తిరగబడ్డ రామాయణం... 'హలో మీరా'

In Hello Meera Movie, Gargeyi shines in this movie experiment

Update: 2023-07-01 00:45 GMT

'అమ్మా, మమ్మల్ని మేమెలా పిల్చుకోవాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా. ఆ విషయాల్ని మాకు వదిలేయ్..' ఇది 'హలో మీరా' సినిమా ప్రారంభంలోనే వినిపించే డైలాగ్ ఇది. కాబోయే భర్తను పేరుతో పిలుస్తావేంటే అంటూ తల్లి మందలిస్తే హీరోయిన్ మీరా పాత్రధారి చెప్పిన డైలాగ్ ఇది. మొత్తం సినిమా అంతా ఆధునిక ఇతివృత్తంతోనే ఉంటుందని ఇది వాచ్యంగా చెబుతుంది. ఆధునిక తెలుగు సినిమా కల్లో కూడా ఊహించని కథనం ఒక ఎత్తైతే, హీరోయిన్ గార్గేయి నటన ఒక ఎత్తు. దర్శకుడు నడిపిన స్క్రీన్ ప్లే, నేపథ్య సంగీతం, షాట్ టేకింగ్ మరొక ఎత్తుగా సాగిన అసలు సిసలు నిర్వచనం 'హలో మీరా' (Hello Meera).

ఒకే ఒక పాత్ర. 90 నిమిషాల సినిమా ఆద్యంతం ఒకే ఒక డ్రెస్‍‌లో హీరోయిన్. ఒకే కారు, ఒకే ఒక ఫోన్. కేవలం ఫోన్ కాల్స్ ఆధారంగా కార్ రైడింగ్ నేపథ్యంలో కొనసాగిన ఈ సినిమాను ఎంత పొగిడినా అతిశయోక్తి కాదని చెప్పాలి. విజయవాడ నుంచి హైదరాబాద్ జాతీయ రహదారిని డ్రోన్స్ షాట్‌లతో రాత్రి పూట దీప కాంతులలో ఎంత బ్యూటిఫుల్‌గా తీశారంటే మీరా నడుపుతున్న కారులో మనమే ఉన్నట్లు, సమస్యలన్నీ వదిలేసి రోడ్డు అందాలను చూస్తున్నట్లు ఫీలవుతాం.

నాటి మాయాబజార్‌తో మొదలై స్క్రీన్ ప్లేకి తలమానికంగా నిలిచిన అరుదైన చిత్రాల సరసన హలో మీరా చేరిపోయింది. వీక్షకులకు ఒకే ఒక పాత్ర.. మీరాను చూపిస్తూ, నేపథ్యంలో అన్ని పాత్రల చేత మాట్లాడిస్తూ, సినిమా మొత్తం అమ్మాయి కారు నడుపుతుంటే దర్శకుడు వెనుక నుంచి స్క్రీన్ ప్లే నడపడం... ఇది కదా బ్యూటీ ఆఫ్ సినిమా అంటే అనిపించకమానదు. తెల్లారితే ప్రేమించిన వాడితో పెళ్లి కావలసిన అమ్మాయి ఉన్నట్టుండి అనూహ్యమైన వరుస సుడిగుండాల్లో చిక్కుకుని ఒంటరిగా రాత్రిపూట విజయవాడ నుంచి హైదరాబాద్‌కి కారులో ప్రయాణించవలసిన తప్పనిసరి పరిస్థితుల్లో.. ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు లోనవుతుందో, ఒక్క కేసుతో ఆమె జీవితం ఎలా తలకిందులైందో, అమ్మాయిలపై అపవాదులకు సంబంధించి అడుగడుగునా సమాజం, కుటుంబాలు పెట్టే నియంత్రణలకు హడలిపోతూనే తండ్రి మద్దతుతో తన సమస్యను ఆమె పరిష్కరించుకున్న తీరును చిత్రించిన విధానం చూస్తే చిత్ర దర్శకుడిని ఆర్తితో కౌగలించుకోవాలనిపిస్తుంది.

