విజ్ఞానం అందాల్సిన చోట కుల వివక్షా!?
Is there caste discrimination in Telangana University?
విశ్వవిద్యాలయాలు... ఉన్నతమైన జ్ఞానాన్ని పంచి... భవిష్యత్తు తరాలకు గొప్ప సేవ చేసే వ్యక్తులను వివిధ రంగాల్లో నిష్ణాతులుగా మలిచేవి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రోజురోజుకు కొందరి తీరుతో విశ్వవిద్యాలయాల విలువ దిగజారిపోతోంది. ఎన్నో ఆశలతో విశ్వ విద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చిన విద్యార్థులను పట్టించుకోకపోగా, విశ్వవిద్యాలయం అభివృద్ధి పేరిట నిధులు మంజూరు చేసుకోని యధేచ్ఛగా దోపిడీకి పాల్పడడం నిత్యకృత్యంగా మారిపోయింది.
నిజామాబాద్ జిల్లా పరిధిలోని డిచ్‌పల్లి వద్ద గల తెలంగాణ యూనివర్సిటీ రోజు రోజుకు విలువను కోల్పోతోంది. గత కొన్ని రోజులుగా ఈ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నప్పటికీ అటు రాజకీయ నాయకులు, ఇటు ఉన్నత విద్యాశాఖ నామమాత్రపు చర్యల వల్ల యూనివర్సిటీ నిర్లక్ష్యానికి గురి కావడమే కాకుండా, అక్కడి విద్యార్థుల పరిస్థితి అయోమయంగా తయారైంది. పైగా అర్హత లేని వారికి పదోన్నతులు ఇస్తూ, అక్రమ నియామకాలతో యూనివర్సిటీని అవినీతి కూపంలో ముంచేస్తున్నారు. యూనివర్సిటీ పాలకమండలి సమావేశంలో ఈ అక్రమాలు బయటకు రాగా, కళాశాల కమిషనర్ నవీన్ మిట్టల్ స్వయంగా అడ్డదారి పోస్టింగుల్లో వచ్చిన వారి ప్రమోషన్లు రద్దుచేసి డబ్బులు రికవరీ చేయాలని సూచించారంటే యూనివర్సిటీలో అవినీతి ఎంత మేరలో రాజ్యమేలుతుందో అర్థం చేసుకోవచ్చు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదన చేసుకోవడం కోసం, అర్హత లేని వారిని ప్రొఫెసర్లుగా నియమించడంతో వారు ఉన్నతమైన పదవులు చేపట్టారనే ఆరోపణలు గతంలో వచ్చి విద్యార్థులు ఆందోళన చేసినా ఫలితం లేకుండా పోయింది. అక్రమ మార్గంలో రాజకీయ అండదండలతో పాలకమండలి సుదీర్ఘకాలం కొనసాగించడం, ఆ పాలక మండలి నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఆ మండలి వీసీ ఆదేశాలనే బేఖాతరు చేసేలా మారిపోయింది.
రెండేళ్లలో ఆరుగురు రిజిస్ట్రార్లు!
యూనివర్సిటీలో దాదాపు రెండేళ్లలోపే ఆరుగురు రిజిస్ట్రార్లను మార్చారు వీసీ. తనకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకున్నారు. ఏడాదిన్నర క్రితం రిజిస్ట్రార్‌గా నసీం ఉన్నారు. అప్పుడే ప్రభుత్వం యూనివర్సిటీలకు వీసీలు, రిజిస్ట్రార్ల నియామకం చేపట్టాలనే నిర్ణయం తీసుకోవడంతో 2021 మేలో వీసీగా బాధ్యతలు చేపట్టిన వీసీ రవీంద్ర గుప్తా, ఆచార్య కనకయ్యను రిజిస్ట్రార్‌గా నియమించారు. దళితుడు కావడంతో అవకాశం ఇస్తున్నట్లు చెప్పినప్పటికీ... వీసీ నిర్ణయాన్ని పాలకమండలి ఒప్పుకోకపోగా ఆందోళనలు సృష్టించారు. పైగా యూనివర్సిటీ పాలకవర్గ సమావేశంలో కనకయ్యను సమావేశంలోకి రానీయకుండా అవమానించారు ఈసీ సభ్యులు. పైగా ఈసీ కమిటీలోని సభ్యులు గంగాధర్ గౌడ్ కనకయ్యను ఫోన్లో బెదిరించారు. విజ్ఞానం అందించాల్సిన చోట కుల వివక్ష బుసలు కొడుతుంది.
పెత్తనం కోసం పోటీ పడితే...
