పేదరికం ఓ బహు వ్యాధి లక్షణంగా ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తున్నది. పేదరికం ఒక ఆర్థిక సమస్య మాత్రమే కాదు, అది ఒక బహుముఖీన సమస్యలతో కూడిన విషవలయం. పేదరికంతో నిరక్షరాస్యత, మానవ హక్కుల ఉల్లంఘన, హింస, దోపిడీల, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు, జీవన ప్రమాణాలు, అసురక్షిత గృహవసతులు, పోషకాహార లోపం, ఆరోగ్య అభద్రత, ఆకలిచావులు వంటివి ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి. 1987లో జోసఫ్ వ్రెసిన్స్కీ చొరవతో ఫ్రాన్స్, పారిస్ నగరంలో పేదరికం, ఆకలి చావులు, హింస, ప్రాణభయం బారినపడిన ప్రపంచ పౌరుల సమస్యలను చర్చించేందుకు ఒక లక్ష మందితో సమావేశం ఏర్పాటు చేయడం, 1992లో ఈ తీవ్ర సమస్యలకు స్పందించిన ఐక్యరాజ్యసమితి 17 అక్టోబర్ రోజున ప్రతి ఏటా ‘అంతర్జాతీయ పేదరిక నిర్మూలణ దినం’ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యం
పేదల దుస్థితిని సహానుభూతితో ఆకళింపు చేసుకొని, పేదరిక నిర్మూలనకు సదాలోచనలు, క్షేత్రస్థాయి ఆచరణలు చేయడానికి ఈ రోజును పాటించాలని సూచిస్తున్నారు. ఆర్థిక అసమానతలను తగ్గించడం, పేదల బడుగు బలహీన వర్గాల సుస్థిరాభివృద్ధికి కృషి చేయడం ప్రభుత్వాల కనీస బాధ్యత అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 1990 విశ్వజనాభాలో 36 శాతం దారిద్ర్యరేఖ దిగువన ఉండగా, 2018 గణాంకాల ప్రకారం 8 శాతం మాత్రమే ఉన్నారని తేలింది. దక్షిణ ఆసియా, సబ్-సహారా ఆఫ్రికావాసులు అధిక శాతం పేదరికం అనుభవిస్తున్నారని అంచనా. విశ్వవ్యాప్తంగా 55 శాతం జనాభాకు కనీసం ఒక సామాజిక రక్షణతో కూడిన ఆర్థిక చేయూతకు దూరంగా ఉన్నారని తేలింది.
2015లో ఐరాస రూపొందించిన ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030’ ప్రకారం 2030 నాటికి పేదరికం, ఆకలి లేని ప్రపంచం అవతరించే దిశలో కార్యక్రమాలు రూపొందించాలని మార్గనిర్దేశనం చేస్తున్నారు. పేదల కష్టాలను అర్థం చేసుకోవడం, వారి గోడును సానుభూతితో ఆలకించడం, పేదరిక నిర్మూలనకు సరైన కార్యాచరణ చేపట్టడం ప్రస్తుత కర్తవ్యంగా ప్రపంచ దేశాలు భావించాలి. పేద పిల్లలకు (బాలురు, బాలికలు) విద్య అందించడంతో భవిష్యత్తులో వారికి ఆర్థిక ఆదాయం పెరగడం, పేదరికం, నిరుద్యోగం తగ్గడం జరుగుతాయి. బాలలకు ఆర్థిక, పౌర, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక హక్కులను కల్పించడానికి కృషి చేయాలి. ఆహార పదార్థాల ప్రజాపంపిణీ, వైద్య సదుపాయాల కల్పన, సురక్షిత నీరు, పరిసరాల పరిశుభ్రత, గర్భవతులకు పోషకాహారం అందించడం, ఉపాధి కల్పన లాంటి ప్రభుత్వ చర్యలు పేదరికాన్ని తగ్గించవచ్చు.
భారతంలో పేదరికం…..
అధిక జనాభాగల భారత్‌లో 6.5 శాతం (73 మిలియన్లు) ప్రజలు దారిద్య్ర రేఖ దిగువన ఉన్నారని, గత దశాబ్దకాలంలో 271 మిలియన్లను పేదరిక ఊబిలోంచి బయటకు తీసుకురావడం జరిగిందని నివేదికలు తెలుపుతున్నాయి. కోవిడ్-19 కారణంగా దేశవ్యాప్తంగా 4.51 లక్షల మరణాలు, 3.4 కోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఇండియాలోని ఒక శాతంగా ఉన్న ధనివంతులే 73 శాతం సంపదను అనుభవిస్తుండగా, 670 మిలియన్ల పేదల ఆదాయం ఒక శాతం మాత్రమే పెరిగిందని అంచనా వేశారు. మన దేశంలో అధిక జనాభా, వ్యవసాయ ఉత్పత్తుల తగ్గుదల, మౌలిక వసతుల లేమి, ఆర్థిక వృద్ధి రేటు తగ్గడం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తక్కువగా ఉండడం, వైద్య ఆరోగ్య వసతుల కొరత, సామాజిక కారణాలు, శ్రమదోపిడి, వాతావరణ కారకాలు లాంటి సమస్యలతో పేదరికం ప్రబలడం జరుగుతున్నది. భారత ప్రభుత్వం ఐఆర్‌డీపీ, జవహర్ రోజ్‌గార్ యోజన, గ్రామీణ గృహవసతి, కరువు పనుల కల్పన, వృద్ధాప్య పెన్షన్, అన్నపూర్ణ పథకం, గ్రామీణ ఉపాధి కల్పన, నేషనల్ అర్బన్ లైవ్‌లీహుడ్ మిషన్, ప్రధానమంత్రి కౌషల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన లాంటి పథకాలతో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాపంపిణీ ద్వారా ఆహారధాన్యాలను అందిస్తూ, పలు పథకాలతో పేదలకు చేయూతను ఇస్తున్నారు. భారతదేశంలో పేదరికం ఫలితంగా శిశుమరణాలు(సాలీనా 1.4 మిలియన్లు), పోషకాహార లోపం(61 మిలియన్లు), బాలకార్మిక దురాచారం(12.5 మిలియన్లు), బాలల అవిద్య (25 శాతం), బాల్యవివాహాలు(44.5 శాతం), హెచ్‌ఐవి- ఏయిడ్స్ (2.7 మిలియన్లు) లాంటి దుష్పరిణామాలు కలుగుతున్నాయి. ప్రజలకు పని కల్పన, పోషకాహార భద్రత, అందరికీ ఉచిత విద్య అమలు ద్వారా మాత్రమే సమాజం ఆరోగ్యంగా, పేదరికానికి దూరంగా జీవించగలుగుతారు. వాతావరణ ప్రతికూల మార్పులు, విపత్తులు, కరువులు లాంటి ఏ ఉపద్రవం ఎగిసినా పేదలే ముందు ప్రభావితం అవడం సహజంగా జరుగుతున్నది. పేదరిక నిర్మూలనలో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, పౌరసమాజం తమ చేయూతను అందిస్తూ, మానవ హక్కులకు పట్టం కట్టి, ఆకలి చావులు లేని సంతోష తోరణాలు నిండిన భారతాన్ని నిర్మించుకుందాం.
(నేడు అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం)
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
99497 00037