క్లుప్తంగా కథ గురించి

టీసీఎస్ లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న మీరా (గార్గేయి)కి మరో రెండు రోజుల్లో పెళ్లి.. పెళ్లి బ్లౌజులు తీసుకోని కారులో ఇంటికి బయల్దేరుతున్నా మీరాకి హైదరాబాద్ రాయదుర్గం పోలీసు స్టోషన్ నుంచి ఫోన్ వస్తుంది. మీరా మాజీ బాయ్ ఫ్రెండ్ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. చనిపోయే ముందు రోజు అతనితో ఉందని సోషల్ మీడియో ఫోటో పోస్ట్ చేస్తాడు. దీంతో పోలీసులు మీరా మోసం చేసినందువల్లే ప్రియుడు సూసైడ్ చేసుకున్నాడని అనుమానించి ఉన్న పళంగా రాయదుర్గ్ పోలీస్ స్టేషన్‌కు రమ్మని ఆర్డరేస్తారు. అప్పటినుంచి ఒకటిన్నర గంట సినిమా మొత్తంగా ఫోన్ కాల్స్ పైనే సాగుతుంది. ఒకవైపు పెళ్లి పనులు, వచ్చే అతిధులు, స్నేహితురాళ్ల ఫోన్ కాల్స్... మరోవైపు కాబోయే భర్తకు, వారి కుటుంబానికి పెళ్లికి ముందు అమ్మాయికి ఎఫైర్ ఉందని తెలిస్తే ఏమనుకుంటారో అనే భయం. పెరిగిపోతున్న పోలీసుల ఒత్తిడి.. వీటన్నింటిమధ్య ఈ సమస్య నుంచి మీరా ఎలా బయటపడింది, ఎన్ని బాధలు పడింది. చివరకు ఏమైంది అనేదే హలో మీరా సినిమా.

మంచీ, చెడూ

ముందే చెప్పినట్లు హలో మీరా సినిమా మొత్తం ఫోన్ సంభాషణలతో నడుస్తుంది. తెరపై మనకు కనిపించేది మీరా ఒక్కతే కాగా, ఆమె కాబోయే భర్త కళ్యాణ్, మీరా తల్లిదండ్రులు, ఆమె అత్తమామలు, పోలీసు అధికారులు, గూండాలు, టైలర్ అనేక ఇతర పాత్రల గొంతులను మాత్రమే మనం వింటాం. సినిమాలో అసలు కనిపించని ఈ పాత్రల స్వరాలు, భావోద్వేగాలను తెలియజేసేంత ప్రభావవంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ ప్రయత్నంలో చిత్ర దర్శకుడు గొప్ప విజయం సాధించారు. అలాగే ఆయా పాత్రలకు సంబంధించిన అతి సూక్ష్మ వివరాలను కూడా అద్భుతంగా అందించారు. ఓకే ఒక పాత్ర సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోయడం స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమనుకుంటున్న తరుణంలో గార్గేయి 90 నిమిషాల నిడివి ఉన్న చిత్రం పొడవునా అద్భుతాన్ని సృష్టించింది. తన పాత్రనే కాకుండా ఇతర పాత్రల భావోద్వేగాలను కూడా తాను ఊహించుకుంటూ ప్రతిస్పందించాల్సి రావడం మామూలు విషయం కాదు. గార్గేయి తన పాత్రను ఎంత పరిపూర్ణంగా పోషించిందంటే, ప్రతిదశలోనూ, ప్రతి క్షణంలోనూ తన పాత్ర ద్వారా వివిధ భావోద్వేగాలను మనం అనుభవిస్తుంటాం. ఈ విషయంలో గార్గేయి నిరుపమానమైన నటనను ప్రదర్శించింది. సినిమా కోసం వంద శాతం ఎఫర్ట్ పెట్టాం అనే మాట కామన్ అయిపోయిందీ రోజుల్లో. అలా నూరుశాతం ఎఫర్ట్ పెట్టడం అంటే ఏమిటో గార్గేయి నిరూపించి చూపింది. సినిమా సాగదీతకు గురయ్యే అవకాశాలు చాలా ఉన్నప్పటికీ తన హావభావాలతో వీక్షకులను ఆమె ఎంతగా మెస్మరైజ్ చేసిందంటే ఆమె నుంచి, ఆమె ఎక్స్‌ప్రెషన్స్ నుంచి చూపు తిప్పుకోలేము.

ఒక యాక్షన్‌ను చూసినట్టు కాకుండా నిజ జీవితంలా, ఒక యాక్టర్‌ను చూసినట్టు కాకుండా మనకు పరిచయం ఉన్న ఒక అమ్మాయి ఆవేదనలో మనం భాగమైనట్లుగా సినిమా మొత్తంలో ఫీల్ కావాలంటే స్క్రీన్ ప్లేని ఎంత గొప్పగా మలిచి ఉండాలి అనిపిస్తుంది.

రామాయణ విలువను తిరగేసి..

