జమిలి ఎన్నికలు కాదు... ఎన్నికల సంస్కరణలే ముఖ్యం!
దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడమే సర్వరోగ నివారిణి ‘జిందా తిలిస్మాత్ ’అంటుంది కేంద్ర ప్రభుత్వం. కానీ లోక్‌సభకు,
దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడమే సర్వరోగ నివారిణి ‘జిందా తిలిస్మాత్ ’అంటుంది కేంద్ర ప్రభుత్వం. కానీ లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాధనం ఖర్చు తగ్గుతుందని, అభివృద్ధిపై దృష్టి సారించవచ్చని, శాంతిభద్రతల సమస్యలు ఉండవని కేంద్ర ప్రభుత్వ వాదన. కానీ జమిలి ఎన్నికలు జరిగినప్పటికి లోక్‌సభ, శాసనసభలు ముందే రద్దు కావనే గ్యారంటీ ఏమిటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడితే ఏదైనా సాధ్యమే అంటున్నారు. ప్రస్తుతం దేశంలో జమిలి ఎన్నికలు ముఖ్యం కాదు. కఠినాతి, కఠినమైన ఎన్నికల సంస్కరణలు తక్షణావసరం.
ప్రస్తుతం దేశంలో జమిలి ఎన్నికలు ముఖ్యం కాదు. కఠినమైన ఎన్నికల సంస్కరణలు ముఖ్యం. 1990లో గోస్వామి కమిటీ నుంచి జస్టిస్ జె.ఎస్ వర్మ సారథ్యంలో ఏర్పాటు అయిన సంఘాల వరకు ఎన్నికల సంస్కరణలు అత్యావశ్యమని తేల్చి చెప్పాయి.. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఎన్ని కల వ్యవస్థ భ్రష్టు పట్టింది. దేశంలో ముందు ఎన్నికల వ్యవ స్థకు పట్టిన జాడ్యాలను పారదోలాలి అంటే ఎన్నికల సంస్కరణలు ఒక్కటే మార్గం. ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో పాలక పక్షం ఇష్టారాజ్యానికి అవకాశం ఉండకూడదన్నది ఎంత సహేతుకమో.. పదే పదే ఆ ప్రక్రియ దుర్వినియోగమవుతున్న తీరే ధృవీకరిస్తోంది. ఈసీల నియామక అంశం వి వాదగ్రస్తం కాకుండా ప్రత్యేక యంత్రాంగం కొలువు తీరా లన్న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అభిలాష నేటికీ నెరవేరలేదు. అసలు ఎన్నికల కమిషనర్ల నియామకమే లోపభూయిష్టమని పలువురు మాజీ ఎన్నికల కమిషనర్లు కూడా వ్యాఖ్యానించారు.
ఎన్నికల నిర్వహణలో ఇంత గోప్యతా?
గతంలో నియామక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉండేవారు. కానీ ఆ మధ్య జరిపిన చట్ట సవరణ ప్రకారం ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిని సభ్యుడిగా నియమించారు. దీంతో ఎన్నికల కమిషనర్ల నియామకం విషయంలో ప్రభుత్వం మాటే చెల్లుబాటు అవుతుంది. ఇక కమిటీలో ప్రతిపక్ష నేత అభిప్రాయానికి విలువేముంటుంది? ఒక పక్కన ఎన్నికల నిర్వహణ విధానంలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని, అనుమానాలకు తావులేని విధంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తుంటే, వాటిని తుంగతోకి తొక్కుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ గోప్యతకే ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల ప్రక్రియను మరింత రహస్యంగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ప్రజాస్వామిక విలువలను వమ్ము చేయడమే గాక రాజ్యాంగ వ్యవస్థల స్ఫూర్తిని కూడా దెబ్బతీయడమే.ఎన్నికల నిర్వహణతో పాటు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు (సీసీటీవీ కెమెరా ఫుటేజీ, వెబ్‌కాస్టింగ్ ఫుటేజీ లాంటివి), వీడియో రికార్డింగ్‌లను సామాన్య ప్రజలు తనిఖీ చేసేందుకు వీల్లేకుండా ఎన్నికల నిబంధనల్లో సవరణలు చేసింది. అధికారపక్షం కుట్రలు బయటకు రాకుండా చేసేందుకు ఈ నిషేధం విధించింది. తద్వారా ఈసీ తన స్వతంత్రతను కోల్పోనున్నది.
