భారతదేశ ఆర్థిక శాస్త్రాన్ని నిర్మించడానికి తాను ఎంత కష్టపడ్డాడో, మూలాధారాలను సంపాదించడానికి ఎంత వ్యయ ప్రయాసల కోర్చాడో తన పరిశోధనా గ్రంథమైన ‘‘ఈస్టిండియా కంపెనీ పరిపాలనా ఆర్థిక విధానం’’ అనే గ్రంథంలో డా.బి.ఆర్.అంబేద్కర్ వివరించాడు. ఇది ఆయన ‘మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్’ డిగ్రీ కోర్సు కోసం సమర్పించిన పత్రం.
అంబేద్కర్ విద్యకు చాలా ప్రాధాన్యం ఇచ్చాడు. విద్య అంటే కేవలం అక్షరాస్యత అనో, చదువనో అనుకోలేదని స్పష్టమవుతుంది. విద్య మనిషిని సంపూర్ణంగా మార్చగలిగే సాధనమన్నది అంబేద్కర్ నమ్మకం. బుద్ధుడి బోధనలు, తాత్విక చింతన కేంద్రంగానే అంబేద్కర్ విద్యను అభ్యసించారు. విద్య పరమార్థం ప్రజ్ఞ, కరుణ, సమతలను పంచడమే అని, ఈ త్రిగుణాలు పెంపొందించినప్పుడే విద్యకు పరిపూర్ణత చేకూరుతుందని ఆయన భావించారు. ఆయన విద్యాభ్యాసంలో ఒక యుద్ధ ప్రక్రియ ఉంది. అంబేద్కర్ అపారమైన జ్ఞాపక శక్తి కలవాడు. సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా, తాత్వికంగా, భారతీయ సమాజాన్ని పునః నిర్మించడానికి కృషి చేశారు. ప్రపంచ మానవునిగా ఎదిగారు, ప్రపంచ తత్వవేత్తలలో ఒకరిగా నిలిచారు. భారతదేశానికి ఎనలేని కీర్తి తెచ్చారు.
సుడిగుండాల్లో మునిగి పైకి లేచి....
అంబేద్కర్ నిరంతర అధ్యయనం, విశ్లేషణ, తర్కం, హేతువాదం, మానవతావాదం, సాంస్కృతిక విప్లవం, ఆర్థిక, సాంఘిక, రాజకీయవాదం, బౌద్ధ విప్లవ ప్రస్థానం, దళితుల జీవన పరిణామ శాస్త్రం ఆయన విస్తృతిని, వ్యాప్తిని, ప్రాపంచిక తాత్విక దృక్పథాన్ని మనకి సాక్షాత్కరింప చేస్తున్నాయి. అంబేద్కర్ జీవితం దుఃఖ సముద్రం. ఆయన ఆ సముద్రాన్ని ఈదాడు, ఆ సుడిగుండాల్లో మునిగి మళ్లీ పైకి లేచాడు. ఏ దుఃఖాన్నైతే పొందాడో ఆ దుఃఖాన్ని నివారించడానికి పూనుకున్న బోధకుడు. అందుకే అంబేద్కర్ జీవితం దుఃఖ నివారణతో కూడిన నవయాన బౌద్ధంగా సాగింది. ఆయన జీవితాన్ని, పోరాటాన్ని వేరు చేసి చూడలేం. ఆయన అగ్నిగుండంలో దూకి సమాజానికి జ్ఞాన ధారలు అందించాడు. ఆయన యుద్ధ యోధులకు జన్మించాడు. ఆయన తండ్రి రాంజీ సత్పాల్. తల్లి బీమా భాయి. వారు వీరయోధులు. పట్టుదల, ధైర్యం, త్యాగం, సాహసం తన పుట్టుక నుండే వచ్చాయి.
పరిశోధనలు వెలుగు దివ్వెలు
ఆయన ఒక వాల్టేర్ లాగా, రూసో లాగా ప్రపంచానికి ఒక నూతన దర్శనాన్ని అందించాడు. బహుభాషా నిష్ణాతుడు. అంబేద్కర్ అపారమైన జ్ఞాపక శక్తి కలవాడు. రాజ్యాంగ సభ చర్చల సందర్భంగా కొన్ని వందల అంశాలు చూడకుండా చెప్పగలిగే వాడు. ఆయన వాక్చాతుర్యానికి, వాదన పటిమకు, విషయపరిజ్ఞానానికి బాబు రాజేంద్రప్రసాద్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజాజీ వంటి వారు అచ్చెరువు పొందేవారు. విద్యను కీర్తి కోసం కాక సమాజ మార్పు కోసం ఉపయుక్తం చేశాడు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1913లో న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా, పరిశోధకుడిగా బ్రిటిష్ ఇండియాలో ప్రొవెన్షియల్ ఫైనాన్స్ అనే థీసస్ రాయగలిగాడు అంటే అది ఎంతో శ్రమతో, సాహసంతో, కృషితో, పట్టుదలతో సాధించిన పనిగా అందరూ అభినందించారు. ఆర్థిక శాస్త్రవేత్త ఈ. ఆర్.జె. చెలిగ్ మన్ అతని పరిశోధనలకు పర్యవేక్షకునిగా ఉండటమే కాక ఆయన పరిశోధనలు ప్రపంచానికి వెలుగు దివ్వెలు అని కొనియాడారు. అంబేద్కర్ 1916లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డాక్టర్ పట్టా పుచ్చుకోవడం కోసం రాత్రింబవళ్లు శరీరం శుష్కించే వరకు చదివాడు.
