మానసిక ఆరోగ్యం.. సార్వత్రిక మానవ హక్కు!

మానసిక ఆరోగ్యం ప్రజలందరికీ ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరికి అది పొందే హక్కు ఉంది. మనస్సుకు అసాధారణమైన శక్తి ఉంది.

Update: 2023-10-10 01:00 GMT

మానసిక ఆరోగ్యం ప్రజలందరికీ ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరికి అది పొందే హక్కు ఉంది. మనస్సుకు అసాధారణమైన శక్తి ఉంది. ఒక వ్యక్తి ఆలోచన గుణం, ప్రవర్తించే విధానం, భావవ్యక్తీకరణలను అతని, ఆమె మానసిక ఆరోగ్య స్థితిని బట్టి అంచనా వేయవచ్చు. చివరకు సమాజ సంబంధ బాంధవ్యాలు కూడా వారి మానసిక పరిస్థితి పైన ఆధారపడతాయి. ప్రపంచంలోని ప్రతి 8 మందిలో ఒకరు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరిలో చాలా మంది అనేక రకాల మానవ హక్కుల ఉల్లంఘనలకు, వివక్షకు గురవుతున్నారు, ఇది వారి శారీరక ఆరోగ్యం, వారి జీవనోపాధిపై ప్రభావం చూపుతుంది. వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ చొరవతో 1992 నుంచి ప్రతి ఏటా అక్టోబర్‌ 10 వ తారీఖున మానసిక ఆరోగ్య సంరక్షణ, కనీస మానసిక ఆరోగ్యం‌పై అవగాహన కల్గించే నిమిత్తం ప్రపంచ మానసిక ఆరోగ్య దినం జరుపుకుంటున్నాం.

ఎందుకిలా జరుగుతోంది?

అనాదిగా ఆచారాలకు విలువ ఇచ్చేవారు కొందరు ఇప్పటికీ ఏదో ఒక చెడు సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. కుటుంబ సమస్యలు, శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, సామాజిక అలవాట్లు, కట్టుబాట్లు, మూర్ఖత్వంతో పట్టుదలను వదలని అమాయకపు మనుషులు తమ మానసిక స్థిరత్వాన్ని కోల్పోతున్నారు. మానసిక ఆరోగ్యమంటే రుగ్మతలు లేని మానసిక సమతుల్యత స్థితి.. అని అర్థం. అభివృద్ధి బాటలో పయనించడానికి మానసిక ఆరోగ్యం తప్పనిసరి. మనసు అనారోగ్యానికి గురైనప్పుడు గ్రహణశక్తి ఆలోచనలు ప్రవర్తనలు ఉద్వేగాల నియంత్రణ పరస్పర సంబంధాలలో అవాంఛనీయ మార్పులు చోటు చేసుకుంటాయి. అసాధారణ వ్యక్తులుగా వ్యతిరేక ముద్ర పడుతుంది. బయట వాళ్ల నుంచే కాదు ఇంటి వాళ్ళనుంచి కూడా నిరాదరణ ఎదురవుతుంది. పరిమితికి మించి అనవసర ఒత్తిడి, మనో వ్యాఖ్యలత, స్కిజోఫ్రీనియా మొదలుకొని ఆల్జీమర్స్ వరకు రకరకాల మానసిక అనారోగ్యాలకు గురికావచ్చు. మెదడులోని రసాయనిక పదార్థాల అసమతుల్యత, జన్యు సంబంధమైన లోపాలు, గర్భంలో పెరుగుతున్నప్పుడే కలిగే అనారోగ్యాలు, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, మెదడులోని లోపాలు, మెదడుకు తీవ్ర గాయాలు, దీర్ఘకాలిక మాదకద్రవ్యాల వాడకం, తీవ్ర మానసిక ఒత్తిడి, లోప భూష్టమైన పిల్లల పెంపకం, కడు పేదరిక కుటుంబాలు వంటి కారణాలు ఆలోచన విధానాలను, మనిషి ప్రవర్తనలను ప్రభావితం చేస్తాయి. చివరికి వాళ్ళ జీవితాలను అపసవ్య దారివైపు నడిపిస్తాయి.

కొందరికే పరిమితమా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం మానసిక వ్యాధులు ప్రపంచ దేశాలన్నింటిలోనూ రోజు రోజుకు తీవ్రంగా పెరుగుతున్నాయి. మానసిక వ్యాధులు సంభవించడంలో కుల, మత, భాష, జాతి, దేశ, ప్రాంతీయ, లైంగికపరమైన భేదాలు లేవు. పిల్లలు, యువకులు, పెద్దలు, వృద్ధులలో ఎవరైనా ఈ రుగ్మతకు గురికావచ్చును. ఆర్థికంగా వెనుకబడ్డ ఆఫ్రికా దేశాలు, అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలతో పాటు పాశ్చాత్య దేశాలలో కూడా మానసిక వ్యాధులు రోజు రోజుకు తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది వివిధ రకాల మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. స్కిజోఫ్రీనియా అనే తీవ్ర మానసిక వ్యాధి లేని దేశం లేదు. డిప్రెషన్‌కి గురయ్యి ఆత్మహత్యలు చేసుకోని ప్రాంతం లేదు. అవి లేని రోజును మనం చూడలేకపోతున్నాం.