ఫిరాయిస్తే సభ్యత్వం రద్దు చేస్తేనే...
నిఘా వ్యవస్థలు ఎంతగా పనిచేస్తున్నా ఎన్నికల్లో డబ్బులు పంపకం కొనసాగుతూనే వుంది. ఎంతైనా ఖర్చుపెట్టి ఎన్నికైతే చాలు అధికార పార్టీలోకి ఫిరాయించి డబ్బు సంపాదించవచ్చు అనే ధోరణి వికృత రూపం దాల్చింది. దీనిని అడ్డుకోవాలంటే ఎంపీ, అయినా ఎమ్మెల్యే అయినా పార్టీ మారిన వెంటనే వారి సభ్యత్వం, సభాపతి సహా ఎవరి ప్రమేయం లేకుండా తక్షణం సభ్యత్వం రద్దయి పోయేలా చట్టం తేవాలి. పార్టీ ఫిరాయింపులను అణచివేసేందుకు ఎన్నికల వ్యవస్థ మరింత జవాబుదారీగా ఉండేందుకు అత్యవసర ప్రాతిపదికన ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సి వుంది. ప్రజాధనం బాహాటంగా దోచుకున్నవారే ఎన్నికల్లో ఇష్టానుసారం డబ్బు వెదజల్లి అందలాలూ ఎక్కుతున్నారు.
సమూల ప్రక్షాళన తప్పనిసరి!
భారతదేశ ఎన్నికల సంఘానికి ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. దాని పనితీరును ప్రపంచ దేశాలు అనేక సందర్భాల్లో శ్లాఘించాయి. ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషించే ఎన్నికల సంఘం డూ,డూ బసవన్నలా మారిన పరిస్థితుల్లో రాజ్యాంగ నిబంధనలు కాలరాసేందుకు వీలు లేకుండా ఎన్నికల సంస్కరణలు అమలు చేసి ఎన్నికల వ్యవస్థను పటిష్టం చేస్తే తప్ప ఈ దుస్థితి మారదు. ఇందుకు సమగ్ర ఎన్నికల సంస్కరణలే రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు మార్గం కాగలవు. రాజ్యాంగంలోని 324 అధికరణ ద్వారా వచ్చే విస్తృత అధికారాలతో ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు తీసుకోనే విధంగా ఎన్నికల వ్యవస్థని సమూలంగా ప్రక్షాళించాలి. స్వేచ్చగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే బలమైన అధికారం వున్న ఎన్నికల కమిషన్ నేడు కీలు గుర్రంగా మారి అధికారంలో వున్న పార్టీలకు అడుగులకు మడుగులు లోత్తుతూ రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని తాకట్టు పెడున్నది. ఇక అధికారం ఉన్నవారి ఎదుట ధైర్యంగా నిలబడే వారిని ఎన్నికల కమిషనర్లుగా నియమించాలని సర్వోన్నత న్యాయస్థానం కూడా ఎప్పుడో స్పష్టం చేసింది. కఠినమైన ఎన్నికల సంస్కరణలు అమలు చేసి ప్రజల్లో భారతీయ ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి. అనేక ప్రజాస్వామ్య దేశాలు రాజ్యాంగ వ్యవస్థలు బలోపేతమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు పటిష్ట సంస్కరణలు చేపడుతున్నాయి. కాబట్టి రాజకీయాల్లో విలువలు పెంచే విధంగా మన దేశంలో కూడా ఎన్నికల సంస్కరణల అమలుకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి.
- నీరుకొండ ప్రసాద్
98496 25610