అనాథ నుంచి ఐటీ దాకా.. రుద్ర రచన జర్నీ
From Orphan to IT employee inspirational journey of Rudra Rachana
ఆదర్శాలు కలిగి ఉండడం, విలువలకు కట్టుబడి నడుచుకోవడం, ప్రజాసేవ చేయడమే మా లక్ష్యం అని, అంతిమంగా సమసమాజ సాకారమే మా స్వప్నం అని చాలామంది బాహాటంగా చెప్తారు. కానీ ఆచరణలో వాటిని నిబద్ధతతో పాటించే వారు మచ్చుకు అతి తక్కువ మంది మాత్రమే కనిపిస్తారు. ఉదాహరణకు నీట్ ప్రవేశ ఫలితాలు వెలువడగానే భావి వైద్య విద్యార్థులు అందరూ తాము పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని గొప్ప గొప్ప ప్రగల్భాలు పలుకుతారు. కాని వారు తీరా డాక్టర్లు అయ్యాక ఆచరణలో ఆయా ఉచిత వైద్య సేవల మాటలని విస్మరించి కాసులకు కక్కుర్తి పడి చివరకు శవాలను కూడా వదలకుండా జలగల లాగా పీల్చి పిప్పి చేస్తూ అన్యాయంగా దోచుకుంటూ కోట్లు సంపాదించుకుంటున్నారు. అలాగే సివిల్ సర్వీసెస్ ఫలితాలు వెలువడగానే భావి కలెక్టర్లు సైతం సేవ చేస్తామంటూ డాంబికాలు పలికి ఆచరణలో ఆ విధంగా వ్యవహరించరు. తద్వారా పేదలను చెప్పులు అరిగేలా తమ తమ కార్యాలయాలకు చీటికి మాటికి తిప్పుకుంటూ చివరకు వారు ఆత్మహత్యలు చేసుకునే విధంగా వ్యవహరించిన దాఖలాలెన్నో ఉన్నాయి. జరిగిన సంఘటనలు కడు బాధాకరం.
అభాగ్యులను ఆదుకోవాలని..
ఇలా దాదాపు ప్రతి డిపార్టుమెంట్ లోనూ ఇలాంటి ఆచరణకు నోచుకోని ప్రగల్భాలు పలికేవారు సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంటారు. అయితే ఇందుకు భిన్నంగా మరోపక్క చెప్పే ఆదర్శాలకు, చేసే పనులకు కట్టుబడి నడుచుకునే వారు ఆ రకంగానే ముందుకు సాగుతూ ఎందరికో స్ఫూర్తిదాయకం గాను, ఆదర్శవంతంగాను నిలుస్తుండడాన్ని సైతం మనం గమనించవచ్చు. ఈ కోవలోనే చెందిందే ఇటీవల తన నాలుగు నెలల జీతం నుండి అక్షరాలా లక్ష రూపాయలు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సమక్షంలో 'ముఖ్యమంత్రి సహాయనిధి'కి అందించిన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన రుద్ర రచన. ఆమె అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచి సర్వత్రా హర్షాతిరేకాలు పొందడం నిజంగా అభినందనీయం. తనలాంటి ఎందరో అనాథ అభాగ్యులను ఆదుకోవాలనే సదుద్దేశ్యంతో ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసినట్లు పేర్కొనడం గమనార్హం. మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలుగా కొనసాగుతున్న నేటి రోజుల్లో ఆమె చేసిన దాతృత్వం 'ఎడారిలో ఒయాసిస్సు'ని తలపించింది అని సృష్టంగా పేర్కొనవచ్చు.
తన వంతు బాధ్యతగా…
రుద్ర రచన తాను చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా అనేక కష్టాల కడగండ్ల లో కొట్టుమిట్టాడారు. ఆమె చదువు సజావుగా సాగడానికి అనేక విషమ పరిస్థితులను అధిగమించాల్సి వచ్చింది. ఈ రకంగా ఒక దశలో ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు, హాస్టల్ వసతి కోసం ఆమె అనేక అవస్థలు అధిగమించి చివరకు ఐ.టి. శాఖా మంత్రి కేటీఆర్ సహాయంతో ఇంజనీరింగ్ విద్యని విజయవంతంగా పూర్తి చేశారు. ఆమె తన ప్రతిభతో ఎట్టకేలకు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లలో ఏకంగా నాలుగు ప్రముఖ కంపెనీలలో ప్లేస్‌మెంట్ సాధించి.. కార్పొరేట్ కంపెనీలో ఉన్నత ఉద్యోగాన్ని పొందింది. ఉద్యోగం సాధించాక తన జీవితం తాను చూసుకోక అనాథల అభ్యున్నతి కోసం కృషి చేయాలని దృఢ సంకల్పంతో నిర్ణయించుకొని ముందుకు సాగింది.ఇది అభినందించదగ్గ, ఆహ్వానించదగ్గ విషయం.
అనునిత్యం పేదరికంతో కొట్టుమిట్టాడుతూ అనేక సామాజిక సంఘర్షణలని చవిచూడడం మూలంగా రుద్ర రచన సామాజిక అసమానతలను సరిగ్గా అర్థం చేసుకొని వాటిని పరిష్కరించే దిశగా తన వంతు బాధ్యతాయుతంగా వ్యవహరించాలనుకోవడం ఆమె సామాజిక సేవా దృక్పథాన్ని వెల్లడిస్తుంది. అందులో భాగంగానే లక్ష రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసింది. 'సమాజంలో ఆదరణకు నోచుకోని అనాధ పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వారిలో కొందరికైనా సాయం చేయాలి, ఆదుకోవాలి' అనేది తన ఆశయమని పేర్కొనడం ఆమె నిరుపమాన సేవా నిరతికి అద్దం పడుతుంది. 'ప్రజా సేవ' లక్ష్యంగా సివిల్ సర్వీసెస్ పరీక్షలలో విజయం సాధించే దిశగా ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని అని ఆకాంక్షిద్దాం.
- జె.జె.సి.పి. బాబూరావు
రీసెర్చ్ స్కాలర్
94933 19690