వైద్య సేవలు పొందలేరా ?

సైన్స్ జర్నల్ లాన్సెట్‌లో 2016లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం ..దేశంలో మానసిక వైద్య సహాయం అవసరమైన ప్రతి 10 మందిలో కేవలం ఒక్కరే అలాంటి సేవలు పొందగలుగుతున్నారని చెప్పింది. దేశంలో వేగంగా చోటు చేసుకుంటున్న వారి విభిన్న మార్పులు మానసిక సమస్యలకు దారితీస్తున్నాయని, నగరాలు విస్తరిస్తుండడం, ఆధునిక వసతులు, చాలామంది సొంతూళ్లు, నగరాలను వీడి కొత్త నగరాలకు మారుతుండడం వంటివన్నీ ప్రజల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయని, ఈ క్రమంలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు కుంగుబాటుకు దారితీయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఏటా మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారి సంఖ్య ఇలాగే కొనసాగితే పదేళ్ల తర్వాత ప్రపంచంలో మానసిక సమస్యల బారిన పడిన వారిలో మూడింట ఒక వంతు భారతీయులేనని 2016 నివేదిక పేర్కొంది. దేశంలో మానసిక సమస్యలు పెరిగిపోతుంటే మానసిక వైద్య నిపుణుల కొరత కూడా అంతకు మించి పెరుగుతుంది. ఏడేళ్ల క్రితం జరిగిన జాతీయ మానసిక ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 80 శాతం బాధితులకు తగిన చికిత్స అందుబాటులో లేనే లేదు. భారత్‌లో మానసిక నిపుణుల సిబ్బంది సంఖ్య చాలా తక్కువగా ఉంది. పది లక్షల మందికి ముగ్గురు వైద్యులే ఉన్నారు. భారత్‌లో మానసిక నిపుణులు, సిబ్బంది సంఖ్య 15 వేల లోపే, కానీ ప్రస్తుత అవసరాల పరంగా చూసుకుంటే మరో 10 వేలకు పైగా సిబ్బంది అవసరం ఉంది.

వ్యాధుల లక్షణాలు

నిద్ర లేదా ఆహారపు అలవాట్లలో పెద్ద మార్పులు, చిరాకు, కోపం, ఆవేశం, ఆందోళన, అనుమానపడటం, కొన్ని సందర్భాల్లో దాడులు చేయడం. అతి విచారం, పదే పదే వ్యతిరేకమైన ఆలోచనలు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి దూరంగా గడపటం. ఆనందించే విషయాలపై ఆసక్తి కోల్పోవడం. అనవసరపు ఆందోళనలు లేదా భయాలు. వ్యక్తిగత వస్త్రధారణ, పరిశుభ్రతను విస్మరించడం, సెక్స్ డ్రైవ్‌లో విపరీత ధోరణులు లేదా మార్పులు, నిషేధిత మత్తు లేదా ఆల్కహాల్, కల్తీ కల్లు వాడటం చేసిన పనులను పదే పదే చేయడం లేదా ముట్టడం. వాస్తవికతకు అనుగుణంగా లేని అనవసరపు ఆలోచనలు ఇతరులు చేయలేని విషయాలను చూడటం లేదా వినడం. ఆత్మహత్య గురించి ఆలోచించడం లేదా మాట్లాడటం లాంటివి..

సమస్యలకు భయపడవద్దు..

మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రస్తుతం సైన్స్ ఒక దశకు వచ్చింది, మానసిక ఆరోగ్యంలో నివారణ అనేది మానసిక ఆరోగ్య రుగ్మతలు , వాటి సంబంధిత వైకల్యాల సంభవం, వ్యాప్తి పునరావృతతను తగ్గించడం. ప్రివెంటివ్ మెథడ్స్, రిస్క్ ఎక్స్‌పోజర్‌ను తగ్గించడం, వ్యక్తి యొక్క కోపింగ్ మెకానిజమ్‌లను బలోపేతం చేయడంపై ఆధారపడి ఉంటాయి. ఇక బాగ చదివి ఉన్నత పదవుల్లో ఉన్నవారు, ఆర్థికంగా స్థిరత్వం కలిగినవారే సైన్స్‌ను నమ్మకుండా మూడ నమ్మకాలు, ఆచారాలు, అనాగరిక వైద్యం పేరుతో నిస్సహాయతకు లోనవుతుంటే చదువుకోలేని సామాన్య ప్రజానీకం పరిస్థితి ఏమిటి? ప్రజలు సరైన దృక్పథాలను అలవరచుకోవాలి. ప్రస్తుతమున్న స్థితిగతులను మార్చుకోవాలి. ‘సమస్య మనల్ని ఓడించకూడదు, మనమే సమస్యలను ఓడించాలి. అన్న అబ్దుల్‌ కలాం మాటలను గుర్తుకు తెచ్చుకోవాలి. మానసిక ఆరోగ్యం పరిస్థితి తీవ్రతరం కాకముందే మానసిక వైద్య నిపుణులను సంప్రదించడం మంచిదని గుర్తుంచుకోండి.

డా. బి.హర్షిణి.(ఎండీ)

సైకియాట్రీ రెసిడెంట్

85010 61659

Tags:    

Similar News