క్రీడా భారతానికి పతక వందనం..

india won highest cups in asia games held in china

Update: 2023-10-09 23:30 GMT

నవ భారత నిర్మాణంలో క్రీడల పాత్ర ఎంతో వైవిధ్యమైనది. దేశంలో కొన్నేళ్ల నుంచి క్రీడల ప్రాధాన్యత పెరుగుతోంది. దేశంలో క్రీడా భారతం సుదృఢ భారతం వంటి వివిధ పథకాలు, కార్యక్రమాలు రూపు దిద్దుకోవడం వల్ల క్రీడారంగపు రూపురేఖలు మారుతున్నాయి. యువతలో జీవన నైపుణ్యాలకు ప్రోత్సాహం, జాతీయ ప్రతిష్ట భావనను ప్రోది చేయడం క్రీడారంగానికి ఉత్ప్రేరకంగా మారాయి. 2014-2023 ఖేలో ఇండియా పథకం క్రింద మంజూరైన 293 ప్రాజెక్టులకు గాను 146 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వివిధ రాష్టాలతో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ద్వారా 31 ఖేలో ఇండియా క్రీడా నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా నిర్దిష్ట క్రీడా విభాగాలపై ప్రధానంగా దృష్టి సారించి క్రీడాకారులకు ఆత్యాధునిక శిక్షణ ఆందిస్తున్నారు. ఇలా ప్రభుత్వ చొరవ, పారదర్శకంగా క్రీడాకారుల ఎంపిక, శిక్షణ, మౌలిక వసతులు సదుపాయాల కల్పన వెరసి ఈ కలను సాకారం చేశాయి. చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఈ సంవత్సరం ఆసియా క్రీడల్లో భారత్ నుంచి మొత్తం 655 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు దేశంలోనే అతిపెద్ద దళం ఇదే. మొత్తం 40 ఈవెంట్లలో భారత ఆటగాళ్లు పాల్గొని పథకాలు సాధించడంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈసారి భారత ప్లేయర్స్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2018 ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు 70 పతకాలు సాధించగా ఇప్పుడు 107 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. భారత ఆటగాళ్లు ఈ అద్భుతాన్ని సాకారం చేసినందుకు యావత్ భారతవని ప్రశంసల వర్షం కురిపిస్తోంది. భారత్‌ ఈ చారిత్రాత్మక మైలురాయిను సాధించడానికి కారణమైన క్రీడాకారులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తోంది. భారత్‌ ఇప్పటి వరకు 28 గోల్డ్‌, 38 సిల్వర్‌, 41 బ్రాంజ్‌ మెడల్స్‌ను సాధించారు. క్రీడాకారుల అద్భుత ప్రదర్శన విస్మయం కలిగించడమే కాకుండా, దేశ ప్రజల హృదయాలను విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. ఇది శుభ పరిణామం ఈ స్ఫూర్తితో రానున్న అంతర్జాతీయ క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించగలం. ఆటలు విస్తృతంగా బహిర్గతమవ్వాలి అన్న 2024 ఒలింపిక్స్‌కు విశ్వక్రీడల నినాదాన్ని నిజం చేయడానికి భారతదేశం క్రీడా శక్తిగా మారే మార్గంలో ఉందని సూచిస్తుంది. భారత క్రీడాకారులు అనేక క్రీడాంశాలలో అంతర్జాతీయ వేదికలపై అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. భారతదేశాన్ని పరిగణనలోకి తీసుకోక తప్పని క్రీడాశక్తి ప్రపంచం గుర్తిస్తోంది. జాతి మొత్తాన్ని ఏకీకృతం చేయగల శక్తి క్రీడలకు మాత్రమే ప్రత్యేకం.

శ్రీధర్ వాడవల్లి

99898 55445

Tags:    

Similar News