ఈ - పంచాయితీ ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి!

E- Panchayat operators should be given job security by Government

Update: 2023-09-27 23:15 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఈ-పంచాయతీ కంప్యూటర్, మండల కంప్యూటర్ ఆపరేటర్ల గోడు అరణ్య రోదనగా ఉంది. వారికి ఉద్యోగ భద్రత లేదు, జీతం లేదు. వారి సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. అన్ని శాఖల ఉద్యోగుల జీతాలు, ఉద్యోగ భద్రత కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వీరి పట్ల మాత్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది. సాంకేతికతను వినియోగించుకొని గ్రామ పంచాయితీలలో ప్రజలకు అందిస్తున్న సేవలను కంప్యూటరీకరించడానికి రాష్ట్రంలో ఈ- పంచాయితీ కార్యక్రమాన్ని 2014 సంవత్సరంలో ప్రారంభించింది ప్రభుత్వం. దీనికి కొన్ని గ్రామాలను క్లస్టర్ గా ఏర్పరచి అక్కడ ఆపరేటర్‌ను, మండల అధికారిని, జిల్లాలో ప్రాజెక్ట్ అధికారిని నియమించారు. దీంతో రాష్ట్రంలో 1619 మంది ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లూ పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు పరిచే డేటా, గ్రామ పంచాయితి విధులు, ఎంపీటీసీ ఎన్నికలు, ఈ-గ్రామ్ స్వరాజ్, ప్లాన్ ప్లస్, ఆస్తుల జియో ట్యాగ్, లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ, పంచాయితీ ఆదాయ-వ్యయాలను ఎప్పటికప్పుడు కంప్యూటరీకరణ చేయడం వీరి డ్యూటీ. పంచాయతీ కార్యదర్శులు చేసే పనులన్నింటిని ప్రభుత్వ వెబ్సైట్లలో నమోదు చేస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థలో వీరు కీలకపాత్ర పోషిస్తున్నారు. మన రాష్ట్రంలోని గ్రామాలకు జాతీయ స్థాయిలో అవార్డులు రావడంలో వీరిదే ముఖ్య భూమిక.

ప్రజల అభ్యున్నతి కోసం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చినా వాటిని అమలు పరచడంలో ముందు వరుసలో ఉండి సమర్థవంతంగా పని చేస్తూ గత 9 సంవత్సరాల నుండి వెట్టి చాకిరీ గురి అవుతున్నారు. అందుకే వీరికి ఇతర ఉద్యోగుల వలె పే స్కేల్ అమలుచేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. మహిళా ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలి. ఉద్యోగులందరికీ ఆరోగ్య బీమా కల్పించి, ఆరోగ్య భద్రతను కల్పించాలి. ఉద్యోగులలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలి. వారి న్యాయమైన అభ్యర్థనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.

- రావుల రాజేశం

98488 11424

Tags:    

Similar News