స్వీయ తప్పిదంతో.. గ్రాఫ్ తగ్గించుకున్న బీజేపీ!
BJP reduced the graph in Telangana due to its own fault
రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకు వివిధ రకాలైన కారణాలపై ఆధారపడి ఉంటుంది. దేశంలోని ఉత్తరాది ప్రాంతంలో ‘హిందుత్వ’ ఎజండా అక్కడ ప్రముఖమైన నినాదం. అదే దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి ఓటు బ్యాంకు కులాలు, జాతుల మధ్య విభజించబడి ఉంటుందని జాతీయ పార్టీలు గుర్తించాలి. ఉత్తరాది రాష్ట్రాలలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలోనున్న బీజేపీ... దక్షిణాది ప్రాంతంలోని ఓటర్ల నాడిని పట్టుకోలేకపోతుంది. మొన్నటివరకు దక్షిణాది ప్రాంతంలోని కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అక్కడ కూడా ఉత్తరాది ఎజెండాతో అధికారాన్ని చేజార్చుకుంది. దీంతో ఎలాగైనా దక్షిణాదిన పాగా వేయాలని తహతహలాడుతున్న బీజేపీకి అందివచ్చిన అవకాశంగా, రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సదవకాశంగా మార్చుకోవాలి. నాలుగైదు నెలల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను జారవిడుచుకోకుండా, రాష్ట్రంలో పాగా వేయాలని, దీనికోసం వ్యూహ ప్రతివ్యూహాలను పన్నుతూ, ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, అధికారమే పరమావధిగా కష్టపడి విజయం సాధించి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఇంకా పట్టుకోల్పోలేదనే సంకేతాన్ని పంపడంతో పాటు, వచ్చే పార్లమెంటు ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాల నుండి ఎక్కువ ఎంపీ సీట్లు సాధించుకోవాలని వ్యూహరచన చేస్తుంది బీజేపీ కేంద్ర నాయకత్వం. ఇందులో భాగంగా ఎలాంటి ఎజెండాను తయారు చేయాలి, ప్రజల్లోకి ఏయే అంశాలు తీసుకువెళ్ళాలి అనే అంశంపై అమిత్ షా టీం దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
రెండు నుండి మూడో స్థానానికి..
నిజానికి తెలంగాణ పునర్విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడానికి సుష్మా స్వరాజ్ ఎంతో శ్రమ పడ్డారనేది వాస్తవ సత్యం. దానిని తెలంగాణ సమాజం కూడా గుర్తించింది. నాటి కృషిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు వినియోగించుకోలేకపోయాయి. ఎందుకంటే నాడు తెలంగాణ తెచ్చింది కేవలం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అని ప్రజలు నమ్మారు. అందుకే కేసీఆర్‌కు రెండుసార్లు పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. నాడు రాష్ట్ర అవతరణ కోసం బీజేపీ చేసిన కృషిని నాటి రాష్ట్ర బీజేపీ రథసారధులు గ్రామస్థాయి వరకు తెలంగాణ అంశాన్నీ తీసుకువెళ్ళకపోయారు. కేవలం హిందూత్వ వాదం మీదనే బీజేపీ పునాదులు నిర్మిద్దామని బావించిన ఆ పార్టీ సారథుల ఆలోచన తెలంగాణలో అమలు కాలేకపోయింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా వారు సామాన్యుడి చెంతకు చేర్చలేకపోయారు. అది గమనించిన కేంద్ర నాయకత్వం రాష్ట్ర సారధిని మార్చి ఆ స్థానంలో బండి సంజయ్‌కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పజెప్పడం జరిగింది.
బండిని రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించాక ఊహించని విధంగా క్షేత్రస్థాయిలో బీజేపీ పుంజుకుంది. పార్టీ పట్ల ఆదరాభిమానాలు పెరిగి పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పైకి పోయింది. సంజయ్ బీజేపీ సంకల్ప సభల పేరుతో గ్రామీణ స్థాయి కార్యకర్తల వరకు వెళ్ళగలిగాడు. కేంద్ర ప్రభుత్వ విజయాలను తెలంగాణ భాష, యాసలను ఉపయోగించి సామాన్య కార్యకర్తలను కదిలించగలిగాడు. అప్పటికే నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే విజయంతో రాష్ట్రంలో విజయఢంకా మోగించింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి చెమటలు పట్టించి మెజార్టీకి చేరుకోగలిగింది. తెలంగాణ సమాజంలో తన ఓటు బ్యాంకును పెంచుకోవడంలో బీజేపీ గ్రాఫ్ పెంచడంలో బండి సంజయ్ ముఖ్య భూమిక పోషించాడు. ఒకానొక సందర్భంలో అధికార పక్షానికి ప్రధాన విపక్షం కాంగ్రెస్ కాదు బీజేపీ మాత్రమే అనే స్థాయికి పార్టీని తీసుకొని రావడం జరిగింది. ఆ ఊపుని చూసే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి బహిష్కరణకు గురై, దిక్కుతోచని స్థితిలో ఉన్న ఈటల రాజేందర్ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపడానికి కారణం అయ్యింది. ఆ సమయంలో ఈటెల, సంజయ్ జోడెడ్లలా పనిచేస్తే, తెలంగాణలో అధికారం ఖాయమనే ఆశ కార్యకర్తల్లో వచ్చింది. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం చాలామందికి మింగుడు పడని అంశం పైగా బీఆర్ఎస్‌తో సన్నిహితంగా మెలుగుతారనే పేరున్న కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో పార్టీలోని కార్యకర్తలు నైరాశ్యంలోకి వెళ్ళారు. ఆ వెంటనే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి వంటి కారణాలతో అప్పటివరకు రాష్ట్రంలో అమాంతంగా పెరిగిన బీజేపీ గ్రాఫ్ రెండో స్థానం నుండి మూడో స్థానానికి పడిపోయిందనే అభిప్రాయం సామాన్య కార్యకర్తలలో ఉంది.
