సామాజికవర్గం ప్రజలే అనేక రకాల నమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. తరతరాలుగా అనుభవిస్తున్న పేదరికంతోపాటుగా, పటిష్ట నాయకత్వం లేకపోవడం, ఎదిగిన నాయకత్వాలు స్వార్థ చింతనతో వ్యక్తి కేంద్రంగా పనిచేయడం, ముదిరాజుల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్యపూరిత వైఖరి ఫలితంగా వీరు మిగిలిన సామాజికవర్గాలతో సమాంతరంగా ఎదగలేకపోతున్నారు.
రాజ్యాంగంలో హామీ ఇచ్చిన పద్ధతిలో రిజర్వేషన్ సౌకర్యాన్ని అనుభవించడంలోనూ ముదిరాజులకు అందవలసిన భాగస్వామ్యం దక్కడం లేదనే ధృఢమైన అభిప్రాయం స్థిరపడిపోతున్నది. తాజాగా అక్టోబర్ 11వ తేదీన ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ముదిరాజులను బీసీ-డి నుండి బీసీ-ఎ గ్రూపులోకి మార్చే విషయంలో వెలువరించిన తుది తీర్పుతో ముదిరాజులు ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక రంగాలతోపాటు రాజ్యాంగ హక్కులను అందుకోవడంలోనూ పూర్తి నిర్లక్ష్యానికి గురవుతున్నారనే భావన మరింతగా బలపడుతున్నది.
నాటి నుంచి నేటి దాకా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసి, వారికి రాజ్యాంగబద్ధంగా అందించవలసిన రిజర్వేషన్ సౌకర్యానికి నంబంధించిన ప్రాతిపదికను రూపొందించడానికి 1968లో విశ్రాంత ఐఏఎస్ అధికారి అనంతరామన్ చైర్మెన్‌గా ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ వివిధ సామాజికవర్గాల నుంచి వివరాలను సేకరించి 93 కులాలకు సంబంధించిన బీసీలను ఎ, బి, సి, డి గ్రూపులుగా వర్గీకరించింది. విముక్త జాతుల కులాలను బీసీ-ఎ, వృత్తి కులాలను బీసీ-బి, దళిత క్రిస్టియన్లను బీసీ-సి, ఇతర కులాలను బీసీ-డి గ్రూపులుగా స్థిరీకరించింది. అనంతరామన్ కమిషన్ 1970లో సమర్పించిన తన నివేదికలో ముదిరాజులను 'విముక్తజాతులు' గా గుర్తించినప్పటికీ, రిజర్వేషన్ పరంగా ఇతర కులాల జాబితాలో చేర్చి బీసీ-డి గ్రూపులో పొందుపరిచింది.
ఈ పారపాటును సవరిస్తూ 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముదిరాజులను బీసీ-డి నుండి బీసీ- ఎ గ్రూపులోకి మారుస్తూ 'జీఓ నంబర్ 15-తేదీ19.02.2009'ని వెలువరించారు. బీసీ-ఎ గ్రూపులోని కొన్ని కులాల నాయకులు సవాల్ చేయడంతో హైకోర్టు ఆ జీఓను కొట్టివేసింది. 2009 ఏప్రిల్‌లో అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికలకు రెండునెలల ముందు ప్రభుత్వాన్ని ఒప్పించగలిగిన ముదిరాజ్ కుల సంఘాల నాయకులు, ఎన్నికల అనంతరం హైకోర్టులో ఇదే అంశంపై తలెత్తిన వివాదం విషయంలో మాత్రం ఉదాసీనంగా ఉండిపోయారు. ఎన్నికలకు ముందు ఎంతో ఉదారంగా ముదిరాజులకు మేలు చేసే సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నట్లు వ్యవహరించిన నాయకులు, అనంతరం హైకోర్టు తీర్పు ద్వారా ముదిరాజ్ జాతికి జరుగుతున్నల అన్యాయాన్ని నిలువరించలేకపోయారు.
Also read: దేశ మూలవాసులు ఎవరు?నేడు వారి పరిస్థితి ఏంటి?
దీనికి జవాబు చెబుతారా?
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 2010లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మూడు నెలలలో సమగ్ర నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు 28.10.2010న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఎ గ్రూపులోకి మార్చుతూ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసిన సందర్భంలోనూ, సుప్రీంకోర్టు నివేదిక అడిగిన సమయంలోనూ ముఖ్యమంత్రిగా డా. వైఎస్ రాజశేఖరరెడ్డే ఉన్నారు.
ఆశ్చర్యకర విషయమేమిటంటే వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలంలోనే జస్టిస్ ధవళ నుబహ్మణ్యం బీసీ కమిషన్ చైర్మెన్‌గా (2004-2011) వ్యవహరించారు. 2009 ఎన్నికలకు ముందు ముదిరాజులకు అనుకూలంగా నివేదిక సమర్పించిన ఇదే కమిషన్ హైకోర్టు కేసు సందర్భంలోనూ, సుప్రీంకోర్టు నివేదిక అడిగిన సందర్భంలోనూ ఎందుకు సానుకూలంగా స్పందించలేదనేది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ విషయంలో ముదిరాజ్ సంఘాలకు తిరుగులేని నాయకులమని చెప్పుకుంటున్నవాళ్లే జవాబు చెప్పాలి.
