డీప్ ఫేక్.. ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న ప్రధాన అంశం. టాప్ సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రజలు దీని బారిన పడుతున్నారు. సెలబ్రిటీల ఫొటోలు మార్పింగ్ చేయడం, వీడియోల్లో ఫేస్‌ను మార్చి అశ్లీలంగా చూపించడం, వాయిస్‌ను మార్చి ఆన్ లైన్ గేమింగ్ వంటి ప్లాట్ ఫామ్స్‌ను ప్రమోట్ చేయడం వంటివి చేస్తున్నారు. ప్రధాన మంత్రి నుంచి పల్లెల్లో నివసించే సామాన్య పౌరుల దాకా ఈ డీప్ ఫేక్ బాధితులుగా మిగులుతున్నారు.
ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినాక డీప్ ఫేక్‌ల బెడద నిత్యకృత్యమైంది. ఏఐ సాంకేతికతను ఉపయోగించి సెలబ్రిటీల ఫేస్‌లను చాలా సులభంగా మార్ఫింగ్ చేస్తున్నారు. ముఖంతో పాటు హావభావాలు, ముఖ కవలికలను అచ్చు గుద్దినట్టు దించేస్తున్నారు. దీంతో ఒరిజినల్ వీడియోలకు ఫేక్ వీడియోలకు కొంచెం కూడా తేడా లేకుండా చేస్తున్నారు. వాయిస్‌లను సైతం ఒరిజినల్‌గా మాట్లాడినట్టే సృష్టిస్తున్నారు.
దీని ఉద్దేశమే మారుతోందా?
ఈ టెక్నాలజీని క్రియేటివ్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రూపొందించారు. అసాధ్యం అయిన వాటిని ఈ టెక్నాలజీతో సుసాధ్యం చేసి చూపించవచ్చు. యమదొంగ అనే సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ తో స్టెప్పులు వేశాడు. ఇలా చాలా మంది నటీనటులు చనిపోయాక తెరపై తళుక్కున మెరిశారు. ఇదంతా డీప్ ఫేక్ ద్వారానే సాధ్యమైంది. వీటిని మంచి కోసం వాడినంత వరకు బాగానే ఉంటుంది. కానీ చాలా మంది కేటుగాళ్లు దీన్ని ఆసరాగా చేసుకుని ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మంచికోసం తయారు చేసిన ఏఐ టెక్నాలజీని ఇతరులను మోసం చేయడానికి, సంస్థలు, ప్రభుత్వాలను మోసం చేయడానికి వినియోగిస్తున్నారు.
దేశాధినేతలకూ తప్పని ముప్పు..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 2020 ఎన్నికల సమయంలో పలుమార్లు డీప్ ఫేక్ బారిన పడ్డారు. మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ సైతం డీప్ ఫేక్ మాయాజాలంతో ఇబ్బందులు పడ్డారు. యుద్ధ సమయంలో పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం సంచలన ప్రకటనలు చేసినట్లు ఈ ఫేకర్లు చాలా పుకార్లే సృష్టించారు. ఆ మధ్య ఒక జర్నలిస్టు బిల్ గేట్స్‌ను చాలా సీరియస్‌గా ప్రశ్నలు అడిగి ఇబ్బందులు పెట్టినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. అది కూడా డీప్ ఫేక్ మాయాజాలమే. ఇటీవల చాలా మంది బాలీవుడ్, టాలీవుడ్ సెలెబ్రిటీలు వివిధ రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ డీపీ ఫేక్ గాళ్లు చేసిన ఘన కార్యాలే.
కఠిన చట్టాలు తేవాల్సిందే..
డీప్ ఫేక్‌ను అరికట్టడానికి ప్రత్యేకమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. బలమైన చట్టం లేకుంటే డీప్ ఫేక్‌ను తయారు చేసేవాళ్లు మరింత విచ్చలవిడిగా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. దీని ప్రభావం అన్ని వ్యవస్థలపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐటీ చట్టంలోని 66డి, 67, 67ఎ కింద కంప్యూటర్ ద్వారా మోసం చేయడం, వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించడం అనే నేరాలకు జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించవచ్చు. ఐపీసీ సెక్షన్ 500 కంద పరువు నష్టం కలిగించినందుకు శిక్షించవచ్చు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే డీప్ ఫేక్ ఘటనలను అదుపు చేయడానికి కఠిన చట్టాలు తీసుకురావాలి. ప్రజలకు అవగాహన కల్పించాలి.
అప్రమత్తత అవసరం..
ఒక వీడియో, ఫొటో, స్పీచ్ చూడగానే దాన్ని నిశితంగా పరిశీలించాలి. ఫేక్ కంటెంట్ అని అనుమానం ఉంటే దాన్ని ఇతరులకు ఫార్వర్డ్ చేయకూడదు. అలాంటి మీ మొబైల్‌కు వస్తే వెంటనే డిలీట్ చేయాలి. వ్యక్తిగత ఆడియో, వీడియోలను ఇతరులకు పంపకూడదు. బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు, అకౌంట్ నంబర్లను ఫోన్లలో ఎవరికీ చెప్పకూడదు. మీ ఫోన్ నుంచి సింగిల్‌గా ఉన్న ఫొటోలు షేర్ చేయకపోవడం మంచిది. మీ సోషల్ మీడియా అకౌంట్లకు డీపీలుగా మీరు సింగిల్‌గా ఉన్న ఫొటోలు పెట్టుకోకూడదు.
- కాసాని కుమారస్వామి
96762 18427