జగిత్యాల ల్యాండ్ మార్క్ ఎల్జీ రామ్
BRS MLC L Ramana Father LG RAM Passed Away
దొరలు, పెత్తందారులు మినహా కుల వృత్తులపై ఆధారపడి జీవించే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులకు వ్యాపారమంటే తెలియని కాలమది.. అలాంటి సమయంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి వ్యాపారం చేయడం పక్కన పెడితే కనీసం జీతంకు పని కుదిరితే చాలనుకోవాల్సిన పరిస్థితులు. ఇలా కుల వృత్తులు మరుగున పడుతున్న సమయంలో వ్యాపారాల్లో రాణించి మరి కొందరికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఎలగందుల గంగారం. ఈయన ఎలా ఉంటాడో తెలియని ఎంతో మంది ప్రజానీకానికి ఎల్జీ రామ్ పేరు మాత్రం ఎప్పుడు నోట్లో నానుతూ ఉంటుంది. ఎల్జీ రామ్‌కు జగిత్యాల జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. వ్యాపారాలలో రాణించడం ఒక ఎత్తు అయితే ఆయన నిర్మించిన ఎల్జీ రామ్ లాడ్జి జగిత్యాలకే ల్యాండ్ మార్క్‌గా నిలిచిందటే ఆయన ప్రాబల్యం అర్థం చేసుకోవచ్చు. గత ఆరు దశాబ్దాలుగా ఓ వెలుగు వెలిగిన ఎల్జీ రామ్ వయస్సు రీత్యా ఆరోగ్య సమస్యలతో సోమవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు.
1933 నవంబర్ 06 న జగిత్యాల జిల్లా కేంద్రంలో జన్మించిన ఎలగందుల రామ్. యుక్త వయస్సు నుండే వినూత్న ఆలోచనా ధోరణిలో ఉండే వారు. వెనుకబడిన పద్మశాలి సామాజిక వర్గం నుండి వచ్చిన రామ్. వ్యాపార రంగంలో సాధించిన పేరు ప్రఖ్యాతులతోపాటు నేటి తరం వ్యాపారవేత్తలకు మార్గదర్శకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పటికీ వారిపై ఆధారకుండా తన పట్టుదల, స్వయం కృషిని నమ్ముకుని వ్యాపారంలో రాణించి ఆర్థికంగా మరింత పరిపుష్టమయ్యాడు. తొలి తరం ఎల్ఐసీ ఎజెంట్‌గా జీవిత ప్రయాణం మొదలు పెట్టిన రామ్ తక్కువ కాలం లోనే మంచి పేరు సంపాదించారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఆవశ్యకతను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించి పాలసీలను చేరువ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆయన వల్ల పాలసీదారుల కుటుంబాలకు కలిగిన లాభాలతో ప్రజల ఆదరణతో పాటు ఎల్ఐసీ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. తనకు తానుగా ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పటికీ ఇంకా ఏదో సాధించాలని నిరంతరం తపన పడుతుండే వాడని ఆయన సన్నిహితులు చెపుతుంటారు . అలనాటి ప్రజలకు టెక్నాలజీని దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ లాంటి మహా నగరాలకు మాత్రమే పరిమితమైన రేడియో, టేప్ రికార్డర్, టేబుల్ ఫ్యాన్ వ్యాపారాన్ని 1960 ల్లోనే జగిత్యాలకు పరిచయం చేసిన ఘనత ఆయన సొంతం. మొదటి నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన రామ్, ఆయన కొడుకు రమణను(MLC RAMANA) మాత్రం పాలిటిక్స్‌కు పరిచయం చేశారు. రమణ పొలిటికల్ సక్సెస్ వెనుక తండ్రి ఇచ్చిన సహకారం మరువలేనిదని ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఆయన పేరే ఓ ల్యాండ్ మార్క్
ఆయా ప్రాంతాల్లో పురాతన కట్టడాలు.. చారిత్రాత్మక ప్రదేశాలు.. దేవాలయాలు.. బస్టాండులు ల్యాండ్ మార్క్‌గా ఉంటాయి..కానీ జగిత్యాలలో(jagityal) మాత్రం ఆయన పేరే ఓ ల్యాండ్ మార్క్‌గా నిలిచింది. అడ్రస్ చెప్పడానికి బస్టాండ్ పేరును వాడటం సాధారణంగా వింటాం కానీ జగిత్యాల కొత్త బస్టాండ్ అడ్రస్ కావాలంటే ఎల్జీ రామ్ లాడ్జి పక్కనే అని చెప్తారు. సత్రాలు, వసతి గృహాలు మాత్రమే అందుబాటులో ఉండే రోజుల్లోనే 1978లో జగిత్యాల నడిబొడ్డున నిర్మించిన లాడ్జి అప్పట్లో సంచలనమనే చెప్పాలి. ఒకప్పుడు మహానగరాలలో మాత్రమే లాడ్జీలు కనిపించేవి. కానీ ముందు చూపుతో అలోచించే వ్యక్తిగా పేరున్న రామ్ డేరింగ్ స్టెప్‌తో నిర్మించిన లాడ్జీ పట్టణంలో అత్యంత ప్రాముఖ్యత సాధించింది. బిజినెస్ కోణంలో మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లోనే వసతి కల్పించిన ఈ లాడ్జిని ఆయన పేరుతోనే పిలిచేవారు. ఈ క్రమంలో ఎలగందుల రామ్ పేరు కాస్త ఎల్జీ రామ్ గా (LG RAM) మారింది. జగిత్యాలలో మొదటి లాడ్జి కూడా ఇదే కావడం విశేషం. అప్పటి నుండి ఇప్పటికీ జగిత్యాలకు వచ్చిన ప్రముఖుల దగ్గర నుండి మధ్యతరగతి ప్రజల వరకు ఎల్జీ రామ్ లాడ్జీ ఆశ్రయం కల్పిస్తూనే ఉంది. జగిత్యాలలో ఆయనను చూడని వ్యక్తులు ఉంటారేమో గానీ ఎల్జీ రామ్ పేరు తెలియని ప్రముఖులు, వ్యక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.
(ఎలగందుల రమణ (ఎంఎల్‌సి) తండ్రి ఎలగందుల గంగారం మృతికి సంతాపసూచకంగా)
కోల హరీష్ గౌడ్
88970 22882