వందల సంవత్సరాలుగా భారతీయుల జీవితాలపై చెరగని ప్రభావం వేస్తున్న రామాయణంలోని విలువలకు పూర్తి భిన్నంగా క్లైమాక్సులో చెప్పిన డైలాగ్ భావజాలపరంగా హలో మీరాను శిఖర స్థాయిలో నిలిపింది. 'పరాయి మగాడు అపహరించుకుపోయిన భార్యను మళ్లీ తెచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి నేను అయోధ్య రాముడినా.. నేను బారిక రాముడిని' అంటూ భార్య తప్పు చేసిందనే అనుమానంతో సగటు అయోధ్య పౌరుడు దూరం పెట్టిన వైనాన్ని మనం లవకుశ సినిమాలో చూశాం. రామ పట్టాభిషేకంతో ముగియాల్సిన రామాయణ గాథను మళ్లీ పొడిగించి సీతను అరణ్యాలకు పంపడం దాకా విస్తరించడానికి బారిక రాముడు అనే నాటి సగటు అయోధ్య పౌరుడి ఈ డైలాగే ప్రధాన కారణం మరి. పర పురుషుడు స్త్రీని అపహరించినా, అత్యాచారం చేసినా, అవమానించినా అలాంటి స్త్రీ వెంటనే అంటరానిదైపోతుందన్న భావజాలం వందలు వేల సంవత్సరాలుగా మనల్ని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో పోలీసు స్టేషన్ వెళ్లడం అంటే పెళ్లి, కెరీర్, జీవితమే తల్లకిందులైనట్లుగా భీతిల్లిపోయి మీరా వణికిపోతుంటే ఆమె కాబోయే భర్త కల్యాణ్ అత్యంత సరళంగా, సహజాతి సహజంగా చివరలో ఒక డైలాగ్ చెబుతాడు.. రామాయణం లోని డొల్లతనాన్ని రెండే రెండు వాక్యాల్లో చెప్పినట్టుగా కల్యాణ్ పాత్ర ద్వారా చెప్పటం సూపర్. 'భార్యాభర్తల మధ్య ఏం జరిగినా నాలుగు గోడల మధ్య, రెండు నోళ్ల మధ్య ఉండాలంటారు. సుధీర్ విషయం నీకు నువ్వుగా నాకు చెప్పావు. అదే వేరెవరిద్వారానో నాకు తెలిసి ఉంటే... అందుకే నీ మీద నాకు గౌరవం పెరిగింది. అలాగే మనిద్దరికీ సంబంధించిన విషయం మూడో వ్యక్తి ద్వారా మనవాళ్లకు తెలీకూడదు. మనమే చెప్పాలి. అప్పుడే మనకు గౌరవం. అందుకే కదా నేను నీకు సారీ చెప్పాను. అని కల్యాణ్ చెబుతుంటే మీరా అడ్డుకుని 'మరి మీ అమ్మ, అక్క, సొసైటీ విషయం ఏంటి' అని అడుగుతుంది. హా.. అదా.. రాముడికి సీతాదేవి పవిత్రత తెలిసి కూడా అగ్నిప్రవేశం చేయించాడు. ఎందుకు సొసైటీ కోసం.. అయినా సొసైటీ శాటిస్‌ఫై కాలేదు. మళ్లీ అడవులకు పంపించారు. సో.. సొసైటీది నరం లేని నాలుక. కదా...'' కాబోయే భార్యా భర్తలిద్దరూ మధ్య ఈ సంభాషణ మొత్తం రామాయణాన్నే తిరగరాసింది కదా. సొసైటీది నరం లేని నాలుక, దాన్ని మనం ఏమాత్రం పట్టించుకోవద్దు అనే విషయం ఆనాడు రాముడికి అర్థమై ఉంటే ఉత్తర రామాయణమే జరిగేది కాదు కదా.

స్త్రీని శిఖర స్థాయిలో నిలిపి..

హలో మీరా సినిమా ఒకటికి రెండు సార్లు చూడండి. ఆధునిక భావజాలం, వినూత్నమైన కంటెంట్, మనోహరమైన స్క్రీన్ ప్లే, అత్యున్నతంగా సాగిన నేపథ్య సంగీతం, విజయవాడ టు హైదరాబాద్ జాతీయ రహదారిపై మెరిసిన దీపకాంతుల నిసర్గ సౌందర్యం.. చలం నుంచి కొకు, రంగనాయకమ్మ గార్ల వరకు తెలుగు సాహిత్యంలో స్త్రీని శిఖర స్థాయిలో నిలిపిన ఆధునిక భావ సంస్కారం ఎంత గొప్పగా ఉంటుందో అర్థం కావాలంటే హలో మీరా తప్పక చూడండి. ఈ సినిమాలో పేదరికం, సగటు మనిషి జీవన సమస్యలు కలికానిక్కూడా లేవు. అంతమాత్రాన ఈ సినిమా చూపించిన భావజాల ఔన్నత్యాన్ని ఏమాత్రం తగ్గించలేం. రామాయణ భావజాలాన్ని సంస్కరించిన నిరుపమాన దృశ్య కావ్యం హలో మీరా. బలగం, రంగమార్తాండ తర్వాత తెలుగు ప్రజలు శిరసున పెట్టుకుని సమాదరించాల్సిన సహజ చిత్రమిది.

కె. రాజశేఖర రాజు

73964 94557

Tags:    

Similar News