ఆయన కూడా మౌనంగానే
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 2010 డిసెంబర్ నాటికి ఇవ్వాల్సిన బీసీ కమిషన్ నివేదిక పన్నెండేళ్లు గడిచినా అతీగతీ లేదు. ఈ పన్నెండేళ్ళ కాలంలో ముదిరాజ్ ప్రజలు విద్యా, ఉద్యోగ రంగాలలో తీవ్ర నష్టాన్ని చవిచూసారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా, ముదిరాజ్ సంఘాల నాయకులు కూడా బాధ్యత వహించాలి. సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వడంలో జరిగిన జాప్యానికి 2010 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని అధికార వర్గాలు సాకుగా చూపి తమ రాజ్యాంగ బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నాలకు పూనుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు దఫాలుగా (2014, 2018-19) జరిగిన ఎన్నికల సందర్భంగా ముదిరాజుల రిజర్వేషన్ అంశాన్ని ప్రధాన చర్చనీయాంశంగా మార్చడంలో కుల సంఘాలు దారుణంగా విఫలమయ్యాయి. సుప్రీంకోర్టు కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని, బీసీ కమిషన్‌ను భాగస్వాములను చేయడంలో డాక్టర్ బండా ప్రకాశ్ నాయకత్వంలోని 'తెలంగాణ ముదిరాజ్ మహాసభ' కొంత చొరవను ప్రదర్శించి ఫలితం సాధించింది.
కుల సంఘాలు దాగుడు మూతలు ఆడుతూ అంటి మట్టని ధోరణితోనే వ్యవహరించాయి. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఒకే ఒక సందర్భంలో ముదిరాజ్ కుల అస్తిత్వాన్ని బహిరంగంగా నెత్తికెత్తుకున్న ఈటల రాజేందర్ తన పద్దెనమిది సంవత్సరాల అధికార రాజకీయ ప్రయాణంలో ఎన్నడూ ముదిరాజుల సమస్యల పరిష్కారానికి యత్నించిన ఉదంతాలు పెద్దగా లేవనే చెప్పాలి. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఈటల ప్రస్తావించిన అనేక అంశాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిష్కరించే ప్రయత్నం చేసిన విషయం బహిరంగ వాస్తవమే! ముదిరాజుల రిజర్వేషన్ నమస్యను పరిష్కరించాలనే డిమాండ్ ఈటల రాజేందర్ నోటి నుంచి వచ్చి ఉంటే ఈపాటికే పరిష్కారం అయి ఉండేదని భావించడంలో తప్పులేదనుకుంటాను.
ఇక మిగిలింది అదే
తెలంగాణ ప్రభుత్వం, బీసీ కమిషన్‌తోపాటుగా డా. బండా ప్రకాశ్ బాగస్వాములైన తర్వాత 2018 డిసెంబర్ నాటికి బీసీ కమిషన్ నుండి నివేదిక సమర్పించాలంటూ సుప్రీంకోర్టు ఆఖరి అవకాశం కల్పించింది. తెలంగాణ బీసీ కమిషన్ ఈ విషయంలో కనీసం స్పందించలేదు. 50 నెలల కాలం వృథా అయినప్పటికీ, సుప్రీంకోర్టులో ముదిరాజుల పక్షాన వాదిన్తున్న కులసంఘాలుగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ, బీసీ కమిషన్‌గానీ ఈ విషయంలో ఎలాంటి ప్రయత్నాలకు పూనుకున్న దాఖలాలు లేవు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించాయనే కీలక అంశం కూడా కనీసంగా ముదిరాజ్ కులసంఘాల సోయిలోకి రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలోని రెండు ప్రధాన ముదిరాజ్ కులసంఘాలు కేసులో భాగస్వాములు కావడమే ఘనకార్యంగా వ్యవహరిస్తుండగా, ఈ రెండు సంఘాలను ఎండగట్టడం, ఆడిపోనుకోవడమే తమ ప్రధాన ఎజెండాగా ముదిరాజ్ కులం పేరుమీద ఉనికిలోకి వచ్చిన ఇతర సంఘాలు 'ఆత్మస్తుతి-పరనింద' విధానాలను అనుసరించాయి. ఈ నేపథ్యంలో ముదిరాజుల రిజర్వేషన్ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్మాయ మార్గాలను అన్వేషించడం, వాటిని సాధించుకునే దిశలో ఆచరణాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడం 'సమిష్టి ఆలోచన-ఉమ్మడి కార్యాచరణ' పద్ధతిలో ఆ ప్రణాళికలను అమలుపరచగలిగే దీక్షాదక్షతలను కలిగి ఉన్న నాయకత్వాన్ని నిర్మించుకోవడమే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముదిరాజ్ ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక మార్గం.
పిట్టల రవీందర్
ముదిరాజ్ అధ్యయన వేదిక వ్యవస్థాపకులు
99630 62266