పదో తరగతి పరీక్షనా... కాంపిటీటివ్ పరీక్షనా?
పదో తరగతి పరీక్షనా... కాంపిటీటివ్ పరీక్షనా?... is ssc new exam model is an Competitive Exam
కరోనా అనంతరం పూర్తిస్థాయిలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అందుకే ఈ సంవత్సరం ఎస్సెస్సీ బోర్డు పరీక్షా విధానంలో మార్పులు తీసుకొచ్చింది. గత రెండు సంవత్సరాలుగా కరోనా కాలంలో విద్యా వ్యవస్థ అతలాకుతలం కావడంతో పదోతరగతి పరీక్షలను పదకొండు పేపర్ల నుండి ఆరు పేపర్లకు కుదించారు. ప్రస్తుతం జరిగే పరీక్షలకు సైతం ఆ విధానాన్నే కొనసాగిస్తున్నారు. అయితే కరోనా సమయంలో 70 శాతం సిలబస్ మాత్రమే పరిగణనలోకి తీసుకొని పరీక్ష ప్రశ్నాపత్రం రూపొందించారు. అందులో 50 శాతం ప్రశ్నలు ఛాయిస్‌గా ఇస్తూ పేపర్‌ను తయారు చేశారు. కానీ ఈ సంవత్సరం పూర్తి సిలబస్ ఉండటం, అదీ ఒకే పేపర్ ఉండటంతో మోడల్ పేపర్లను విడుదల చేసింది బోర్డ్. అయితే ఈ మోడల్ పేపర్స్‌ను చూసిన విద్యార్థులు, టీచర్లు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చాయిస్ లేకుండా ప్రశ్నాపత్రం
ఇప్పుడు పదో తరగతి చదువుతున్న విద్యార్థులు గతంలో చదివిన 8,9 తరగతులను ఆన్‌లైన్‌లో చదువుకున్నారు. అంటే కనీస సామర్థ్యాలు లేకుండానే పదో తరగతికి వచ్చారు. అయితే, ప్రస్తుతం పూర్తి సిలబస్ ఉండటంతో వారికి సైతం ఒకే పేపర్‌తో పరీక్షను నిర్వహిస్తామన్న బోర్డ్ నిర్ణయం సమర్థించదగినదే. కానీ గత బోర్డ్ పరీక్షలలో మొదటి, రెండవ సెక్షన్‌లలో అడిగిన ప్రశ్నలకు ఛాయిస్ ప్రశ్నలు ఉండేవి. ప్రస్తుత పరీక్ష విధానంలో మొదటి, రెండవ సెక్షన్లో ఎటువంటి ఛాయిస్ ప్రశ్నలు లేవు. ఎలాంటి చాయిస్ లేకుండా ప్రశ్నలు రాయమనడం వలన మెజారిటీ విద్యార్థులకు అన్ని ప్రశ్నలు రాయడం సాధ్యం కాదు. నిజానికి బోర్డ్ అన్ని పాఠ్యాంశాలు కవర్ కావాలని పరీక్ష విధానాన్ని మార్చింది. అందుకే మొదటి సెక్షన్‌లో అడిగిన పది ప్రశ్నలకు, రెండవ సెక్షన్‌లో ఆరు ప్రశ్నలకు చాయిస్ లేకుండా రూపొందించింది. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ రెండు సెక్షన్లలో మొదటి దానికి ఆరు ప్రశ్నలు రాయమని నాలుగు ఛాయిస్‌గా, రెండవ సెక్షన్‌లో ఆరు ప్రశ్నలలో రెండు చాయిస్ గా ఇస్తే బాగుండేది. ఇక మూడో సెక్షన్‌లో గతంలో నాలుగు ప్రశ్నలు ఇచ్చి రెండు రాయమనేవారు, కానీ ప్రస్తుతం వాటిని నాలుగు నుంచి ఆరుకు పెంచారు. అయితే ప్రస్తుత పరీక్ష విధానంలో చాయిస్ లేకుండా ప్రశ్నలు ఇవ్వడం వలన ఈ పరీక్ష గ్రూప్ పరీక్షల వలె ప్రతి ప్రశ్నకు పది, పదిహేను నిమిషాలకు ఒక ప్రశ్న రాయాల్సి వస్తుంది. ఇది కొంత మంది విద్యార్థులకే సాధ్యమవుతుంది కానీ అందరికీ సాధ్యం కాదు. సమయం ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. కాబట్టి గతంలో ఉన్న మాదిరిగానే నాలుగు ప్రశ్నలు ఇంటర్నల్ చాయిస్‌తో ఐదు మార్కులకు బదులు ఎనిమిది మార్కులు కేటాయిస్తే సరిపోయేది. అలాగే భౌతిక, రసాయన శాస్త్రాలకు జీవ శాస్త్రానికి వేరు వేరు రోజుల్లో పరీక్ష ఉంటే బాగుండేది.
పార్ట్-బిలోనూ అంతే
ఇక పార్ట్-బి విషయానికి వస్తే రెండు పేపర్లు ఒకే పేపర్ గా మారడం వలన దీనికి మార్కులు పెరిగాయి. మోడల్ ప్రశ్న పత్రాలను బట్టి చూస్తే ఈ ప్రశ్నల కూర్పు చాలా కఠినంగా ఉంది. గ్రూప్ పరీక్షల వలె పదవ తరగతి ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు లోతైన అవగాహన ఉంటే తప్ప, వీటికి సమాధానాలు చేయలేం. ఈ పార్ట్-బి లో ఒక ప్రశ్నకు ఒకటవ ఐచ్ఛికం(1) ఏ, బి, సి, డి, రెండవ ఐచ్ఛికం(2) డి, సి, బి, ఏ, (3) సి, డి, ఏ, బి, (4) బి,ఏ,డి,సి గా సమాధానాలు ఇచ్చారు. ఒక ప్రశ్నకు జవాబు కావాలంటే ఎలిమినేట్ మెథడ్‌ను ఉపయోగించి తెల్సుకోవాల్సి వస్తుంది. దీనిని చూస్తుంటే ఇది పదవ తరగతి ప్రశ్నపత్రమా లేక పబ్లిక్ సర్వీస్ పరీక్ష ప్రశ్నపత్రమా అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ ప్రశ్నల ఐచ్ఛికాలు గ్రూప్స్ పరీక్షను తలపిస్తుంది. అందుకే ఎస్సెస్సీ బోర్డ్ 8,9 తరగతులు నామమాత్రంగానే పూర్తి చేశారని గమనించాల్సింది, ఆన్‌లైన్ విద్య అందినా అది ప్రభుత్వ పాఠశాలలో ఎంతమేరకు అందిందో ఆలోచించి పశ్న పత్రాన్ని రూపొందించాల్సింది. అందుకే వీరిని దృష్టిలో పెట్టుకొని తక్షణమే కఠినతరమైన పదో తరగతి పరీక్ష విధానాన్ని మార్చి గత సంవత్సరం లాగా చాయిస్ ప్రశ్నలు ఇవ్వాలి. పార్ట్-బి ప్రశ్నల తయారీలో సరళతరమైన విధానాన్ని అనుసరించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు న్యాయం చేయాలి.
జుర్రు నారాయణ యాదవ్,
తెలంగాణ టీచర్స్ యూనియన్, మహబూబ్‌నగర్
94940 19270