ఈసీ సూచనతో కనకయ్యను రిజిస్ట్రార్ బాధ్యతల నుంచి తప్పించి ప్రొఫెసర్ యాదగిరిని నియమించారు కళాశాల కమిషనర్ నవీన్ మిట్టల్. అయితే ఆయనను వీసీ కొద్ది రోజుల్లోనే మార్చి ప్రొఫెసర్ శివశంకర్ గౌడ్‌ను నియమించి ఏడాది పాటు బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆయన బదిలీ కావడంతో ఈసీ అనుమతి లేకుండా, ఈసీ సమావేశం జరగకుండా విద్యావర్ధినికి వీసీ కొత్త రిజిస్ట్రార్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాన్ని ఈసీ వ్యతిరేకించడంతో మరోసారి యాదగిరిని నవీన్ మిట్టల్ పాలకమండలి సభ్యుల ఆమోదంతో నియమించి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అడ్డదారుల్లో పదోన్నతులు పొందిన వారి పదోన్నతులను రద్దు చేస్తూ రికవరీకి ఆదేశించారు. కానీ అంతలోపే వీసీ ఉస్మానియా యూనివర్సీటీకి చెందిన ప్రొఫెసర్ నిర్మలాదేవిని డిప్యూటేషన్‌పై రప్పించి .. ఆమెకు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇలా కళాశాల కమిషనర్, పాలకమండలి నిర్ణయాలను కాదని వీసీ తీసుకుంటున్న నిర్ణయాలతో... ఎవరు ఎప్పుడు మారుతున్నారో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో విశ్వవిద్యాలయం విలువను దిగజారుస్తున్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన చోట... పెత్తనం కోసం పోటీ పడుతూ విద్యావ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే... తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బ తినడమే కాదు... కొండంత ఆశతో విశ్వవిద్యాలయాల్లో అడుగుపెట్టి చదవాలనుకునే పేద, దళిత అణగారిన వర్గాల విద్యార్థులకు వీసీ, ఈసీ అంతర్గత పోరుతో నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించి... ఎవరి పరిధిలో వారుండేలా పకడ్భందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాలకమండలిని సైతం యుజీసీ నిబంధనల మేరకు ఏర్పాటు చేసి... విశ్వవిద్యాలయాన్ని భవిష్యత్తు తరాలకు ... సమాజసేవకులుగా మార్చే గొప్ప వేదికలా మార్చాల్సిన అవసరం ఉంది. రాజకీయ జోక్యం లేకుండా ఉంటే విశ్వ విద్యాలయంలో గుణాత్మక మార్పు వచ్చే అవకాశం ఉంది.
ఆ కమిటీని రద్దు చేయాలి!
వీసీ ఎవరిని నియమించినా, ఈసీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ కమిటీ సభ్యుల్లో ఐదుగురిలో ముగ్గురు మాత్రమే ఈ వివాదాలకు కారణం అవుతున్నారు. పైగా ఈసీ కమిటీకి సరైన అర్హతలు లేని సభ్యులున్నారు. మరోపక్క కుల వివక్షకు తెలంగాణ యూనివర్సిటీ ఆది నుంచి కేరాఫ్‌గా మారింది. మొన్నటి వరకు నిశబ్దంగా ఉన్న ఈసీ కమిటీ సభ్యులు, కనకయ్యను రిజిస్ట్రార్‌గా నియామకం చేసిన తరువాత మళ్లీ పరోక్షంగా యాదగిరికి మద్దతు ఇస్తున్నారు. దీంతో తనను పాలకవర్గం నియమించిందని నేనే రిజిస్ట్రార్ అని చెప్పుకోవడం... యాదగిరికి పీహెచ్‌డీ అర్హతలు లేవని ఆయన నియామకం కోర్టు కేసులో ఉందని అతని నియామకం చెల్లదని వీసీ స్పష్టం చేసి... కనకయ్యను రిజిస్ట్రార్‌గా నియమించడం, దీనిని ఈసీ మూడు నెలల తరువాత ఆమోదం తెలపాల్సి ఉండగా, ఆదిలోనే వీసీ నిర్ణయాన్ని తప్పుపడుతుండటంతో టీయూలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వాస్తవానికి అన్ని అర్హతలు ఉండి... సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్న కనకయ్యను గతంలో నియామకం చేసిన సమయంలోనూ ఇదే తంతూ కొనసాగింది. మళ్లీ ఇప్పుడు ఇలానే కొనసాగడం.. కనకయ్య పట్ల కుల వివక్ష చూపిస్తున్నారని స్పష్టం అవుతుంది. ఇప్పటికే దళిత ప్రొఫెసర్లను వీసీలుగా, రిజిస్ట్రార్‌లుగా నియమించడంలో లోపం ఉంది. టీయూలో ఈ సమస్య సద్దుమణగాలంటే... ముందుగా ఈసీ కమిటీ సభ్యుల అర్హతలు, నిబంధనలపై చర్చించి...ఆ కమిటీని రద్దు చేస్తే గానీ ఈ సమస్యకు పరిష్కారం లభించదు. ఆ దిశగా ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి.
సంపత్ గడ్డం
దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు
78933 03516