సొక్కం జననేత సోలిపేట రామన్న

Former MP Solipeta Ramachandra Reddy passes away

Update: 2023-07-06 00:15 GMT

నూనూగు మీసాల వయసులో ఒంటబట్టిన కమ్యూనిస్టు భావజాలాన్ని ఆచరణ రూపంలో తుది శ్వాస వరకు నిలుపుకున్న అరుదైన జననాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి. ఆయన గత నెల 27‌న కన్ను మూశారు. పార్టీ ఏదైనా, పదవి ఏదైనా ఆయన ఆలోచనంతా సొంత భావాలతో, వామపక్ష ధోరణిలోనే సాగేది. 88 ఏళ్ల వయసులోనూ ఈ మధ్య జరిగిన గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర సభల్లో పాల్గొని ప్రసంగించడం దానికి ఉదాహరణ. ఆ సభలో ఆయన గట్టిగా కోరినట్లు పోడు రైతులకు ప్రభుత్వం పట్టాలు పంచి సోలిపేట ఆకాంక్షను నెరవేర్చింది.

చదువును పక్కన పెట్టి పార్టీ కోసం..

92 ఏళ్ల ఆయన జీవితంలో సుమారు 70 ఏళ్లు జనంలోనే గడిచింది. సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో రామచంద్రారెడ్డి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అలా విద్యార్థి దశలోనే సోషలిస్టు భావజాలానికి ఆకర్షితుడైనారు. 1952లో భారత కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించింది. ఎన్నికల ప్రచారంలో క్రియాశీల కార్యకర్తల అవసరం వల్ల రామచంద్రారెడ్డి చదువును పక్కనపెట్టి పూర్తి కాలం పార్టీ తరపున పనిచేశారు. సాహిత్యం కళలపై పట్టు ఉన్న ఆయన నాటకాలు రచించి ఎన్నికల ప్రచార వేదికలపై ప్రదర్శించారు. పార్టీ అభ్యర్థుల గెలుపుకు ఎంతో కృషి చేసిన రామచంద్రారెడ్డి కార్యదక్షతను, క్రమశిక్షణను మెచ్చుకొన్న దుబ్బాక ఎమ్మెల్యే గురువారెడ్డి ఆయనను రాజకీయాల వైపు ఆహ్వానించారు. అంతటితో చదువు ఆపేసి రామచంద్రారెడ్డి గ్రామ స్థాయిలో తమ రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. ఇరవై నాలుగేళ్ల వయస్సులోనే ఆయన తమ సొంత గ్రామమైన చిట్టాపూర్ సర్పంచిగా 1957లో ఎన్నికై రెండు పర్యాయాలు కొనసాగారు. ఆ తర్వాత 1964 దుబ్బాక సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. రెండేళ్ల పాటు సిద్దిపేట వ్యవసాయ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. 1972లో రెడ్డికి కాంగ్రెస్ పిలిచి టికెట్ ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో దొమ్మాట ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో హైదరాబాద్‌కు మకాం మార్చి ఎమ్మెల్యే పనులతో పాటు సోషలిస్టు స్టడీ సెంటర్ కన్వీనర్‌గా కొనసాగారు. వామపక్ష యువతకు వారి ఇల్లు కేంద్రంగా ఉండేది. ఇంట్లోనే బ్యానర్లు, ప్లకార్డులు సిద్ధమయ్యేవి. ఆ సంస్థ తరపున బ్లాక్ మార్కెటింగ్ పై పోరాటాలు జరిపి అక్రమ నిల్వదారులను అరెస్టు చేయించారు. ఆ తర్వాత కొంతకాలం మెదక్ జిల్లా సహకార బ్యాంకు చైర్మన్‌గా ఉన్నారు.

వయసును లెక్కచేయకుండా..

1978 నుండి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా గ్రామంలోనే ఉంటూ రైతుల్లో రైతుగా వ్యవసాయం చేశారు. 1984లో ఎన్టీ రామారావు ఆహ్వానంతో రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1987 నుండి పదేళ్ల పాటు టీడీపీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తిరిగి ప్రత్యక్ష ఎన్నికల్లోకి రమ్మని ఎన్టీఆర్ కోరినా నామినేటెడ్ పదవి చాలన్నారు. అలా నామినేటెడ్ పదవి అందుకొని 1994లో వెనుకబడిన జిల్లా మెదక్ నుంచి తొలి వ్యక్తిగా రాజ్యసభలో అడుగు పెట్టారు. 1996-2002 వరకు సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. రామచంద్రారెడ్డి తన పదవీ కాలంలో 877 సార్లు ప్రశ్నలు, ప్రస్తావనలు, చర్చల్లో పాల్గొన్నారని రాజ్యసభ రికార్డుల్లో ఉంది. ఆ సమయంలో ఆయన ఎన్నో పార్లమెంట్ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. స్వతహాగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే గుణం సోలిపేట వ్యక్తిత్వంలో ఉంది. ఏ జెండా కింద ఉన్నా, తనలోని కమ్యూనిస్టు మూలాలకు న్యాయం చేస్తూ సాగడం ఆయన ప్రత్యేకత. భారత్ చైనా మిత్ర మండలితో ఆయన అనుబంధం విడదీయరానిది. వయసును లెక్క చేయకుండా వారి కార్యక్రమాల్లో పాల్గొంటూ చైనా జీవన విధాన వైవిధ్యాన్ని, భారత్ చైనా మైత్రి మధ్య అమెరికా పాత్రను చక్కగా వివరించేవారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలపై ఉద్యమాలకు నాయకత్వం వహించే నాయకులకు, కార్యకర్తలకు ఆయన తోడుగా ఉండేవారు. ఆ క్రమంలో రామచంద్రారెడ్డి ఓపిడిఆర్, డి‌ఎస్‌ఓ లాంటి వామపక్ష సంస్థల కార్యక్రమాలకు హాజరయ్యేవారు. వయసు పైబడినా ఆయన ప్రసంగాలు ఉద్వేగపూరితంగా ప్రేరణాత్మకంగా ఉండేవి. ఎన్నో పుస్తకాలు చదివిన ఆయన మేధస్సు వాటిలో ప్రస్ఫుటించేది. తాను పాల్గొన్న ప్రతి సభలోను పేదరికం, నిరుద్యోగం, విద్య, వైద్యం లాంటి మౌలిక సమస్యల గురించి ప్రస్తావిస్తూ సంఘటిత ఉద్యమాల నిర్మాణమే దీనికి పరిష్కారం అని ఘంటాపథంగా చెప్పేవారు. పాతతరం రాజకీయాలకు ప్రతినిధిగా, కొత్త తరానికి రాజకీయ గురువుగా ఆయన రాజకీయ ప్రస్థానం ఆదర్శనీయం.

బి.నర్సన్

9440128169

Tags:    

Similar News