తెలుగు భాషకు.. ఇద్దరు కళాప్రపూర్ణులు

gidugu ramamurthy and gidugu venkata seethapathi fought for telugu

Update: 2023-08-28 13:59 GMT

తన జీవితాన్నంతటినీ వ్యావహారిక భాషోద్యమానికి, సవర భాషా వికాసానికి అంకితం చేసిన గిడుగు రామమూర్తిని 1938 సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీ 'కళాప్రపూర్ణ ' బిరుదు నిచ్చి గౌరవించింది. వారు ఆ సందర్భంలో ఈ గౌరవం నాకు కాదు. వ్యావహారిక భాషా వాదులందరికీ జరిగినట్లు భావిస్తున్నాను, అన్నారు.

రామమూర్తికి అన్ని రంగాలలో తోడుగా వుంటూ భాషా విషయంలో తండ్రితో సమంగా కృషి చేసిన గిడుగు వెంకట సీతాపతిని 1963లో ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. ఒకే యూనివర్సిటీ నుంచి విశిష్ట పురస్కారం కళాప్రపూర్ణను పొందిన ఘనత ఈ తండ్రీతనయులకు లభించింది.

వీరిరువురు కలిసి అంకిత భావంతో, అకుంఠిత దీక్షతో భాషోద్యమాన్ని నడిపారు. ఇద్దరిలో ఎవరి పేరున ఏ వ్యాసం ప్రచురణ అయినా అందులో ఇద్దరి కృషి ఉండేది. రామమూర్తి నోట్స్ తయారుచేస్తే సీతాపతి ఇంకా కొన్ని విషయాలు జోడించి రాసేవారట. రామమూర్తి ముక్కు సూటి మనిషి. వారు ఆవేశంతో, నిర్మొహమాటంగా, సూటిగా పండితులను విమర్శిస్తూ రాస్తే, సీతాపతి గారు దానిని సౌమ్యంగా మలచి రాసేవారట. వీరిద్దరూ భాషా పరంగానే కాదు సవర గ్రంధాల రచన లోనూ, సంఘ సంస్కరణోద్యమాల లోనూ, అప్పటి ఒరిస్సా ఆంధ్ర సరిహద్దు వివాదాల లోనూ 1906 నుండి 1936 వరకు కలిసే పనిచేసారు.

రామమూర్తి ఇల్లు ఎప్పుడూ ఒక పాఠశాలలా పిల్లలతో నిండుగా ఉండేది. వీరి కుమారుడు సీతాపతి, బుర్రా శేషగిరిరావు, చిలుకూరి నారాయణ రావు, కాళ్ళకూరి సూర్యనారాయణ గారలు నిత్యం వీరి ఇంట్లోనే ఉండి చదువుకునేవారు. తరవాత ఉద్యోగాలు చేస్తున్నప్పుడూ వీరంతా వేసవి సెలవలకు పర్లాకిమిడి వచ్చి రామమూర్తి దగ్గర భాషా శాస్త్రాలను అభ్యసిస్తూ ఉండేవారు.

వ్యావహారిక భాష గద్య రచనకే కాని పద్య రచనకు పనికి రాదన్న వారికి సమాధానంగా గిడుగు సీతాపతి 1907లో చిలకమ్మ పెళ్లి, రైలుబండి మొదలైన గేయాలు వ్యావహారిక భాషలో రచించారు. సీతాపతి ఇలా పద్యాలు రాస్తూ కూర్చోవటం రామమూర్తికి ఇష్టం ఉండేది కాదు. భాషా తత్వం, భాషా పరిణామం గురించి పరిశోధన చేయమనేవారు. వీరిద్దరూ కలిసి వివిధ తాళ పత్ర ప్రతులను దగ్గర పెట్టుకుని మహాభారతం ఆద్యంతం ఎన్నిసార్లు చదివారో లెక్క తెలియదుట.

రామమూర్తి భాషా సంబంధమైనదైనా, మరేదైనా తన అభిప్రాయాల విషయంలో ఎవరితో రాజీ పడేవారు కాదు. ఒక సారి సకలాంధ్ర కవిసమ్మేళనం సభలో ప్రసంగిస్తూ సభ వారి ఆహ్వాన పత్రిక గ్రాంధికంలో ఉందని వారి దృష్టికి తెచ్చి, అంత చిన్న పత్రంలో ఎన్ని తప్పులున్నాయో ఎత్తి చూపుతూ, దీనిని వ్యావహారిక భాషలో రాస్తే ఈ తప్పులు వచ్చి ఉండేవి కాదన్నారు.

రామమూర్తి జీవించి ఉండగా వ్యావహారిక భాషకు యూనివర్సిటీలలో ప్రవేశం కలగలేదు.1940 జనవరిలో వారు తమ కడపటి సందేశాన్ని ప్రజలకు సుమారు రెండు గంటల సేపు అందించారు. అప్పటికే వారి ఆరోగ్యం క్షీణించింది. తమ వాదాన్ని దేశంలో అందరూ అంగీకరించినందుకు వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పత్రికల వారు విద్య, విజ్ఞాన విషయాలు ప్రజలకు వ్యావహారికంలో అందిస్తున్నందుకు అభినందించారు. విశ్వవిద్యాలయాల చేత వాడుక భాషను అంగీకరింపజేసే బాధ్యతను పత్రికల వారికి అప్పజెపుతూ తమ ప్రసంగాన్ని ముగించారు. తదనంతర కాలంలో యూనివర్సిటీలు పరిశోధనా పత్రాలను వ్యావహారికంలో రాయటానికి అనుమతించాయి. గిడుగు వారికల నెరవేరింది. నేడు మనమంతా మన మనోభావాలను తేట తెల్లమైన జీవద్భాషలో రాయగలుగుతున్నామంటే కారణం గిడుగు రామమూర్తి అవిశ్రాంత కృషి, దీక్ష పట్టుదలలే!

-డా. చెంగళ్వ రామలక్ష్మి

Tags:    

Similar News