బానిసకు విద్య నేర్పండి చాలని..
పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, అనేక విద్యాలయాలు, కళాశాలల ఏర్పాటుకు కృషి చేశారు. జ్ఞానం, కరుణ తను స్థాపించిన సొసైటీ ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్న అంబేద్కర్ ‘‘హక్కుల సాధన కోసం చదువుకోండి! సంఘటితం కండి! పోరాడండి! మీపైన మీరు విశ్వాసం పెంచుకోండి! ఏ రకంగా కూడా మనకు ఓటమి వుండదు. ఇది విజయం కోసం చేస్తున్న పోరాటం, స్వేచ్ఛ కోసం సాగిస్తోన్న యుద్ధం. ఈ యుద్ధం మనం కోల్పోయిన వ్యక్తిత్వాన్ని తిరిగి పొందడానికి చేస్తున్నది’’ అని ఉద్భోదించారు. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆ కాలంలోనే క్రమ క్రమంగా దాదాపు 50 విద్యా సంస్థలను నడిపే మహా కేంద్రంగా ఎదిగింది. ‘చదువుకుంటే బతకగలం, భవిష్యత్తుని జయించగలం’ అని అంబేద్కర్ తరచూ అంటుండే వారు. ‘‘సమాజం మారాలంటే దళితులకు విద్యా బోధన చేస్తే చాలునని, ఒక బానిసకు తను బానిస అన్న విషయం చెప్పగలిగితే చాలు, అతడే బానిసత్వానికి వ్యతిరేకంగా తిరగబడతాడు’’ అన్నది ఆయన నమ్మకం.
ఆకర్షణలకు బలి కావద్దు
ఈనాటి దళిత విద్యార్థులకు అంబేడ్కర్ జీవితం ఒక ఆదర్శం. మనం ఎంచుకున్న లక్ష్యానికి భిన్నమైన సుఖభోగాలు మనల్ని ఆకర్షిస్తూ వుంటాయి. ఏ పనికైనా పట్టుదల, కృషి, త్యాగం అవసరం. వాటిని నిర్బంధించే అంశాలు, ఆకర్షణలు మనిషి గమనాన్ని అడ్డుకుంటాయి. అందుకే వాటికి మనం దూరంగా ఉండాలి. అప్పుడే మన లక్ష్యానికి మనం చేరతాం అన్ని అన్నారు. ఇంకా ఆయన ‘‘దళిత విద్యార్థులు, దళిత యువకులు తాము జీవిస్తున్న దళిత వాడల నుండి కాలేజీలకు విశ్వవిద్యాలయాలకు వెళ్ళిన తర్వాత ఎదురయ్యే ఆకర్షణలకు బలి అవుతున్నారు. తమ లక్ష్య సిద్ధి నుంచి వారు తప్పుకుంటున్నారు. మనం పరుగు పందెంలో గెలవాలంటే ఎదురుగా వచ్చిన ఆకర్షణను గాక మన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోవలసి వుంది. మనం ఒకవేళ యూనివర్సిటీ ఫస్ట్ రావాలని అనుకుంటే అందుకోసం మనం కృషి చేయాలి కానీ విలాసాలకు, విందులకు మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు'' అని చెప్పారు. అంబేడ్కర్ ఇంగ్లాండ్‌లో కాని, జర్మనీలో కాని, ఎక్కడా విందులకు, వినోదాలకు హాజరు కాలేదు. అందువల్లే ఆయన తన లక్ష్యాన్ని చేధించకలిగారు. భారతదేశంలో ఎవరూ సాధించలేని విద్యా ప్రమాణాలను సాధించాలనేది ఆయన మొదటి లక్ష్యం. ఆయన అందుకు ఒక నిర్ధిష్టమైన క్రమాన్ని రూపొందించుకున్నారు. మన విద్యార్థులే కాదు ఉద్యోగ వర్గం కూడా అధ్యయన క్రమంలో అంబేడ్కర్‌ని తమ జీవితానికి అన్వయించుకోవలసి వుంది. ఆయన ప్రపంచ మానవునిగా ఎదిగారు, ప్రపంచ తత్వవేత్తలలో ఒకరిగా నిలిచారు. భారతదేశానికి ఎనలేని కీర్తి తెచ్చారు. ఆయన నిర్మించిన రాజ్యాంగమే మన దేశ భవిష్యత్తుకు దిక్సూచి. ఆయన మార్గంలో నడుద్దాం.
- డాక్టర్ కత్తి పద్మారావు
98497 41695