ఆ సంప్రదాయానికి ముగింపు పలికి..
ఇలా బీజేపీ చేసిన తప్పిదానికి ఆ పార్టీకి లాభం కంటే ఎక్కువ నష్టాన్నే మిగిల్చింది. ఇదే సమయంలో కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఊపుమీదున్న కాంగ్రెస్ నాయకత్వం, విపక్షాలపై విరుచుకుపడడం, దూకుడు స్వభావాన్ని పెంచడం, కలిమి గల నాయకులందరూ ఐక్యంగా మెలగడం రాష్ట్రంలోని కాంగ్రెస్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా పెంచింది. ఇలా అనేక తప్పిదాలతో స్వయంకృతాపరాధంతో వెనుకబడ్డ బీజేపీ, తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఉమ్మడి ఆంధ్రలోనూ, ఇప్పటి తెలంగాణలో ఏ పార్టీ కూడా ఇప్పటివరకు చేయని సాహస కార్యం బీజేపీ చేయాలి. అది తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఎన్నో త్యాగాలు చేసి అమరత్వాలను ముద్దాడిన బహుజన బిడ్డలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించడం ఒకటైతే, అగ్రవర్ణ పాలక పార్టీలుగా భావిస్తున్న కాంగ్రెస్, టీఆర్ఎస్‌లను దెబ్బతీయడానికి, జనాభా దామాషా ప్రకారం అత్యధిక జనాభా కలిగిన బీసీలకు ముఖ్యమంత్రి పదవి అదేవిధంగా సామాజికంగా వెనుకబాటుకు గురైన ఎస్సీ, ఎస్టీలకు చెరొక ఉప ముఖ్యమంత్రి పదవి అనే నూతన ఫార్ములాను అనుసరిస్తే అధికారంలోకి రావడం ఖాయమని చెప్పవచ్చు. అయితే బీజేపీ పార్టీ అధినాయకత్వం ఇంతకుముందు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పటికీ కూడా సీఎం అభ్యర్థిని ముందు ప్రకటించదు, కానీ ఆ సాంప్రదాయానికి తెరదించి తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ముందే ప్రకటించినట్లయితే.. తెలంగాణ ప్రజల్లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఓటు బ్యాంకు బీజేపీ పార్టీకి మళ్ళే అవకాశం ఉంది. ఇటీవల నిర్వహించిన ఒక సర్వే సైతం రాబోవు ఎన్నికల్లో పార్టీ ఏదైనా ఒక బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ పార్టీకీ 10% నుంచి 11% వరకు ఎక్కువగా ఓట్లు ఎక్కువగా వస్తాయని వెల్లడించింది. రాష్ట్ర బీజేపీలో బీసీ నాయకత్వానికి కొదవేమీ లేదు, తెలంగాణాలో బీజేపీ పార్టీని చాలా చోట్ల విజయతీరాలకు చేర్చి పటిష్టంగా పార్టీని నిలిపినటువంటి బండి సంజయ్ కుమార్, సీనియర్ నాయకులు లక్ష్మణ్, ఉద్యమ సమయంలో ఎంతో పేరు గాంచినటువంటి ఈటెల రాజేందర్ తెలంగాణ బీజేపీలో చెప్పుకోదగిన నాయకులు! బీజేపీలో ఇప్పటివరకు ఉన్న సీఎంను ముందు ప్రకటించకపోవడం అనే సంప్రదాయానికి తెరదించి ఒక బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ముందే ప్రకటించినట్లయితే, బడుగు బలహీన వర్గాల ఓటు బ్యాంకు బీజేపీ పార్టీకి మళ్ళే అవకాశం ఉంది.
దర్శనం దేవేందర్
పొలిటికల్ అండ్ సోషల్ ఎనలిస్ట్
99896 51768